TS News: రోదసిలోకైనా వెళ్లొచ్చు.. ఈ ఊర్లకు వెళ్లలేం

రోదసిలోకి మనుషులు సురక్షితంగా వెళ్లివస్తున్న ఈ రోజుల్లోనూ.. రాష్ట్రంలో దాదాపు 289 గ్రామాల ప్రజలు వర్షాల సమయంలో ఊరు దాటి బయటకు వెళ్లలేని దుస్థితి.

Updated : 14 Jul 2021 10:57 IST

289 గ్రామాల పరిధిలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలతో ఇబ్బందులు

ముందడుగు పడని వంతెనల నిర్మాణాలు

కాజ్‌వేలు, బ్రిడ్జిలకు మరమ్మతులూ కరవు

ఈనాడు, హైదరాబాద్‌: రోదసిలోకి మనుషులు సురక్షితంగా వెళ్లివస్తున్న ఈ రోజుల్లోనూ.. రాష్ట్రంలో దాదాపు 289 గ్రామాల ప్రజలు వర్షాల సమయంలో ఊరు దాటి బయటకు వెళ్లలేని దుస్థితి. బయటివారు గ్రామంలోకి రాలేని పరిస్థితి. పొంగిపొర్లే వాగులు, వంకలను ధైర్యం చేసి దాటుతున్నవారు ప్రమాదాల బారిన పడడం, కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకోవడం ఇక్కడ సాధారణమైపోయింది.  కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన గర్భిణులు, తక్షణ వైద్యం అవసరమైన వారు సైతం.. దేవుడిపైనే భారంవేసి కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. నిత్యావసర వస్తువుల సరఫరాపైనా ప్రభావం పడుతోంది. ఐటీడీఏలు, పంచాయతీరాజ్‌, రహదారులు-భవనాల శాఖలు.. ఆయా ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం, మరమ్మతులు, రోడ్లను బాగు చేసేందుకు ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం ఉండటం లేదు. కొన్నింటికి నిధులు వచ్చినా పనులు సాగడం లేదు. దీంతో వానాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

* ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ప్రతి వర్షాకాలంలో 137 గ్రామాలు జలదిగ్బంధానికి గురవుతున్నాయి.

* మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 32 గ్రామాల పరిధిలో వాగులు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. గతేడాది గోపాల్‌పేట మండలంలో ఇద్దరు కొట్టుకుపోయారు.

* వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే 55 గ్రామాలకు ఏటా రాకపోకలు నిలిచిపోతున్నాయి. జంపన్నవాగుకు వరద వస్తే వందల గ్రామాలపై ప్రభావం పడుతోంది. ఈ వాగులో సోమవారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

* ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏజెన్సీ పరిధిలో 65 గ్రామాలు జలదిగ్బంధానికి గురవుతున్నాయి. వైద్యానికి, నిత్యావసరాలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు.

బాహ్య ప్రపంచంతో సంబంధాలు బంద్‌

భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో కిన్నెరసాని వాగు ఉప్పొంగితే పలు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ముఖ్యంగా సజ్జలబోడు, నడింగూడెం, మోదుగుల గూడెం ప్రజలు వాగు మధ్యలో ఒకచోట రెండు పెద్ద బండరాళ్ల మధ్య కట్టెలు వేసి దానిపై ప్రమాదకరంగా దాటుతున్నారు. ఈ రెండు బండల మధ్య 20 అడుగుల లోతులో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. తప్పని పరిస్థితుల్లో అవసరాలకు, వ్యవసాయ పనులకు గ్రామస్థులు ఏళ్లుగా ఈ సాహసం చేస్తున్నారు. 2018-19లో ఈ వాగుపై రూ.3 కోట్లతో వంతెన మంజూరైనా నిర్మాణం అసంపూర్తిగానే ఉంది.


వరంగల్‌ జిల్లా నర్సంపేట గ్రామీణ మండలం గురిజాల కాజ్‌వే వద్ద చెరువు మత్తడి ప్రవాహంలో స్థానికుల ఇబ్బందులు ఇవీ. గత ఆదివారం ఇక్కడ ఓ యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. ఏటా ఎంతో మంది ఇక్కడ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ కొత్త వంతెన, రోడ్డు నిర్మాణానికి రూ.6.15 కోట్లు మంజూరు చేసినా పనులు జరగడంలేదు. సమీప 8 గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ దారే ఆధారం.


కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండల కేంద్రం నుంచి 25 కిమీ దూరంలో ఉంటుంది గోంది గ్రామం. కాగజ్‌నగర్‌ నుంచి సగం దూరమే తారు రోడ్డు సదుపాయం ఉంది. మిగతా మార్గం మట్టి రోడ్డే. వర్షాలు కురిస్తే వాహనాలు తిరగలేవు. ఈ గ్రామానికి చెందిన గర్భిణి సక్రుబాయికి పదిరోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో గ్రామం నుంచి తారు రోడ్డు వరకూ ఎడ్లబండిపై తరలిస్తుండగా మధ్యలో బండిపైనే ఆమె ప్రసవించింది. తర్వాత తారు రోడ్డు వరకూ చేరాక 108లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ జిల్లాలో పది మండలాల్లో వాగులపై వంతెనలు లేకపోవడం, కచ్చా రోడ్లు కావడంతో ఏటా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి.


భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై ఉన్న ఈ వంతెన గతేడాది ఆగస్టులో కుంగింది. ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. దీంతో నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చిన్నబోయినపల్లి-షాపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన కూడా కొట్టుకుపోయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని