హ్యామ్‌- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ

మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్‌ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్‌ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్‌ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్‌ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.

Published : 31 Jan 2024 00:04 IST

నుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్‌ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్‌ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్‌ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్‌ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. తన క్యాప్స్యూల్‌లో సుమారు 7 నిమిషాల పాటు భారరహిత స్థితిని అనుభవించింది. అప్పుడు శరీరంలోని వివిధ అవయవాల తీరును తెలుసుకోవటానికి దీనికి వైద్య గ్రాహకాలను అమర్చారు. తులాదండాన్ని లాగటం వంటి తేలికైన పనులను హ్యామ్‌ నిర్వహించింది. అరటి పండు ముక్కలను బహుమతిగా ఇవ్వటం అలవాటు చేయటం ద్వారా ఆయా పనులు చేసేలా తర్ఫీదు ఇచ్చారు మరి. కిందికి వచ్చే సమయంలో దీని క్యాప్స్యూల్‌ అట్లాంటిక్‌ మహా సముద్రంలో నిర్ణీత స్థలంలో కాకుండా 130 మైళ్ల దూరంలో దిగింది. నీటిలో మునిగిపోకుండా హెలికాప్టర్‌ ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రయోగం జరిగి నేటికి 63 ఏళ్లు. 1961లో సరిగ్గా ఇదే రోజున హ్యామ్‌ అంతరిక్షంలోకి వెళ్లింది. ఇది జరిగిన మూడు నెలల తర్వాత ముగ్గురు వ్యోమగాములను నాసా అంతరిక్షంలోకి పంపించింది. ఇంతకీ హ్యామ్‌ అంటే? చింపాంజీని అంతరిక్షంలోకి పంపటానికి సిద్ధం చేసిన హోలోమ్యాన్‌ ఏరోస్పేస్‌ మెడికల్‌ (హెచ్‌ఏఎం) సెంటర్‌ పొడి అక్షరాలను కలిపి ఆ పేరు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని