PM Modi: అధికారం పోయినా... అహంకారం పోలేదు

కాంగ్రెస్‌ను, ఆ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. అధికారం పోయినా, వారికి అహంకారం మాత్రం పోలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వచ్చినా అలవాట్లను మాత్రం మార్చుకోలేదని...

Updated : 08 Feb 2022 04:57 IST

తెలంగాణ ఇచ్చినట్టు చెప్పినా అక్కడి ప్రజలు మిమ్మల్ని స్వీకరించలేదు
కాంగ్రెస్‌ లక్ష్యంగా లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు


కరోనా తొలిదశలో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణులు చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ముంబయి రైల్వేస్టేషన్‌ ముందు నిలబడి వలస కార్మికులకు ఉచిత టికెట్లు ఇచ్చారు. స్వస్థలాలకు వెళ్లిపోండని రెచ్చగొట్టారు. కొవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యారు.

- ప్రధాని మోదీ


ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ను, ఆ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. అధికారం పోయినా, వారికి అహంకారం మాత్రం పోలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వచ్చినా అలవాట్లను మాత్రం మార్చుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొన్నా, అక్కడి ప్రజలు వారిని అంగీకరించలేదని ఎద్దేవా చేశారు. ఇక ఎప్పటికీ అధికారంలోకి రాబోమని ఆ పార్టీ నాయకులు నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టున్నారని... అందుకే దేశంలో నకారాత్మక వాతావరణాన్ని విస్తరింపజేసి, వేర్పాటువాదులను బలపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ... ప్రధాని మోదీ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. గత ఏడేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కరోనాను ఎదుర్కొన్న విధానం, ఉపాధి కల్పన, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదుగుతున్న తీరును ఆయన వివరిస్తూనే... కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని శరపరంపరగా విమర్శలు గుప్పించారు.

‘‘గత కొన్నేళ్లలో దేశంలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రజల మధ్య ఉన్నవాళ్లకు ఈ విషయం కచ్చితంగా తెలుస్తుంది. కానీ, మీ (కాంగ్రెస్‌) ఆలోచనలు 2014 వద్దే ఆగిపోయాయి. మిమ్మల్ని మీరు ఒక రకమైన మానసిక స్థితిలో బంధించుకున్నారు. సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినవారు (రాహుల్‌ గాంధీ)... 50 ఏళ్లపాటు తాము అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఒకసారి చరిత్రను గమనించండి. నాగాలాండ్‌లో వారికి అధికారం పోయి 24 ఏళ్లు అయింది. ఒడిశాలో 27 సంవత్సరాలుగా మీకు ప్రవేశం లేకుండా పోయింది. త్రిపుర ప్రజలు 1988లో.. యూపీ, బిహార్‌, గుజరాత్‌ ఓటర్లు 1985లో చివరిసారిగా మీకు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్‌ ప్రజలు దాదాపు 50 ఏళ్ల కిందట మిమ్మల్ని ఎన్నుకొన్నారు. తమిళనాడు ఓటర్లు 1962లో కాంగ్రెస్‌కు చివరిసారిగా ఓటు వేశారు. ఝార్ఖండ్‌ ఏర్పడి 20 ఏళ్లయినా, ఇప్పటివరకూ అక్కడ కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు. ఇక్కడ ప్రశ్న ఎన్నికల ఫలితాల గురించి కాదు... వారి నీతి నియమాల గురించే. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రజలు పదేపదే ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఇన్ని ఓటముల తర్వాతా మీ అహంకారం పోలేదు. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ అహంకారాన్ని పోనివ్వడం లేదు. ఇన్ని రాష్ట్రాలు మిమ్మల్ని తిరస్కరించినా... మేల్కోరా? మీ నేతల ప్రకటనలు, చేష్టలు చూస్తుంటే మరో వందేళ్ల వరకూ అధికారంలోకి రాబోమనే నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అందుకే నేను సిద్ధమయ్యాను.

బురదచల్లాలని భావిస్తున్నారు...

అధికారంలోకి రావాలన్న కోరిక కాంగ్రెస్‌ పార్టీలో ఖతమైపోయింది. కలిసి వచ్చేవారు ఎవరూలేక... కనీసం బురదచల్లే పనైనా చేద్దామని కొందరు నిరాశావాదులు భావిస్తున్నారు. వేర్పాటువాదుల మూలాలను బలోపేతం చేస్తున్నారు. ఇలా చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశం ఎప్పుడూ శ్రేష్ఠంగా ఉంది. ఇకముందూ ఉంటుంది. ఆంగ్లేయుల ‘విభజించు-పాలించు’ సిద్ధాంతాన్ని కాంగ్రెస్‌ అనుసరిస్తోంది. తమిళులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు దేశాన్ని ఛిన్నాభిన్నం చేసే ముఠా (టుక్డే టుక్డే గ్యాంగ్‌)కు నాయకత్వం వహిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా మమ్మల్ని అడ్డుకోలేనివారు... సభలో ఇబ్బందులు సృష్టించడం ద్వారా మమ్మల్ని అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఇందులోనూ వారు విఫలం కావడం తథ్యం.

మహమ్మారిని రాజకీయాల్లోకి లాగారు...

కరోనా కాలంలో కాంగ్రెస్‌ హద్దులన్నీ దాటింది. మహారాష్ట్రపై భారం తగ్గించుకోవడానికని... ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లకు వెళ్లి అక్కడ కరోనా వ్యాపింపజేయండని వలస కార్మికులను ప్రోత్సహించి మహాపాపానికి పాల్పడింది. కాంగ్రెస్‌ విధానాల వల్ల యావద్దేశం ఇబ్బంది పడింది. ఈ దేశం మీది కాదా? ప్రజలు మీవారు కాదా? వారి సుఖదుఃఖాలు మీవి కావా? ఆ పార్టీ గుడ్డి విపక్షం (బ్లైండ్‌ అపోజిషన్‌)గా మారిపోయింది. ఇలాంటి ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి అవమానకరం. కాంగ్రెస్‌ నాయకులు మోదీ పేరు ఉచ్ఛరించకుండా ఉండలేరు. మోదీయే వారికి ప్రాణశక్తి.  మన పారిశ్రామికవేత్తలను వారు కరోనా వైరస్‌ వేరియంట్లుగా అభివర్ణించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? లోపల కూర్చున్నవారికి చెప్పండి... దీనివల్ల నష్టం జరిగేది కాంగ్రెస్‌ పార్టీకే’’ అని మోదీ చురకలు వేశారు.


నెహ్రూ మాటలనూ పెడచెవిన పెట్టారు

నెహ్రూ పేరును మోదీ ప్రస్తావించరని చెబుతుంటారు. ఈరోజు ఆయన పేరు తీసుకుని... వారి దాహాన్ని తీర్చేయాలనుకుంటున్నాను. బాధ్యతల విషయంలో దేశ ప్రథమ ప్రధాని మాట్లాడుతూ- స్వాతంత్య్రంతో పాటు బాధ్యత ఉంటుందని, దాన్ని గుర్తించకపోతే స్వాతంత్య్రాన్ని అర్థం చేసుకోలేరని, దాన్ని కాపాడనూ లేరని చెప్పారు. మీరు ఆయన మాటలను కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని