కిరణజన్య సంయోగక్రియ మూలం!

మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్‌నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్‌ డయాక్సైడ్‌, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి.

Published : 10 Jan 2024 04:52 IST

మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్‌నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్‌ డయాక్సైడ్‌, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. వ్యర్థంగా మిగిలే ఆక్సిజన్‌ను బయటకు వదులుతాయి. దీన్ని పీల్చుకునే సమస్త ప్రాణికోటి జీవిస్తోంది. ఆల్గే, సయానోబ్యాక్టీరియా కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. ఇంతకీ ఈ ప్రక్రియ ఎలా పరిణామం చెందింది? దీనికి సంబంధించిన జాడలు ఇటీవలే బయటపడ్డాయి.

 బెల్జియం శాస్త్రవేత్తలు ఇటీవల 175 కోట్ల క్రితం నాటి రాళ్లలో కిరణజన్య సంయోగక్రియ నిర్మాణాలు గల సయానోబ్యాక్టీరియా శిలాజాలను గుర్తించారు. ఇలాంటి నిర్మాణాల్లో ఇప్పటివరకూ అతి పురాతనమైనవి ఇవే. కిరణజన్య సంయోగ క్రియ ఎలా పరిణామం చెందిందో తెలుసు కోవటానికివి తోడ్పడతాయని భావిస్తున్నారు. ఈ శిలాజాల్లోని బ్యాక్టీరియా చాలా చాలా చిన్నగా.. మిల్లీమీటరు కన్నా తక్కువ సైజులో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిల్లో పొరతో కూడిన తిత్తులు (థైలకాయిడ్స్‌) ఉన్నాయి. వీటిల్లోనే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. నిజానికి అన్ని సయానో బ్యాక్టీరియాలో థైలకాయిడ్స్‌ ఉండవు. అందువల్ల ఈ పరిశోధన చాలా ముఖ్యమైందని భావిస్తున్నారు. కిరణజన్య సంయోగక్రియను సమర్థంగా నిర్వహించే ఇవి తొలిసారి ఎప్పుడు పరిణామం చెందాయనేది ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదు. తాజా శిలాజాల ఉనికితో దీని గుట్టు బయటపడినట్టయ్యింది. ఇది కనీసం 175 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. నిజానికి అతి పురాతన సయానోబ్యాక్టీరియా శిలాజాల వయసు 200 కోట్ల సంవత్సరాలు. అయితే వాటిల్లో భూరసాయన ఆనవాళ్ల వంటి ఇతర రుజువులు కనిపించాయి. ఇవన్నీ కిరణజన్య సంయోగక్రియ వయసు ఇంకా ఎక్కువేనని తెలియజేస్తున్నాయి. వయసు ఎంతైనా కావొచ్చు గానీ 240 కోట్ల ఏళ్ల క్రితం మన భూ వాతావరణంలో ఆక్సిజన్‌ పోగుపడటానికి సయానోబ్యాక్టీరియానే దారితీసిందనేది శాస్త్రవేత్తల విస్తృతాభిప్రాయం. అప్పట్లో ఈ బ్యాక్టీరియాలో థైలకాయిడ్స్‌ ఏర్పడి ఉండొచ్చని, ఇవి భూమ్మీద ఆక్సిజన్‌ పెరగటానికి కారణమై ఉండొచ్చని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పురాతన రుజువులు ఇప్పుడు బయటపడటంతో ఒక స్పష్టత వచ్చినట్టయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని