Twitter: దిగొచ్చిన ట్విటర్‌!

కేంద్ర ప్రభుత్వ ఘాటైన నోటీసు పనిచేసినట్లుంది! అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ ట్విటర్‌ దిగొచ్చింది. భారత ప్రభుత్వ ఐటీ చట్టాలను పాటిస్తామని, వాటిని అమలు చేయడానికి కాస్త సమయం కావాలని ట్విటర్‌ కోరినట్లు తెలిసింది. ఈ మేరకు..

Updated : 08 Jun 2021 08:20 IST

సమయమివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి
నిబంధనలు పాటిస్తామని వెల్లడి

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఘాటైన నోటీసు పనిచేసినట్లుంది! అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ ట్విటర్‌ దిగొచ్చింది. భారత ప్రభుత్వ ఐటీ చట్టాలను పాటిస్తామని, వాటిని అమలు చేయడానికి కాస్త సమయం కావాలని ట్విటర్‌ కోరినట్లు తెలిసింది. ఈ మేరకు.. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. కొత్త డిజిటల్‌ నిబంధనలను కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా పూర్తిగా అమలు చేయలేకపోతున్నామని,  కాస్త సమయం ఇవ్వాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కొత్త నిబంధనలను పాటించకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామంటూ.. కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే ఘాటుగా నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ట్విటర్‌ ప్రతినిధిని సంప్రదించగా... ‘‘భారత్‌లో సేవలకు కట్టుబడి ఉన్నాం. కొత్త డిజిటల్‌ నిబంధనలను అమలు చేయడానికి కూడా సిద్ధమని ప్రభుత్వానికి మేం తెలియజేశాం. ఈ మేరకు మా ప్రతి చర్యను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. భారత ప్రభుత్వంతో మా సంప్రదింపులు కొనసాగుతునే ఉంటాయి’’ అని పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం- వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు భారత్‌లో ఓ అధికారిని ట్విటర్‌ నియమించాల్సి ఉంటుంది. దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగిస్తుందనిపించిన సందేశాలేమైనా ఉంటే వాటి మూలాల వివరాలను ప్రభుత్వం లేదా న్యాయస్థానం అడిగితే తెలియజేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని