Assembly Seats: 2031 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు! తెలుగు రాష్ట్రాలకు స్పష్టంచేసిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని సవరించనంతవరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు

Updated : 28 Jul 2022 08:19 IST

ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని సవరించనంతవరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆర్టికల్‌ 170కి లోబడి ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలోని సీట్లను 153కు పెంచాలని విభజన చట్టంలోని సెక్షన్‌ 26(1) చెబుతోందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170(3) రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను 2026 తర్వాత జనాభా లెక్కలు ప్రచురించేంతవరకూ పెంచడానికి వీల్లేదని పేర్కొంటోందని చెప్పారు. అందువల్ల విభజన చట్టంలోని సెక్షన్‌ 26కి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయకుండా సీట్ల పెంపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2026 తర్వాత జనాభా లెక్కలు అంటే 2031లో జరుగుతాయి. ఆ లెక్కల ఆధారంగా పునర్విభజన కమిషన్‌ ఏర్పాటు చేసి నియోజకవర్గాలను పెంచాల్సి ఉంటుంది. అంటే ఎంత వేగంగా చేసినా 2034 లేదా 2039 ఎన్నికల నాటికే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని