Windows 11: కొత్త మార్పుల గురించి తెలుసా..?

మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విండోస్‌ 11ను ఇటీవల విడుదల చేసింది. గత విండోస్‌ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో ఎన్నో కీలక మార్పులు చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా తాజా వెర్షన్ అప్‌డేట్ కోసం కంప్యూటర్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉండాలని తెలిపింది....

Updated : 02 Jul 2021 22:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విండోస్‌ 11ను ఇటీవల విడుదల చేసింది. గత విండోస్‌ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో ఎన్నో కీలక మార్పులు చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా తాజా వెర్షన్ అప్‌డేట్ కోసం కంప్యూటర్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉండాలని తెలిపింది. అలానే సిస్టం విండోస్‌ 11తో అప్‌డేట్ అవుతుందా లేదా అని తెలుసుకునేందుకు పీసీ హెల్త్‌ అనే యాప్‌ను కూడా తీసుకొచ్చింది. అయితే విండోస్‌ 11లో తీసుకొచ్చిన ఫీచర్లలో మైక్రోసాఫ్ట్ త్వరలో కొన్ని మార్పులు చేయనున్నట్లు  సమాచారం. మరి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం. 


ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 

విండోస్‌ 11 నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తొలగించనున్నారు. గతేడాదే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్‌ 10కి ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (ఐఈ) సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2022 తర్వాత ఈ బ్రౌజర్‌ అందుబాటులో ఉండదని తెలిపింది. దానికి బదులు యూజర్స్‌ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ బ్రౌజర్‌ను ఉపయోగించాలని సూచించింది. కానీ, విండోస్‌ 11లో అధికారికంగా ఎక్స్‌ప్లోరర్ అందుబాటులో లేనప్పటికీ..యూజర్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌లో ఐఈ మోడ్‌ తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ విండోస్‌ 8/8.1 ఓఎస్‌ను ఉపయోగిస్తున్న యూజర్స్‌ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను 2022 వరకు ఉపయోగించవచ్చు.


కొర్టానాకు బైబై 

యాపిల్ సిరి, అమెజాన్‌ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లకు పోటీగా మైక్రోసాఫ్ట్ కొర్టానా వాయిస్ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి యూజర్స్‌ నుంచి ఆశించినంత స్పందన లేకపోవడం..విండోస్‌ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొర్టానా వాయిస్‌ బాగోలేదని పలువురు యూజర్స్‌ ఫిర్యాదులు చేయడంతో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకంది. విండోస్‌ 11లో కొర్టానా వాయిస్‌ వినిపించకుండా మార్పులు చేసింది. ఇక మీదట విండోస్‌ యాప్‌గా మాత్రమే కొర్టానా అందుబాటులో ఉండనుంది. దీనిని ఉపయోగించాలకుంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


ట్యాబ్లెట్ మోడ్ 

డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ ఉపయోగించే వారికోసం విండోస్‌ 10లో ట్యాబ్‌లెట్ మోడ్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది విండోస్‌ 10 ఓఎస్‌ను మరింత టచ్‌-ఫ్రెండ్లీగా మార్చడంతోపాటు యూజర్‌ ఎక్కువసార్లు కీబోర్డు ఉపయోగించకుండా ట్యాబ్‌ తరహా అనుభూతిని అందిస్తుంది. విండోస్‌ 11లో ట్యాబ్లెట్ మోడ్‌కు కొత్త హంగులు జోడించి..మరింత టచ్‌, యూజర్ ఫ్రెండ్లీగా మార్చనున్నట్లు సమాచారం.  


నో..క్విక్‌స్టేటస్‌ 

విండోస్‌ 10లో భవిష్యత్తులో రాబోయే యాప్‌ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్‌డేట్లను క్విక్‌స్టేటస్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండేది. అయితే విండోస్‌ 11లో క్విక్‌స్టేటస్‌ ఫీచర్‌ను తొలగించనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దాని స్థానంలో డెస్క్‌టాప్ విడ్జెట్స్‌ ఆ పని చేస్తాయని తెలిపింది. 


స్టార్ట్‌మెనూ అడ్జస్ట్‌ చేయలేం 

విండోస్‌ 11లో స్టార్ట్ మెనూను ఎడమవైపు నుంచి మధ్యలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి దీన్ని మీకు నచ్చిన చోటుకు మార్చుకునే సదుపాయం ఉంది. అంటే మధ్య నుంచి ఎడమకి జరిపి సైజ్‌ కూడా మార్చుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్ తొలగించనుంది. అయితే ఎప్పటిలానే మీకు నచ్చిన యాప్‌లు, వెబ్‌సైట్‌లను స్టార్ట్‌ మెనూకి పిన్ చేసుకోవచ్చు. అలానే లైవ్‌ టైల్స్‌ స్థానంలో విడ్జెట్స్‌, పిన్డ్‌ యాప్స్‌ను తీసుకురానున్నట్లు సమాచారం.    


టాస్క్‌బార్‌లో మార్పులేంటి 

గత ఓఎస్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌తో పోలిస్తే మైక్రోసాఫ్ట్‌ తాజా అప్‌డేట్‌లో ఎన్నో మార్పులు చేసింది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది టాస్క్‌బార్‌ గురించే. విండోస్‌ 10లో టాస్క్‌బార్‌లో తీసుకొచ్చిన పీపుల్ ఐకాన్ సింబల్‌తోపాటు, కొన్ని ట్రే ఐకాన్స్‌ను విండోస్‌ 11లో తొలగించనున్నారు. గతంలో మాదిరి టాస్క్‌బార్‌లో మార్పులు చేసుకునే వెసులుబాటు కూడా ఉండదని తెలుస్తోంది.  


ఆ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే 

గతంలో విండోస్‌ 10 విడుదల సమయంలో త్రీడీ వ్యూయర్‌, వన్‌నోట్ వంటి యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌గా ఉండబోవని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. తాజాగా విండోస్‌ 11లో కూడా పెయింట్ త్రీడీ, స్కైప్ వంటి యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌గా రావని తెలిపింది. యూజర్స్ వాటిని మైక్రోసాఫ్ట్‌ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ విండోస్ 10 నుంచి 11కి అప్‌గ్రేడ్ అవుతుంటే మాత్రం ఈ యాప్‌లు అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని