బడి పిల్లలే.. సైబర్‌ అంబాసిడర్లు!

సైబర్‌ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసు మహిళా భద్రత విభాగం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు

Published : 14 Jan 2022 04:59 IST

ఆన్‌లైన్‌ మోసాల తీరుపై విద్యార్థులకు అవగాహన

నేరాల నియంత్రణకు మహిళా భద్రత విభాగం ప్రయోగం

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీసు మహిళా భద్రత విభాగం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను ‘సైబర్‌ అంబాసిడర్లు’ పేరిట ప్రచారకర్తలుగా ఎంపిక చేసింది. సైబర్‌ నేరాలు జరుగుతున్న తీరును వారికి వివరిస్తూ ఆ ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి మెలకువలు నేర్పిస్తున్నారు. మహిళలపై సైబర్‌ వేధింపుల నిరోధానికి గతంలో చేపట్టిన ‘సైబ్‌-హర్‌’కు కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. ఎంపిక చేసిన 6-10 తరగతుల విద్యార్థులకు సైబర్‌ భద్రత నిపుణుడు రక్షిత్‌ టాండన్‌ మార్గదర్శకత్వంలో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల్నీ ఇందులో భాగస్వాములుగా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం తొలివిడత శిక్షణ కొనసాగుతోందని, తర్ఫీదు పొందిన విద్యార్థులు తోటి విద్యార్థులకు, మహిళలకు సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తారని తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తెలిపారు.

నేర్పే అంశాలు

ఇంట్లో కంప్యూటర్‌, చేతిలో చరవాణి ఉన్నా.. వాటిని జాగ్రత్తగా ఎలా వినియోగించాలో చాలా మందికి తెలియదు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాల ద్వారా కొందరు ఆర్థికంగా నష్టపోతుంటే.. మరికొందరు వేధింపుల బారిన పడుతున్నారు. వేధింపులకు గురవుతున్న వారిలో సింహభాగం మహిళలే. వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేయడం మొదలుకొని ఆన్‌లైన్‌ మోసాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాల వరకు విద్యార్థులకు వివరిస్తున్నారు. ప్లేస్టోర్‌, డెస్క్‌టాప్‌ బ్రౌజర్లు, సామాజిక మాధ్యమాలను సురక్షితంగా ఎలా వినియోగించాలి? పోకిరీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎలా వేధిస్తారు? వాటిని అడ్డుకోవడమెలా? హ్యాకింగ్‌ బారిన పడితే బయటపడేదెలా? ఐపీ చిరునామాను ఎలా కనిపెట్టాలి? ఫోన్‌కు అపరిచితుల నుంచి లింకులు వస్తే ఏం చేయాలి? ఆన్‌లైన్‌ గేమ్స్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై మెలకువలు నేర్పిస్తున్నారు. నేర్చుకున్న విషయాలను తోటి విద్యార్థులకు, మహిళలకు వివరిస్తూ వారు సైబర్‌ నేరాలకు పాల్పడకుండా అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.


అవగాహన కల్పిస్తున్నా..

సైబర్‌ అంబాసిడర్‌గా ఎంపిక కాకముందు సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏమీ తెలిసేది కాదు. శిక్షణ ద్వారా చాలా అంశాలపై అవగాహన వచ్చింది. తోటి విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నా.

- నందిని, తొమ్మిదో తరగతి, శివ్వంపేట జడ్పీహెచ్‌ఎస్‌, సంగారెడ్డి జిల్లా


ఇతరులకు చెబుతున్నా..

ఫేస్‌బుక్‌లో మొదట్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టేవాడిని. అది తప్పని శిక్షణ ద్వారా తెలిసింది. ప్రైవసీ సెట్టింగ్‌లు, సైబర్‌ బుల్లీయింగ్‌ నుంచి తప్పించుకోవడం గురించి తెలుసుకున్నా. తోటి విద్యార్థులకూ చెబుతున్నా.

- డి.కార్తీక్‌, తొమ్మిదో తరగతి, గోలపాడు-పోలేపల్లి జడ్పీహెచ్‌ఎస్‌, ఖమ్మం జిల్లా


సర్వే అంశాలతో శిక్షణ కూర్పు

మహిళలే ఎక్కువగా సైబర్‌ వేధింపులు, నేరాలకు గురవుతున్నట్లు సైబర్‌ కాంగ్రెస్‌ ద్వారా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆ అంశాలను ఆధారంగా చేసుకునే శిక్షణ తీరును రూపొందించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.

- సుమతి, డీఐజీ, తెలంగాణ మహిళా భద్రత విభాగం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని