Huzurabad By Election: హుజూరాబాద్‌లో దళిత బంధు ఆపండి

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసేంత వరకు అక్కడ దళితబంధు పథకం అమలును నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated : 19 Oct 2021 09:52 IST

రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
ముఖ్య ఎన్నికల అధికారి లేఖకు స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసేంత వరకు అక్కడ దళితబంధు పథకం అమలును నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఆ పథకం అమలుపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఇచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆ లేఖపై చర్చించిన మీదట ఆ పథకానికి సంబంధించిన నగదు బదిలీ ప్రక్రియ అంతటినీ ఉప ఎన్నిక ముగిసేంత వరకు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్‌కుమార్‌ స్పష్టం చేస్తూ సోమవారం రాష్ట్రానికి పంపిన ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు.

లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,655 కోట్లు

రాష్ట్రంలో తొలుత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం ఒక్కో లబ్ధిదారుడికి రూ.పది లక్షలను బ్యాంకు ఖాతాలో జమ చేయాలని భావించింది. ఈ నిధులతో దళితులు ఉపాధి పొందాలన్నది పథకం ఆలోచనగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు నియోజకవర్గంలోని 21 వేల మంది దళితులను లబ్ధిదారులుగా గుర్తించారు. ఆ తరవాత మరింత మందిని చేర్చడంతో ఆ సంఖ్య 24,367కు పెరిగింది. ఈ క్రమంలో 16 వేల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సుమారుగా రూ.1,655.18 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇందులో రూ.32.77 కోట్లు బీమా కింద కేటాయించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులతో పథకం అమలు నిలిచినట్లు అయింది.

ఆగస్టులోనే ఫిర్యాదు చేశా: పద్మనాభరెడ్డి

ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం అమలును ఆపాలని ఆగస్టులో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఆపడం పెద్ద జోక్‌గా ఉందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కన్వీనర్‌ పద్మనాభరెడ్డి ఆక్షేపించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేసి ఎన్నికలు దగ్గరకొచ్చాక నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని