Tech Companies: వాట్సాప్‌ టు స్నాప్‌చాట్‌.. ఈ టెక్‌ దిగ్గజాల మూలాలు ఉక్రెయిన్‌లోనే!

రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన పోరాట పటిమను ప్రదర్శిస్తూ ప్రంపచ దృష్టిని ఆకర్షించింది ఉక్రెయిన్‌. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే సోషల్‌ మీడియా యాప్‌ల వెనుక ఉక్రెయిన్‌ వాసులున్నారనేది చాలా మందికి తెలియని విషయం. మరి ఆ యాప్‌లేంటో చూద్దాం. 

Published : 18 Mar 2022 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన పోరాట పటిమను ప్రదర్శిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఉక్రెయిన్‌. అప్పటి వరకు ఆ దేశం గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే. వైద్య విద్య, విమాన తయారీ మినహా ఆ దేశం పేరు పెద్దగా వార్తల్లో కనిపించేది కాదు. తాజా పరిణామాలతో మరోసారి ఉక్రెయిన్‌ గురించి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఏటా ఎంతో మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్‌కు వెళుతుంటారు. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాన్ని ఉక్రెయిన్ తయారు చేసింది. ఇవన్నీ ఒకవైపు అయితే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్‌, స్నాప్‌చాట్, పేపాల్‌, గ్రామర్‌లీ వంటి టెక్నాలజీలను అభివృద్ధి చేసింది ఉక్రెయిన్‌ మూలాలున్న వ్యక్తులే అన్న విషయం చాలా మందికి తెలియదు. అలా ఉక్రెయినీయన్ల చేతుల్లో రూపుదిద్దుకున్న యాప్‌లు చాలానే ఉన్నాయి.. అవేంటంటే..?


వాట్సాప్‌ (WhatsApp)

మనలో చాలా మందికి వాట్సాప్‌.. మెటా (ఫేస్‌బుక్‌)కు చెందిన కంపెనీగా మాత్రమే తెలుసు. కానీ, 2014లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. దానికి ముందు 2009లో యాహూ కంపెనీ మాజీ ఉద్యోగులు బ్రియాన్‌ యాక్టన్‌, జాన్‌ కౌమ్‌ వాట్సాప్‌ను అభివృద్ధి చేశారు. వీరిలో జాన్‌ కౌమ్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో జన్మించారు. ఫస్టివ్‌ నగరంలో ఆయన బాల్యం గడించింది. జాన్‌ పదహారేళ్ల వయసులో తల్లి, బామ్మతో కలిసి కాలిఫోర్నియాలోని మౌంటెన్‌ వ్యూకు వలస వచ్చారు. అలా ఉక్రెయిన్ మూలాలున్న వ్యక్తి చేతుల్లో రూపుదిద్దుకుంది వాట్సాప్‌ మెసేజింగ్‌ యాప్‌.


స్నాప్‌చాట్‌ (Snapchat)

ఫొటో మెసేజింగ్‌ యాప్‌గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన స్నాప్‌చాట్‌ కూడా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, మరో నగరం జపోరియాలో కార్యాలయాలను నిర్వహిస్తోంది. స్నాప్‌చాట్‌ యాప్‌లో పాపులర్‌ అయిన ఫేస్ మాస్క్‌ సాంకేతికతను ఉక్రెయిన్‌లోని మూడో అతిపెద్ద నగరం ఒడెస్సాలోని లుక్సెరీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. లుక్సెరీ కంపెనీని 2015లో స్నాప్‌చాట్‌ సొంతం చేసుకుంది.


పేపాల్ (PayPal)

అమెరికాకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ పేపాల్‌ కూడా ఉక్రెయిన్ మూలాలున్న వ్యక్తి అభివృద్ధి చేసిందే. పేపాల్‌ సహ వ్యవస్థాపకుడు మాక్స్‌ లెవిచిన్‌ ఉక్రెయిన్‌లో స్థిరపడిన యూదు కుటుంబంలో జన్మించాడు. 1998లో పీటర్‌ థీల్‌, ల్యూక్‌ నోసెక్‌లతో కలిసి మాక్స్‌ పేపాల్‌ను స్థాపించాడు.


రీడ్లీ (Readdle)

ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరం కేంద్రంగా నలుగురు స్నేహితుల కలల ప్రాజెక్టుగా రీడ్లీ రూపుదిద్దుకుంది. ఇది ఒక యాప్‌ డెవలప్‌మెంట్ కంపెనీ. ప్రస్తుతం రీడ్లీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా డాక్యుమెంట్‌ ప్రొడక్టవిటీ టూల్స్‌ను, యాపిల్‌ కంపెనీకి అవసరమైన యాప్‌లను అభివృద్ధి చేస్తోంది. పీడీఎఫ్ ఎక్స్‌పర్ట్‌, స్పార్క్‌, ఫులిక్స్‌, స్కానర్‌ ప్రో వంటి యాప్‌లు ఈ కంపెనీ నుంచి వచ్చినవే.


క్లీన్‌ మై మ్యాక్‌ (Clean My Mac)

యాపిల్‌ మ్యాక్‌ యూజర్లకు అత్యంత సుపరిచితమైన టూల్ క్లీన్‌ మై మ్యాక్‌. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ కేంద్రంగా పనిచేస్తున్న మ్యాక్‌పా అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. త్వరలోనే కీవ్‌ కేంద్రంగా యాపిల్‌ మ్యూజియమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు మ్యాక్‌పా గతేడాది ప్రకటించింది. మ్యాక్‌ కంప్యూటర్లు వినియోగాన్ని సులభతరం చేసేందుకు అవసరమైన అన్ని రకాల యాప్‌లను ఈ సంస్థ రూపొందిస్తోంది. 


జూబుల్‌ (Jooble)

వివిధ దేశాల్లోని ఉద్యోగ సమాచారాన్ని ఆన్‌లైన్‌ వేదికగా జూబుల్‌ కంపెనీ అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 71 దేశాల్లో ఈ సంస్థ తన సేవలను విస్తరించింది. ఈ కంపెనీ కూడా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలోనే స్థాపితమైంది. ఉద్యోగార్థుల అర్హతలకు తగినట్లుగా ఉత్తమమైన ఉద్యోగ అవవకాశాల గురించి తెలియజేయడమే ఈ సంస్థ లక్ష్యం.


రివల్యూట్‌ (Revolut)

వ్లాద్‌ యట్సెంకో, నికోలాయ్‌ స్టోరోన్స్కీ అనే ఇద్దరు వ్యక్తులు రివల్యూట్‌ సంస్థను స్థాపించారు. వీరిలో యట్సెంకో దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌ నగరానికి చెందిన వాడు కాగా, నికోలాయ్‌ రష్యాకు చెందిన వ్యక్తి. రివల్యూట్‌ నగదు నిర్వహణకు సంబంధించిన యాప్‌. ప్రస్తుతం ఈ సంస్థ లండన్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. నగదు నిర్వహణతో పాటు, స్టాక్‌ ఎక్స్చేంజ్‌, నగదు మార్పిడి, ఇన్సూరెన్స్‌ వంటి సేవలను కూడా అందిస్తోంది.


సొలానా (Solana)

సొలానా పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌ ఫ్లాట్‌ఫామ్‌. దీని ద్వారా తక్కువ ఖర్చుతో వేగవంతమైన లావాదేవీలను నిర్వహించవచ్చని కంపెనీ చెబుతోంది. ఎస్‌ఓఎల్‌ పేరుతో సొలాన సంస్థ క్రిప్టో కరెన్సీని కూడా నిర్వహిస్తోంది. సొలానాను స్థాపించిన అనాటోలి యాకోవెంకో ఉక్రెయిన్‌లో జన్మించారు. ఎథిరియమ్‌ ప్రధాన పోటీదారుగా సొలానా ఉంది.


గ్రామర్‌లీ (Grammarly)

గ్రామర్లీ.. వెబ్‌ యూజర్లలో ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరేమో. రోజూ మనం రాసే ఆంగ్ల వాక్యాల్లో అన్వయ లోపాలు, అక్షర దోషాలను సరిచేసే ఉచిత సాఫ్ట్‌వేర్‌గా గ్రామర్లీ ఎంతో మందికి సుపరిచితం. ఈ కంపెనీని ఉక్రెయిన్‌కు చెందిన మాక్స్‌ లిట్విన్‌, అలెక్స్‌ షెవ్‌చెంకో, డిమిత్రో లైడర్‌ అనే ముగ్గురు వ్యక్తులు 2009లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3 కోట్ల మంది గ్రామర్లీని ఉపయోగిస్తున్నారట. ఏటా 14 లక్షల పదాలను విశ్లేషిస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ విలువ 13 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని నిపుణుల అంచనా. 

ఇవేకాకుండా యూరప్‌లోనే అతిపెద్ద డిజిటల్‌ మార్కెటింగ్ కంపెనీ నెట్‌పీక్‌, గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ముఖ్యమైన ఫేస్‌స్వాపింగ్ సాంకేతికతను అందించే రీఫేస్‌ఏఐ కంపెనీ, స్మార్ట్‌ హోమ్‌కు అవసరమైన సెక్యూరిటీ కెమెరాలను అందించే అజాక్స్ సిస్టమ్స్‌, సోషల్‌ మీడియా ప్రవర్తనను విశ్లేషించేందుకు ఉపయోగించే యూస్కాన్‌ అనే టెక్నాలజీ సంస్థలు కూడా ఉక్రెయిన్‌కు చెందినవే. భవిష్యత్తు తరాలకు అవసరమైన అతి ముఖ్యమైన సాంకేతికతను ప్రపంచానికి అందించడంలో ఉక్రెయిన్‌ కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు అదే నగరం రష్యా దాడులతో కకావికలమవుతుండడం బాధాకరం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని