గోబర్‌ గ్యాస్‌ రాకెట్‌!

గోబర్‌ గ్యాస్‌తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్‌కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్‌ ఇంజిన్‌నే రూపొందించింది.

Published : 31 Jan 2024 00:05 IST

గోబర్‌ గ్యాస్‌తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్‌కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్‌ ఇంజిన్‌నే రూపొందించింది.

రాకెట్‌ ఇంజిన్లలో రకరకాల ఇంధనాలు వాడు తుంటారు. చాలావరకు బాగా శుద్ధి చేసిన కిరోసిన్‌ను ఉపయోగిస్తుంటారు. దీనికి భిన్నంగా జపాన్‌కు చెందిన ఇంటర్‌స్టెల్లార్‌ టెక్నాలజీస్‌ అనే అంకుర సంస్థ పర్యావరణ హిత రాకెట్‌ ఇంజిన్‌ను రూపొందించింది. దీని పేరు జీరో. ఇది ఆవు పేడ నుంచి తీసిన బయోమీథేన్‌ వాయువు సాయంతో పనిచేస్తుంది మరి. ఈమధ్యనే దీన్ని విజయ వంతంగా పరీక్షించారు కూడా.

వాతావరణంలోకి అదనంగా కార్బన్‌ డయాక్సైడ్‌ను వెదజల్లకుండా, చిన్న రాకెట్లను అంతరిక్షంలోకి పంపటం జీరో ఇంజిన్‌ ఉద్దేశం. నిజానికి బయోమీథేన్‌ పూర్తిగా ఉద్గార రహితమేమీ కాదు. ఇది మండినప్పుడూ బొగ్గుపులుసు వాయువు విడుదలవుతుంది. కానీ శిలాజ ఇంధనాలతో పోలిస్తే దీంతో వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదును తటస్థమని చెప్పుకోవచ్చు. సహజంగా ఉత్పత్తి అయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌కు ఇది అదనపు వాయువునేమీ జోడించదు. రోజురోజుకీ రాకెట్‌ ప్రయోగాలు ఊపందుకుంటున్నందున పర్యావరణం మీద వీలైనంత తక్కువ దుష్ప్రభావం పడేలా చూడటానికి ప్రాధాన్యం పెరుగుతోంది. మున్ముందు అంతరిక్ష పర్యటనలు కొనసాగాలంటే ఇది మరింత అవసరం. ఈ నేపథ్యంలో వినూత్న జీరో రాకెట్‌ ఆసక్తి కలిగిస్తోంది. నిశ్చల ప్రయోగ పరీక్షలో మంచి సామర్థ్యాన్ని కనబరచింది. ఇది 10 సెకండ్ల పాటు నీలి మంటను వెలువరించింది. ఇంతకుముందు యూరోపియన్‌ స్పేస్‌ ఏజేన్సీ కూడా ఆవు పేడ గ్యాస్‌తో పనిచేసే ఇంజిన్‌ను రూపొందించింది. అయితే ప్రైవేటు రంగంలో దీన్ని తొలిసారి సుసాధ్యం చేసిన సంస్థగా ఇంటర్‌స్టెల్లార్‌ టెక్నాలజీస్‌ పేరు సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని