కీటకం ఈత గుట్టు

కీటకాలకు ఒలింపిక్‌ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్‌ బీటిల్‌ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు

Published : 17 Jan 2024 00:04 IST

కీటకాలకు ఒలింపిక్‌ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్‌ బీటిల్‌ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు. ప్రతి సెకండుకు 100 మీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. అంతేనా? శరీర పొడవును బట్టి చూసినా దీని ఘనతే వేరు. వంద శరీర పొడవుల దూరాన్నయినా సెకండులోనే ఈదగలదు. ఇది ప్రతి సెకండుకు ఒక మీటరుతో సమానం. ఇన్నాళ్లూ వర్లిగిగ్‌ బీటిల్‌ ఈడ్పు ఆధారిత థ్రస్ట్‌ వ్యవస్థ మీద ఆధారపడుతోందని భావిస్తున్నారు. అంటే కాళ్ల సాయంతో ఈతలో వేగాన్ని సాధిస్తోందని అనుకుంటున్నారు. కానీ ఇది పైకి లేచే థ్రస్ట్‌ను వాడుకుంటున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అంటే విమానాలు పైకి లేవటానికి తోడ్పడే విధానం వంటి దాన్ని ఈదటానికి ఉపయోగించు కుంటోందన్నమాట. ఇందు కోసం కాళ్లను ఒక ప్రత్యేకమైన రీతిలో కదిలిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇలా కాళ్లను కదిలించటం వల్లనే పైకి లేపే బలం పుట్టుకొస్తోంది. ఇది విమానాన్ని రెక్కలు గాల్లోకి లేపినట్టుగా కీటకాన్ని లేపుతుంది. కాకపోతే దీన్ని పైకి లేపే బలం నీటి అడుగున ఏర్పడుతోంది. హైస్పీడ్‌ కెమెరా దృశ్యాల సాయంతో పరిశోధకులు ఈ గుట్టును ఛేదించారు. వర్లిగిగ్‌ బీటిల్‌ కాళ్లు పాక్షికంగా ప్రొపెలర్‌ మాదిరిగా తిరుగుతున్నట్టు, ఫలితంగా నీటి ఉపరితలం వద్ద లంబంగా థ్రస్ట్‌ ఏర్పడుతున్నట్టు తేలింది. దీని మూలంగానే అది వేగంగా ముందుకు కదలటం సాధ్యమవుతోంది. ఈ అధ్యయన ఫలితాలు మానవ రహిత రోబో నౌకల రూపకల్పనకు దారితీయగలవని ఆశిస్తున్నారు. ఇవి నావికా దళానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని