దేశానికే ఆదర్శం తెలంగాణ బడ్జెట్‌

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని.. ఇది దేశానికే ఆదర్శమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే..

Published : 11 Mar 2022 05:14 IST

ఖాళీలపై భాజపా వ్యాఖ్యలు అవగాహన రాహిత్యం
మోదీ సర్కారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిచ్చిందా?
శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉందని.. ఇది దేశానికే ఆదర్శమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే లేని విధంగా భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే.. కాంగ్రెస్‌, భాజపాలు ఆగమాగమవుతున్నాయని విమర్శించారు. దేశంలో ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన భాజపా ఏడున్నరేళ్లలో 15 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించిందా? అని ప్రశ్నించారు. శాసనమండలిలో బడ్జెట్‌పై గురువారం చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ఇంకా లక్ష ఉద్యోగాలను భర్తీ చేయట్లేదంటూ.. కొందరు బిశ్వాల్‌ కమిటీ నివేదిక గురించి మాట్లాడుతున్నారు. అది పీఆర్‌సీకి సంబంధించిన నివేదిక. 4.92 లక్షల పోస్టులకు 2.99 లక్షల మంది పనిచేస్తున్నారు.. 1.90 లక్షల ఖాళీలని ఆ కమిటీ చెప్పింది. కానీ ప్రభుత్వరంగ సంస్థలు, వర్సిటీల్ని, వక్ఫ్‌ బోర్డు వంటి వాటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల లెక్కల్లో చూపారు. వివిధ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, నిమ్స్‌, జయశంకర్‌ వర్సిటీ వంటి చోట్ల మొత్తం 54,118 మంది ఉద్యోగులు పనిచేస్తుంటే బిశ్వాల్‌ కమిటీ పొరపాటున సున్నాగా చూపింది. ఈ విషయాలు తెలియని, సగం తెలివితేటలున్న నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ 54,118 పోస్టులు పోను, మిగిలిన ఖాళీల్లో పదోన్నతులతో నింపేవి 48,654. ఇంకా మిగిలిన 87,880 ఖాళీల్లో.. కమిటీ నివేదిక ఇచ్చాక కొన్ని నియామకాలు జరిగాయి. ఇవి పరిగణనలోకి తీసుకుంటే నింపాల్సిన పోస్టులు 80 వేలు’ అని హరీశ్‌రావు వివరించారు. భాజపా నేతలకు దమ్ముంటే దిల్లీలో కేంద్రంపై కొట్లాడాలని సూచించారు. ఉద్యోగాల భర్తీతో రూ.7 వేల కోట్ల భారం పడుతుందని, ఈ బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి అయిదో స్థానంలో ఉంది అని తెలిపారు.

వడ్డీ రాయితీ నిలిపివేశారు.: జీవన్‌రెడ్డి

రైతుల పంట రుణాలపై ఇచ్చే రాయితీని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటి వరకు రూ.34 వేల వరకు రుణాలే మాఫీ అయ్యాయి. మిగిలినవి ఎప్పుడు మాఫీ చేస్తారు? విత్తన సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు మరిచారు. ఉపాధి కూలీలకు వేసవి అలవెన్సు మంజూరు చేయట్లేదు. బాలికా సురక్ష పథకాన్ని ఎందుకు నిలిపివేశారు? ఆడపిల్లలు జమ చేసిన అభయహస్తం నిధులు వెంటనే వారికి ఇచ్చేయాలి.  

రాయితీ బకాయిలు ఇవ్వండి: కడియం శ్రీహరి

టీఎస్‌ ప్రైడ్‌ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రెండేళ్లుగా రాయితీలు రావట్లేదు. వీరికి బకాయిలు చెల్లించేందుకు రూ.2 వేల కోట్లు అవసరం. గొర్రెల యూనిట్ల కోసం ఇచ్చిన రూ.వెయ్యి కోట్లు సరిపోవు. పెంచాలి. రెండు పడక గదుల గృహాల పథకానికి సిద్దిపేట మోడల్‌గా నిలిచింది. అక్కడ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తరహాలో అభివృద్ధి చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా గృహాలు రావాల్సిన అవసరముంది.

హరీశ్‌...జుట్టుకు రంగు వేసుకోండి..

మండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తెల్ల జుట్టు, రంగు వేసుకోవడంపై సరదా చర్చ జరిగింది. కడియం శ్రీహరి మాట్లాడుతూ ‘ఛైర్మన్‌కు, నాకు ఇద్దరికీ ఒకే విధంగా తెల్లరంగు జుట్టు ఉంది. వయసు పైబడిన వారికి ఎక్కువ సమయం ఇవ్వాలని సరదాగా కోరారు. మంత్రి హరీశ్‌రావు, మీరు కూడా జుట్టుకు రంగు వేసుకోండి’ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ మృతి పట్ల మండలి సంతాపం తెలిపింది. అనంతరం బడ్జెట్‌పై చర్చను ఎంఐఎం సభ్యుడు మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఇఫెండి ప్రారంభించారు. ప్రభుత్వం ఉద్యోగాలు ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, వాటిని వేగంగా భర్తీ చేయాలని సూచించారు. చర్చపై సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి, కె.రఘోత్తమ్‌రెడ్డి, నర్సిరెడ్డి మాట్లాడారు. భాజపా గవర్నర్లు రాష్ట్రాల్లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. భాజపాయేత రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రసంగాలు చదవడం లేదని, అందులోని విషయాలతో సంబంధం లేదంటున్నారని తెలిపారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాల గవర్నర్లు సీఎంతో కలిసి పనిచేయాల్సినప్పటికీ ఆ మేరకు వ్యవహరించడం లేదన్నారు. బడ్జెట్‌లో గవర్నర్‌ ప్రసంగం పెట్టలేదన్న కారణంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గతంలో అసెంబ్లీ ప్రొరోగ్‌ కానందున సీఎం రాజ్యాంగ, న్యాయపరంగా అన్ని అంశాలను పరిశీలించి బడ్జెట్‌ సమావేశాలకు ఏర్పాట్లు చేశారన్నారు. అనంతరం ఛైర్మన్‌ జాఫ్రీ సభను సోమవారానికి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని