KTR: సింగరేణి జోలికొస్తే భాజపాను తరిమికొడతారు

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ అద్భుతంగా అభివృద్ధిచెందడం భరించలేక కేంద్రం దానిని ఉద్దేశపూర్వకంగా చంపే కుట్రకు తెరలేపిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సింగరేణిని

Updated : 08 Feb 2022 05:19 IST

వేలం రద్దుచేసి నేరుగా గనులు కేటాయించండి
కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి కేటీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ అద్భుతంగా అభివృద్ధిచెందడం భరించలేక కేంద్రం దానిని ఉద్దేశపూర్వకంగా చంపే కుట్రకు తెరలేపిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత సంస్థగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుందన్నారు. నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే పన్నాగం పన్నిన కేంద్రం నల్ల బంగారంపై కన్నేసిందన్నారు. వేల మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తోందని  ధ్వజమెత్తారు. సింగరేణిలో ఉన్న జేబీఆర్‌ఓసీ-3, కేకే -6, శ్రవణపల్లి ఓసీ, కోయగూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడం దారుణమని పేర్కొన్నారు. గుజరాత్‌లో అడిగిన వెంటనే లిగ్నైట్‌ గనులను ఎలాంటి వేలం లేకుండా గుజరాత్‌ ఖనిజాభివృద్ధి సంస్ధకు కేటాయించిన కేంద్రం తెలంగాణలో సింగరేణికి ఇవ్వకపోవడాన్ని వివక్షగా అభివర్ణించారు. తెలంగాణ దేశంలో రాష్ట్రం కాదా? అక్కడో విధానం.. ఇక్కడో విధానం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకే కొంగు బంగారం లాంటి సింగరేణిని దెబ్బతీస్తే భాజపా కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని పేర్కొన్నారు  ఇలాంటివి మానకపోతే సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించి, కేంద్రంలోని భాజపాను వెంటపడి తరిమికొడతారన్నారు..ఈ మేరకు కేటీఆర్‌ సోమవారం కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి లేఖ రాశారు. ‘‘సింగరేణిలో గత ఏడేళ్లలో 450 లక్షల టన్నుల నుంచి 670 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా లాభాల్లో 29 శాతం వాటాను ఇస్తున్న సంస్థ సింగరేణి మాత్రమే. ఏపీలోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్‌ ఓర్‌ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసి ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇలాంటి పథకాన్నే సింగరేణిపై ప్రయోగించేందుకు కేంద్రం యత్నిస్తోంది.

కేంద్రం వైఖరితో తీవ్రనష్టం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణిలో 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉన్న ఈ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం అంటే,  అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు పొడిచి, రిజర్వేషన్లకు పాతరేయడమే. సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు రావు. గనులు మూతపడిన కొద్దీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటా వంటివి ఆగిపోతాయి. సింగరేణి ద్వారా రాష్ట్రంలోని రెండు వేల పరిశ్రమలకు బొగ్గు అందుతోంది. ప్రైవేటీకరణ జరిగితే బొగ్గు సరఫరా ఆగిపోయి, రాష్ట్ర పారిశ్రామిక పురోగతి ప్రమాదంలో పడుతుంది. సింగరేణిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.. కేంద్రం వెంటనే వేలం రద్దు చేసి సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలి’’ అని మంత్రి కేటీఆర్‌ లేఖలో ప్రహ్లాద్‌జోషిని కోరారు.


ఏ పోరాటానికైనా సిద్ధం
ప్రభుత్వ విప్‌ సుమన్‌, ఎమ్మెల్యేలు ఆనంద్‌, క్రాంతికిరణ్‌  

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణికి ఏదైనా జరిగితే దానికి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ అన్నారు. సింగరేణిని నష్టపరిచి తెలంగాణ ప్రగతిని దెబ్బకొట్టే ప్రయత్నాలను  రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అడ్డుకుంటుందని తెలిపారు.సోమవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన  ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్‌, మెతుకు ఆనంద్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు జీవగర్ర అయిన సంస్థను  బతికించుకునేందుకు తెరాస ప్రజాప్రతినిధులం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  గతంలో జైశ్రీరాం అన్న భాజపాతో జై భీమ్‌ అనిపించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. కొత్త రాజ్యాంగం తెచ్చినా అది అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే ఉంటుందన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని