బొగ్గు దాణా!

బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు

Published : 10 Jan 2024 04:52 IST

బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. బొగ్గు నుంచి ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసి, దాన్నుంచి పశువుల దాణా తయారు చేయొచ్చని నిరూపించారు మరి.

ప్రపంచవ్యాప్తంగా పశువుల మేతకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోతోంది. దీన్ని అధిగ మించటానికి చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. బొగ్గు నుంచి తీసిన ఇథనాల్‌ సాయంతో ప్రొటీన్‌ను తయారు చేయటం, దీన్ని దాణా ఉత్పత్తికి వాడుకోవటం ఇందులోని కీలకాంశం. పందులు, చేపల పెంపకంలో చైనా అగ్రగామి అయినప్పటికీ దాణా విషయంలో తీవ్రమైన కొరత ఎదుర్కొంటోంది. ఈ సమస్యను పరిష్కరించటానికి శాస్త్రవేత్తలు బయోటెక్నాలజీ వైపు దృష్టి సారించారు. రకరకాల ప్రయోగాలు చేసి, చివరికి బొగ్గు నుంచి తీసిన ఇథనాల్‌ను ముడిసరుకుగా వాడుకొని పులియబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒకరకం ఈస్ట్‌ అయిన పిచియా పాస్టొరిస్‌ ఇథనాల్‌ను ఆహారంగా తీసుకొని బాగా ఎదుగుతుంది. ఈ క్రమంలో ప్రొటీన్‌ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఒక లీటరు ఇథనాల్‌ నుంచి 120 గ్రాముల ముడి ప్రొటీన్‌ ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. అందువల్ల ఇది చవకైన పద్ధతి కాగలదని ఆశిస్తున్నారు. పైగా దీనికి బంజరు భూముల అవసరమేమీ ఉండదు. కాబట్టి కాలాలు మారినా దీనిపై ప్రభావం పడదు. సంప్రదాయ పద్ధతుల కన్నా ఇది వెయ్యి రెట్లు ఎక్కువ సమర్థంగా ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో పుట్టుకొచ్చిన ప్రొటీన్‌లో అన్నిరకాల అమైనో ఆమ్లాలు, విటమిన్లు, అకర్బన లవణాలు, కొవ్వులు, పిండి పదార్థాలు ఉండటం విశేషం. పోషకాల మోతాదులు అధికంగా ఉండటం వల్ల చేపల మేత, సోయాబీన్స్‌, మాంసం, వెన్న తీసిన పాల పొడి వంటి రకరకాల ఉత్పత్తులను తయారుచేయటానికీ వాడుకోవచ్చు. అందుకే బొగ్గు ఇథనాల్‌ను తినే ఈస్ట్‌తో పెద్దఎత్తున ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయటం మీదా ఇప్పుడు దృష్టి సారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని