CBN: వైకాపా పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి

‘అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ తెదేపా ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా రూ.2 లక్షల కోట్ల

Updated : 23 Feb 2024 19:22 IST

ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపాదే గెలుపు
న్యూజిలాండ్‌లోని పార్టీ అభిమానుల వర్చువల్‌
మహానాడులో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ తెదేపా ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా రూ.2 లక్షల కోట్ల సంపద సృష్టించే అవకాశం ఉంది. రాష్ట్ర భవిష్యత్తుపై ఆలోచన, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా మూడు రాజధానుల ప్రకటనతో సీఎం జగన్‌ దాన్ని దెబ్బతీశారు. రెండేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమం మధ్య నమన్వయం దెబ్బతింది. సామాజికంగా, ఆర్థికంగా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లింది. 2024లో కాదు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెదేపా విజయాన్ని అడ్డుకోవటం ఎవరికీ సాధ్యం కాదు’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్‌లోని పార్టీ అభిమానులు ఆదివారం నిర్వహించిన వర్చువల్‌ మహానాడులో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం.. హైటెక్‌ సిటీ, ఔటర్‌ రింగ్‌ రోడ్డు కారణంగా అనేక పెద్ద ప్రాజెక్టులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
విధ్వంసంతో పెట్టుబడులు పోయాయి
‘ప్రజావేదికను కూల్చటం ద్వారా వైకాపా విధ్వంస పాలన మొదలైంది. రాష్ట్ర రాజధాని అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయటం, ప్రజా వ్యతిరేక విధానాలు, పారిశ్రామిక వ్యతిరేక నిర్ణయాలతో వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పెట్టుబడిదారులు భయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. రాష్ట్ర జీఎస్‌డీపీతో పోలిస్తే రాష్ట్రం తీసుకున్న రుణాలు 25 శాతాన్ని దాటాయి. ప్రస్తుతం ఇది 36 శాతం. ఒక్కోసారి 50 శాతాన్ని కూడా తాకుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భవిష్యత్తులో కొత్త రుణాలొచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఏపీ దివాలా తీసింది. జగన్‌ పాలనలో తలసరి అప్పు పెరిగింది. సంక్షేమ పథకాల పేరిట ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చి.. వారిపై రూ.50 వేల రుణ భారాన్ని మోపుతున్నారు’ అని విమర్శించారు. ‘రెండో దశ కరోనా నియంత్రణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో తెదేపా హయాంలో హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘జగన్‌.. రెండేళ్ల విధ్వంసం’
కరపుస్తకం విడుదల చేసిన తెదేపా

ఈనాడు, విశాఖపట్నం: వైౖకాపా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అక్రమాలు, అవినీతి, కుంభకోణాలతో దేశంలో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిందంటూ ‘జగన్‌.. రెండేళ్ల విధ్వంసం’ పేరుతో తెలుగుదేశం కరపుస్తకం విడుదల చేసింది. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ‘రెండేళ్ల వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు’ పేరుతో దీన్ని ఆవిష్కరించారు. ఇందులో ప్రభుత్వం చేసిందంటూ 96 నేరాలు-ఘోరాలను తొమ్మిది భాగాల్లో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని