Varun Singh: తుదిశ్వాస విడిచిన కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌

తమిళనాడులో వారం కిందట వాయుసేన హెలికాప్టర్‌ కూలి గాయాలైన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌(39) తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని కమాండో వైద్యాలయంలో బుధవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు వాయుసేన అధికారికంగా ప్రకటించింది.

Updated : 16 Dec 2021 07:21 IST

వారం కిందట హెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్ర గాయాలు
బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: తమిళనాడులో వారం కిందట వాయుసేన హెలికాప్టర్‌ కూలి గాయాలైన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌(39) తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని కమాండో వైద్యాలయంలో బుధవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు వాయుసేన అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 8న త్రిదళపతి జనరల్‌ బిపిన్‌రావత్‌ సహా 14 మంది సైనిక బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ తమిళనాడులోని కున్నూర్‌లో కుప్పకూలింది. ఈ సంఘటనలో తీవ్రగాయాలైన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ను తమిళనాడులోని వెల్లింగ్టన్‌ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఈ నెల 9న బెంగళూరులోని ఐఏఎఫ్‌ కమాండో ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. వరుణ్‌సింగ్‌ భౌతికకాయాన్ని గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు తరలించనున్నట్లు ఐఏఎఫ్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపాయి. వరుణ్‌సింగ్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వరుణ్‌సింగ్‌కు భార్య, 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు.  

రావత్‌ హిందీలో మాట్లాడటంతో అర్థంకాలేదు
చెన్నై, న్యూస్‌టుడే: ప్రమాదం జరిగిన రోజు త్రిదళపతి బిపిన్‌రావత్‌ హిందీలో మాట్లాడటంతో తమకు అర్థం కాలేదని అంబులెన్స్‌ సిబ్బంది తెలిపారు. రక్షణశాఖ హెలికాప్టర్‌ పేలుడుపై రోజుకో విషయం బయటకు వస్తోంది. బిపిన్‌రావత్‌ చివరిమాటల గురించి అంబులెన్స్‌ సిబ్బంది వెల్లడించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.


ధైర్యే సాహసే.. వరుణ్‌


దిల్లీ: యుద్ధవిమానాలను నడపడం కత్తి మీద సాము. ముఖ్యంగా ప్రయోగదశలో ఉన్నప్పుడు నడపడం అంత సులభం కాదు. ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. ఊహించని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ప్రాణాలకూ ముప్పే. యుద్ద విమాన టెస్ట్‌ పైలట్‌గా వరుణ్‌సింగ్‌ అలా ప్రాణాలకు తెగించి ఎన్నో సాహసాలు చేశారు. 2020లో తేజస్‌ యుద్ధ విమానం నడుపుతున్న సమయంలో ఒక్కసారిగా కాక్‌పిట్‌లో పీడనం తగ్గిపోయింది. హైడ్రాలిక్‌ సమస్యా ఉత్పన్నమైంది. విమానం ఎత్తు అకస్మాత్తుగా తగ్గిపోయింది. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో సాధారణంగా పైలట్లు పారాచూట్‌ సాయంతో ప్రాణాలు రక్షించుకునేందుకు మొగ్గు చూపుతారు. వరుణ్‌ అలా చేయలేదు. అదుపు తప్పుతున్న విమానాన్ని తన నియంత్రణలో తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. చివరకు అందులో సఫలమై.. ఎట్టకేలకు చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ఈ సాహసానికి ఈ ఏడాది ఆగస్టులో ఆయనకు సైన్యంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘శౌర్యచక్ర’ లభించింది. ‘తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసీ.. అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి యుద్ధ విమానాన్ని నియంత్రించారు. సురక్షితంగా ల్యాండ్‌ చేసి వందల కోట్లను ఆదా చేశారు’ అంటూ పురస్కార సమయంలో భారత వాయుసేన వరుణ్‌సింగ్‌ను అభినందించింది. వరుణ్‌ తండ్రి కర్నల్‌(రిటైర్డ్‌) కేపీ సింగ్‌ కూడా సైనికాధికారే. ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌(ఏఏడీ)లో విధులు నిర్వహించారు. సోదరుడు తనూజ్‌ సింగ్‌.. ప్రస్తుతం నావికాదళంలో లెఫ్టినెంట్‌ కమాండర్‌ హోదాలో ఉన్నారు.

చదువులో సామాన్యుడు.. తెగువలో అసామాన్యుడు!
వరుణ్‌సింగ్‌ సగటు విద్యార్థి. చిన్నప్పుడు చదువులో గొప్పగా మార్కులు సాధించ లేదు. శౌర్యచక్ర అవార్డు స్వీకరించిన తర్వాత.. చండీమందిర్‌ (హరియాణా)లో తాను చదువుకున్న ఆర్మీ పబ్లిక్‌ పాఠశాల విద్యార్థులకు రాసిన ఓ లేఖలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చదువుల్లో సగటు ప్రతిభ చూపినప్పటికీ.. భవిష్యత్తులో అద్భుతాలు చేయొచ్చని చెబుతూ ఆ లేఖ ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చారు. ‘సగటు విద్యార్థిగా ఉన్నా పర్వాలేదు. పాఠశాలలో బాగా చదవడం, ప్రతి పరీక్షలో 90కి పైగా మార్కులు సాధించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ అలా చేస్తే అద్భుత ఘనత కిందే లెక్క. వారిని అభినందించాల్సిందే. అయితే- మార్కులు బాగా రానంతమాత్రాన మీరు ఎప్పుడూ సగటు మనిషిలా ఉండిపోతారేమోనని నిరుత్సాహపడకండి. పాఠశాలలో మీరు సగటు విద్యార్థి కావొచ్చు. భవిష్యత్తులో జరగబోయేదానికి మాత్రం అది కొలమానం కాదు. మీకు ఏది ఇష్టమో గుర్తించండి. ఏ రంగంలోకి దిగినా అంకితభావంతో పనిచేయండి. నేను సగటు విద్యార్థిని. 12వ తరగతిలో అతికష్టం మీద ఫస్ట్‌ డివిజన్‌ సాధించాను. క్రీడల్లోనూ అంతంతమాత్రమే. కానీ నాకు విమానాలన్నా.. విమానయాన రంగమన్నా అమితాసక్తి. అందులో చూపిన తెగువ కారణంగా రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర అవార్డు దక్కింది’ అని ఈ ఏడాది సెప్టెంబరు 18న రాసిన లేఖలో వరుణ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని