అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక

అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్‌ ఏరియల్‌ గ్రౌండ్‌ ఇంటెలిజెంట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (మ్యాగ్గీ).

Published : 07 Feb 2024 00:58 IST

అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్‌ ఏరియల్‌ గ్రౌండ్‌ ఇంటెలిజెంట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (మ్యాగ్గీ). పూర్తిగా సౌరశక్తితోనే పనిచేస్తుంది. విమానం మాదిరిగా రెక్కలతో కూడిన ఇది హెలికాప్టర్‌ మాదిరిగా నిట్టనిలువుగా పైకి లేవగలదు, కిందికి దిగగలదు (వీటీఓఎల్‌). ఇంజెన్యూటీ హెలికాప్టర్‌ పుణ్యమాని అంగారకుడి మీద వ్యోమనౌక ప్రయాణాలు రోజురోజుకీ ఆసక్తి కలిగిస్తున్నాయి. పర్‌సెవెరాన్స్‌ రోవర్‌తో అక్కడికి వెళ్లిన ఇంజెన్యూటీ కేవలం ఐదు ప్రయాణాలే చేయగలదని అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అది 72 సార్లకు పైగా అంగారకుడి మీద చక్కర్లు కొట్టి ఆశ్చర్యపరచింది. మ్యాగ్గీ కూడా అలాంటి చిత్రాలే చేయగలదని భావిస్తున్నారు. అధునాతన కోఫ్లో జెట్‌ పరిజ్ఞానంతో తయారుచేసిన దీని వీటీఓఎల్‌ విధానం అంగారకుడి మీదే కాకుండా భూమ్మీదా నిట్ట నిలువుగా పైకి లేచి, కిందికి దిగే విమానాల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని ఆశిస్తున్నారు. తక్కువ సాంద్రతో కూడిన అంగారకుడి వాతావరణంలో ఎదురయ్యే అడ్డంకులను మ్యాగ్గీ అధిగమించగలదని, సంప్రదాయ సబ్‌సోనిక్‌ విమానాల కన్నా మెరుగ్గా రాణించగలదని భావిస్తున్నారు. ఇది అక్కడ ఏడాదికి 16,048 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. వాతావరణంతో పాటు అంగారకుడి విశ్లేషణకు సంబంధించిన అధ్యయనాలనూ నిర్వహిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని