Bandi Sanjay: రెండో రోజూ రణరంగం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన రెండో రోజూ ఉద్రిక్తంగానే సాగింది. మంగళవారం తెరాస, భాజపా నేతల పరస్పర ఆరోపణలు, ఘర్షణలు, పోలీసుల లాఠీఛార్జితో ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద వాతావరణం

Updated : 09 Aug 2022 11:23 IST

  సంజయ్‌ పర్యటన ఉద్రిక్తం

  తెరాస, భాజపా కార్యకర్తల పరస్పర రాళ్ల దాడులు

పోలీసులతో పాటు పలువురికి గాయాలు

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: సంజయ్‌

ఆత్మకూర్‌(ఎస్‌)లో తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీ

ఈనాడు- నల్గొండ, హైదరాబాద్‌, న్యూస్‌టుడే- చివ్వెంల: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన రెండో రోజూ ఉద్రిక్తంగానే సాగింది. మంగళవారం తెరాస, భాజపా నేతల పరస్పర ఆరోపణలు, ఘర్షణలు, పోలీసుల లాఠీఛార్జితో ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద వాతావరణం రణరంగాన్ని తలపించింది. రాళ్లు, కోడిగుడ్లతో పరస్పరం దాడులు చేసుకోవడం, భాజపా కాన్వాయ్‌పై తెరాస శ్రేణులు రాళ్లు విసరడంతో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో తెరాస, భాజపా కార్యకర్తలు, పోలీసులు, విలేకరులకు గాయాలయ్యాయి. మంగళవారం సంజయ్‌.. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు మండలాల్లోని ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాలను పరిశీలించగా.. ప్రతిచోటా తెరాస కార్యకర్తలు ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అర్వపల్లిలో పోలీసులు, తెరాస కార్యకర్తల వాగ్వాదం

చివ్వెంలలో ఘర్షణ

చివ్వెంలలోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఉదయం సంజయ్‌ సందర్శించారు. విషయం తెలుసుకున్న తెరాస శ్రేణులు సూర్యాపేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అక్కడకు చేరుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీనిని అడ్డుకునేందుకు భాజపా శ్రేణులు ప్రయత్నించడంతో ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో ఇరువర్గాలు రాళ్ల దాడులు చేసుకున్నాయి. ఈ సందర్భంగా లాఠీఛార్జి చేస్తున్న కానిస్టేబుల్‌కు గాయమైంది. తర్వాత చివ్వెంల నుంచి ఆత్మకూరుకు చేరుకున్న సంజయ్‌కు వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు గోబ్యాక్‌ నినాదాలను హోరెత్తించగా.. ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ అస్వస్థతకు గురికాగా.. పోలీసులు సూర్యాపేటలోని ఆసుపత్రికి తరలించారు. గంటన్నరపాటు ఆందోళనకర పరిస్థితుల మధ్యనే సంజయ్‌ తన పర్యటన కొనసాగించారు. ఆత్మకూరు నుంచి నూతన్‌కల్‌, మద్దిరాల మీదుగా తిరుమలగిరి చేరుకున్నారు. నూతన్‌కల్‌, మద్దిరాలలోనూ సంజయ్‌ను అడ్డుకోవడానికి తెరాస శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని వారించారు. అనంతరం తిరుమలగిరిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సంజయ్‌ భోజనం చేశారు. అక్కడే బయట ఉన్న కాన్వాయ్‌పైనా ఆందోళనకారుల దాడులు జరగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. జరిగిన ఘటనలపై సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఎదుట భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఆత్మకూర్‌(ఎస్‌)లో భాజపా శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జి

‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటరుకు గాయాలు

చివ్వెంలలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సంజయ్‌ పర్యటన సందర్భంగా అక్కడకు వెళ్లిన చివ్వెంల ‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటర్‌ వెంకన్న గాయపడ్డారు. భాజపా, తెరాస శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్న సమయంలో రాళ్లు తగలడంతో ఆయన తల, మెడ భాగంలో గాయాలయ్యాయి.

అర్వపల్లిలో కర్రలతో దాడి

తమ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌కు స్వాగతం పలికేందుకు తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి క్రాస్‌రోడ్డుకు భాజపా శ్రేణులు భారీగా చేరుకున్నాయి. మరోవైపు నల్లజెండాలతో తెరాస శ్రేణులు భారీగా మోహరించడంతో పరిస్థితి అదుపు తప్పింది. తెరాస శ్రేణులు కర్రలతో భాజపా శ్రేణులపై దాడి చేయగా.. భాజపా కార్యకర్తలు వారిపై రాళ్లు విసిరారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి యత్నించిన పోలీసులపైనా కర్రలతో దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడియం రామచంద్రయ్య కుమారుడు కల్యాణ్‌కు కూడా గాయాలయ్యాయి.

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న బండి సంజయ్‌

డీజీపీ ఫోన్‌ తీయడం లేదు: సంజయ్‌

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ఆరోపించారు. డీజీపీకి రెండ్రోజుల నుంచి తాను, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫోన్‌లు చేస్తున్నా ఎత్తడం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు ఉన్నందునే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో మంగళవారం ఉదయం, తిరుమలగిరిలో రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారులే భాజపా కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు. దీనిపై గవర్నర్‌ను కలిశాం. కేంద్రానికి నివేదిక ఇస్తాం. వానాకాలంలో 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు ఎఫ్‌సీఐ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందా లేదా ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. తన పర్యటనలో తెరాస నాయకులు రాళ్లు రువ్వినా భాజపా కార్యకర్తలు ధైర్యంగా నిలబడి వీరోచిత పోరాటం చేశారని, వారి ధైర్యానికి హ్యాట్సాఫ్‌ అని సంజయ్‌ పార్టీ కార్యకర్తలను ఓ ప్రకటనలో కొనియాడారు. దాడుల్లో పలువురు భాజపా కార్యకర్తలు, పోలీసులు, పాత్రికేయులు గాయపడటం బాధ కలిగించిందన్నారు. మంగళవారం రాత్రి తిరుమలగిరి నుంచి హైదరాబాద్‌ మీదుగా సంజయ్‌ కరీంనగర్‌కు వెళ్లారు.


సంజయ్‌, తెరాస శ్రేణులపై కేసు

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా ముందస్తుగా అనుమతి తీసుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం, ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా పర్యటన జరిగిన నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌తో పాటు ఆ పార్టీ ఇతర నాయకులపై కేసు నమోదు చేశాం. సోమవారం జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వీడియో ఆధారంగా పలువురు తెరాస నాయకుల పైనా కేసులు పెట్టాం.

- రంగనాథ్‌ ఎస్పీ, నల్గొండ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని