ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్స్‌..గమనించారా..! 

ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం గూగుల్ తాజాగా మరో ఆరు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఇవి ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అధిక భద్రతను కల్పించడంతో పాటు యూజర్స్‌కి మెరుగైన సేవలను అందిస్తాయని తెలిపింది.... 

Published : 27 Feb 2021 12:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కొద్దిరోజుల క్రితం ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం ఎమోజీ కిచెన్, ఆటో-నెరేటెడ్ ఆడియో బుక్స్ వంటి ఫీచర్స్‌ను తీసుకొచ్చింది గూగుల్. తాజాగా మరో ఆరు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఇవి ఆండ్రాయిడ్ ఫోన్‌లకు అధిక భద్రతను కల్పించడంతో పాటు యూజర్స్‌కి మెరుగైన సేవలను అందిస్తాయని గూగుల్ తెలిపింది. ఇంతకీ గూగుల్ తీసుకొచ్చిన ఆరు కొత్త ఫీచర్స్ ఏంటి..అవి ఎలా పనిచేస్తాయనేది చూద్దాం. 


పాస్‌వర్డ్ ప్రొటెక్షన్  

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్ ఖాతాతో లాగిన్ అవుతాం. భవిష్యత్తు అవసరాల కోసం గూగుల్ ఖాతా లాగిన్‌, పాస్‌వర్డ్‌ వివరాలను సేవ్ చేసుకుంటుంటాం. తర్వాత ఏదైనా యాప్ లేదా వెబ్‌ పేజ్‌లో లాగిన్‌ అయ్యేందుకు ఆటోఫిల్‌ ఫీచర్ ద్వారా సదరు వివరాలను ఉపయోగిస్తాం. కొన్నిసార్లు మన ఖాతా పాస్‌వర్డ్‌ సమాచారం హ్యాకర్స్‌ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక మీదట అలాంటి వాటికి చెక్‌ పెడుతూ గూగుల్ పాస్‌వర్డ్ చెక్‌అప్‌ అనే కొత్త ఫీచర్‌ తీసురానుంది. ఇది ఆటోఫిల్ ద్వారా లాగిన్‌ అయ్యేప్పుడు మీ లాగిన్‌ వివరాలు ఎక్కడైనా, ఎవరైనా హ్యాక్‌ చేశారా లేదా అనేది చెక్ చేస్తుంది. 

ఒకవేళ ఈ సమాచారం ఎక్కడైనా బహిర్గతం అయినట్లు గుర్తిస్తే పాప్‌-అప్‌ విండో ద్వారా మీకు అలర్ట్‌ మెసేజ్ కనిపిస్తుంది. అంతేకాదు మీ ఖాతా పాస్‌వర్డ్ మార్చుకోమని సూచిస్తుంది. ఆండ్రాయిడ్ 9 వెర్షన్‌ నుంచి ఆపై ఓఎస్‌ వెర్షన్స్ ఉపయోగించే వారికి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్ కోసం ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టం ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో లాంగ్వేజెస్ అండ్ ఇన్‌పుట్ ఓపెన్ చేసి అడ్వాన్స్‌డ్ ఆప్షన్‌లోకి వెళ్లి ఆటోఫిల్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.  


షెడ్యూల్ మెసేజెస్  

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్స్‌ మెసేజింగ్ యాప్‌ను వాడుతున్నారు. వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా గూగుల్ షెడ్యూలింగ్ మెసేజెస్ ఫీచర్ తీసురానుంది. ఆండ్రాయిడ్ 7 ఓఎస్‌ నుంచి ఆపై వెర్షన్ ఓఎస్‌ యూజర్స్‌కి ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. జీమెయిల్ తరహాలోనే మీకు కావాల్సిన సమయానికి మెసేజ్‌ను అవతలి వ్యక్తులకు చేరేలా షెడ్యూల్ చెయ్యొచ్చు. మెసేజ్‌ టైప్ చేసిన తర్వాత సెండ్‌ బటన్‌ హోల్డ్‌ చేసి ప్రెస్ చేస్తే మీకు టైం, తేదీ ఐచ్ఛికాలు కనిపిస్తాయి. దాని ప్రకారం మీరు పంపాలనుకున్న టైం, తేదీకి షెడ్యూల్ చేసుకుంటే చాలు. 


టాక్‌బ్యాక్ స్క్రీన్‌ రీడర్ 

అంధులు, దృష్టిలోపం ఉన్నవారి కోసం ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది గూగుల్. అదే టాక్‌బ్యాక్ ఫీచర్. ఇది యూజర్‌కి ఆండ్రాయిడ్‌ స్క్రీన్‌ని చదివి వినిపిస్తుంది. దీని వల్ల యూజర్ స్క్రీన్ చూడకుండానే ఫోన్ ఉపయోగించిన అనుభూతిని పొందుతారు. పరీక్షల దశలో ఈ ఫీచర్ సత్ఫలితాలను ఇచ్చినట్లు గూగుల్ తెలిపింది. మాటలు, సంజ్ఞలను ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగించాలకునే యూజర్స్ గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆండ్రాయిడ్ యాక్సెస్‌బిలిటీ యాప్స్‌ని అప్‌డేట్ చేసుకోవాలి. 


అసిస్టెంట్ మరింత ఆకర్షణీయంగా  

గతంలో కంటే మరిన్ని మెరుగైన సేవలు అందించేదుకు గూగుల్  అసిస్టెంట్‌లో కీలక మార్పులు చేశారు. ఇందులో భాగంగా ఫోన్ లాక్‌ చేసినా గూగుల్ అసిస్టెంట్ సాయంతో కొన్ని టాస్క్‌లను పూర్తి చెయ్యొచ్చు. ఫోన్ కాల్స్, మెసేజెస్‌, అలారం, మ్యూజిక్ వంటి పనులు వాయిస్ కమాండ్‌తో పూర్తవుతాయి. గతంలో వీటి కోసం టెక్ట్స్‌ మెసేజ్‌లు టైప్ చేసేవారు. ఇక మీదట ఆ అవసరంలేదు. లాక్‌స్క్రీన్‌ ఆన్‌ చేసి హేయ్ గూగుల్ కమాండ్‌తో మీ కావాల్సిన పనికి సంబంధించిన ఆదేశం ఇస్తే సరిపోతుంది. 


గూగుల్ మ్యాప్స్‌ డార్క్‌మోడ్‌  

గూగుల్ మ్యాప్స్‌లో డార్క్‌మోడ్ ఫీచర్‌ను పరిచయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యూజర్స్‌ అందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ కోసం గూగుల్ మ్యాప్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి థీమ్‌లో ‘ఆల్వేస్‌ ఇన్‌ డార్క్‌ థీమ్’ ఎంపిక చేయాలి.  


ఆండ్రాయిడ్ ఆటో షార్ట్‌కట్స్‌ 

ఆండ్రాయిడ్ ఆటోలో కూడా మార్పులు చేశారు. ఇందులో కొత్తగా కస్టమ్ వాల్‌పేపర్స్, పర్సనలైజ్ బ్యాక్‌గ్రౌండ్స్‌, వాయిస్ యాక్టివేటెడ్ గేమ్స్‌ను ఇస్తున్నారు. వాటితో పాటు వాతావరణం, గూగుల్ మ్యాప్స్, మీడియా కంట్రోల్స్‌కి సంబంధించి కొన్ని షార్ట్‌కట్ ఫీచర్స్ తీసుకొచ్చారు. ఒకవేళ మీతో పాటు కుటుంబసభ్యులు, స్నేహితులు ప్రయాణిస్తుంటే ఆండ్రాయిడ్‌ ఆటో ఓపెన్ చేసిన వెంటనే వారికి కనిపించకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రైవసీ స్క్రీన్‌ ఫీచర్‌ కూడా ఇస్తున్నారు. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ 6.0 వెర్షన్ ఓఎస్‌తో పనిచేసే ఫోన్లకు కూడా ఆండ్రాయిడ్ ఆటోను పరిచయం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని