కథక్‌ నృత్యశిఖరం బిర్జూ మహారాజ్‌ ఇకలేరు

భారతీయ శాస్త్రీయనృత్యం కథక్‌ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ నృత్యకారుడు, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత బిర్జూ మహారాజ్‌ (84) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మనవరాలైన కథక్‌ నృత్యకారిణి రాగిణి మహారాజ్‌

Published : 18 Jan 2022 04:19 IST

దిల్లీ: భారతీయ శాస్త్రీయనృత్యం కథక్‌ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ నృత్యకారుడు, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత బిర్జూ మహారాజ్‌ (84) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మనవరాలైన కథక్‌ నృత్యకారిణి రాగిణి మహారాజ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆదివారం రాత్రి కుటుంబసభ్యులు, శిష్యుల నడుమ ఆయన ఉల్లాసంగా గడిపారు. భోజనాల తర్వాత అందరూ బిర్జూకు ఇష్టమైన పాత పాటలతో అంత్యాక్షరి కూడా ఆడారు. తర్వాత ఉన్నపళంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు ఆమె తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ సమీప హండియాలో పుట్టిన బిర్జూ మహారాజ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.. అయిదుగురు మనవలు, మనవరాళ్లు ఉన్నారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ నెల రోజులుగా డయాలసిస్‌పై ఉండగా.. చక్కెరవ్యాధి కూడా అధికస్థాయిలో ఉంది. బహుశా గుండెపోటుతో మృతిచెంది ఉండవచ్చని రాగిణి చెప్పారు. ‘‘అర్ధరాత్రి దాటాక అలా జరిగింది. వెంటనే ఆసుపత్రికి బయలుదేరాం. అక్కడికి చేరుకునేలోపే ఆయన తుదిశ్వాస విడిచారు’’ అని ఆమె వివరించారు.

కథక్‌ నృత్యకారుల మహారాజ్‌ కుటుంబంలో పుట్టిన బిర్జూ తన తండ్రి, గురువు అయిన అచ్చన్‌ మహారాజ్‌తోపాటు సమీప బంధువులైన శంభు మహారాజ్‌, లచ్చు మహారాజ్‌ల వద్ద శిక్షణ పొందారు. శిష్యులు పండిట్‌ జీ, మహారాజ్‌ జీ అని ప్రేమగా పిలుచుకునే బిర్జూ మహారాజ్‌ ‘మన దేశంలో కథక్‌ భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుంది.. కొత్త తరాలు ఈ శాస్త్రీయ నృత్యాన్ని ఇంకా ముందుకు తీసుకువెళతాయి’ అని గత డిసెంబరులో పీటీఐకి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో చెప్పారు. దేశంలోని పలు ప్రముఖ నృత్య కళాశాలల్లో ఎంతోమంది శిష్యులను కథక్‌ రీతుల్లో తీర్చిదిద్దన ఆయన 1990ల చివర్లో ‘కళాశ్రమ్‌’ పేరుతో దేశ రాజధాని దిల్లీలో నృత్య కళాశాల ప్రారంభించారు. సత్యజిత్‌ రే దర్శకత్వం వహించిన ‘షత్రంజ్‌ కే ఖిలాడీ’తోపాటు ‘ఉమ్రావ్‌జాన్‌’ (రేఖ), ‘దేవదాస్‌’ (షారుక్‌ఖాన్‌), ‘విశ్వరూపం’ (కమల్‌హాసన్‌), ‘బాజీరావ్‌ మస్తానీ’ వంటి పలు కళాత్మక చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు.    


రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

థక్‌ నృత్యకారుడు బిర్జూ మహారాజ్‌ మృతితో ఒక శకం ముగిసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం తెలిపారు. ప్రపంచ కళారంగానికి ఇది తీరని లోటని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. భారతీయ నృత్యానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన బిర్జూ మహారాజ్‌ మరణం పూడ్చుకోలేని నష్టమని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ సందేశంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని