CM KCR: ఏప్రిల్‌ 2 వరకే గడువు

తెలంగాణలోనూ పంజాబ్‌ తరహా ధాన్యం కొనుగోళ్ల విధానం కోసం వచ్చే నెల 2 వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నామని, తర్వాత పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ముందుగా దిల్లీలో కేంద్రమంత్రులను

Updated : 22 Mar 2022 04:26 IST

ఆ తర్వాత పెద్దఎత్తున నిరసనలు

దిల్లీలో ధర్నా.. నేనూ పాల్గొంటా

తెరాస పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోనూ పంజాబ్‌ తరహా ధాన్యం కొనుగోళ్ల విధానం కోసం వచ్చే నెల 2 వరకు కేంద్రానికి గడువు ఇస్తున్నామని, తర్వాత పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ముందుగా దిల్లీలో కేంద్రమంత్రులను కలిసి విన్నవిస్తామని, తర్వాత పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీలు, మార్కెట్‌ కమిటీలతో తీర్మానాలు చేసి పంపుతామని చెప్పారు. అప్పటికీ కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ‘ఒకే దేశం.. ఒకే సేకరణ’ (వన్‌ నేషన్‌- వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌) నినాదంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి దిల్లీలో నిరసన నిర్వహిస్తామని తెలిపారు. తాను కూడా అందులో పాల్గొంటానని తెలిపారు. రాష్ట్రంలోనూ భారీఎత్తున ఆందోళనలు జరపాలని, ఇంటింటా నల్లజెండాలను ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన తెరాస పార్లమెంటరీ, శాసనసభాపక్ష, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ దాదాపు మూడు గంటల పాటు మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇకపై దాన్ని సహించేది లేదని, తెరాస శక్తి ఏమిటో భాజపాకు తెలియజేస్తామన్నారు. ఇళ్లపై ఎగురవేసేందుకు 70 లక్షల నల్లజెండాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ‘‘మార్చి 24న నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలి. తెలంగాణ రైతుల వడ్లను కేంద్రం పూర్తిగా కొనాలని 26న పంచాయతీలు, 27న ఎంపీపీ, 30న జిల్లా పరిషత్‌లు తీర్మానాలు చేయాలి. మార్చి 31లోపు కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. ప్రతి మండల కేంద్రంలో నిరసన దీక్షలు చేయాలి. ఇదే సమయంలో మన ఎంపీలు దిల్లీలో నిరసనలు చేపడతారు’’ అని తెలిపారు.  ఈ నెల 28, 29 తేదీల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాలు నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

యాదాద్రికి కుటుంబాలతో రావాలి

ఈ నెల 28న జరిగే యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఉద్ఘాటనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబాలతో హాజరు కావాలి. ఈ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్నాం. తెలంగాణ చరిత్రలో యాదాద్రి స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గది’’ అని కేసీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని