Electricity bill:తమిళనాడులో కరెంటు బిల్లు తక్కువ

దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు చెల్లించే నెలవారీ కరెంటు ఛార్జీలు తమిళనాడులో అత్యంత తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో చాలా ఎక్కువ. తెలంగాణలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2022-23కు) కరెంటు ఛార్జీలు

Updated : 15 Jan 2022 06:03 IST

మహారాష్ట్రలో ఎక్కువ

రాష్ట్రాల వారీ పరిస్థితిపై తెలంగాణ డిస్కంల అధ్యయనం
ఇంధన ఛార్జీల పెంపుపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ నేపథ్యం

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు చెల్లించే నెలవారీ కరెంటు ఛార్జీలు తమిళనాడులో అత్యంత తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో చాలా ఎక్కువ. తెలంగాణలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2022-23కు) కరెంటు ఛార్జీలు పెంచాలని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 27న ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి అందజేశాయి. వీటిపై వచ్చే నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ విచారణ నిర్వహించాలని ఈఆర్‌సీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులపై రాష్ట్ర డిస్కంలు అధ్యయనం చేశాయి. వీటి ప్రకారం చూస్తే 200 యూనిట్లు కరెంటు వాడుకునే ఒక ఇంటి కరెంటు బిల్లు మహారాష్ట్రలో రూ.1,689, రాజస్థాన్‌లో రూ.1,666గా ఉంది. అదే తమిళనాడులో రూ.415. తమిళనాడు ప్రభుత్వం రాయితీ ఎక్కువగా ఇవ్వడమే ఇందుకు కారణమని తేలింది. ఇక ఇదే 200 యూనిట్లకు మహారాష్ట్రలో యూనిట్‌కు రూ.8.72 చొప్పున, తెలంగాణలో రూ.4.30, ఏపీలో రూ.3.60, తమిళనాడులో రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు.

నిబంధన ఇలా...

సాధారణంగా ఒక రాష్ట్రంలో యూనిట్‌ కరెంటు సరఫరాకు సగటు వ్యయం(ఏవరేజ్‌ కాస్ట్‌ ఆఫ్‌ సప్లై- ఏసీఎస్‌) ఎంత అనేది అధ్యయనం చేసి దానికన్నా 20 శాతం ఎక్కువ లేదా 20 శాతం తక్కువ ఉండేలా అన్ని వర్గాలకు కరెంటు ఛార్జీలు నిర్ణయించాలని విద్యుత్‌ చట్టం చెబుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు డిస్కంలు కరెంటు ఛార్జీలను నిర్ణయించడం వల్ల ఈ నిబంధన ఎక్కడా అమలవడం లేదు. ఉదాహరణకు తెలంగాణలో ఏసీఎస్‌ రూ.7.14. దీనికి 20 శాతం ఎక్కువ లేదా తక్కువ అంటే కనిష్ఠంగా రూ.5.71, గరిష్ఠంగా రూ.8.56 చొప్పున మాత్రమే కరెంటు ఛార్జీని అన్ని వర్గాల నుంచి తెలంగాణ డిస్కంలు వసూలు చేయాలి. కానీ రాష్ట్రంలో ఎవరైనా 50 యూనిట్లలోపు కరెంటు వాడుకుంటే యూనిట్‌కు రూ.1.45 మాత్రమే వసూలు చేస్తున్నారు. పక్కనున్న మహారాష్ట్రలో యూనిట్‌కు 50 యూనిట్లలోపు వాడుకుంటే రూ.1.14 చొప్పున మాత్రమే బిల్లు వేస్తున్నారు. ఈ కేటగిరీకి తమిళనాడు, కర్ణాటకలలో పూర్తి ఉచితం.

51 నుంచి 100 యూనిట్లలోపు కరెంటు వాడుకునే ఇళ్లకు దేశంలోనే అతి తక్కువగా తమిళనాడులో యూనిట్‌కు రూ.1.50, ఏపీ, తెలంగాణలో రూ.2.60 ఛార్జీ వేస్తుంటే అత్యంత ఎక్కువగా రాజస్థాన్‌లో రూ.6.78 వసూలు చేస్తున్నారు.

పేదలకు తక్కువ ఛార్జీ వేస్తున్నా, అధికంగా కరెంటు వాడుకునేవారిపై నిబంధనలకు విరుద్ధంగా చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు. తెలంగాణలో నెలకు 400 యూనిట్లకు పైగా కరెంటు వాడుకుంటే సగటున రూ.9 నుంచి 10 వరకూ ఛార్జీ వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని