Andhra News: ఏపీ డీజీపీపై వేటు

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై అనూహ్యంగా, ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు

Updated : 16 Feb 2022 06:00 IST

సవాంగ్‌ ఆకస్మిక బదిలీ.. పోస్టింగ్‌ కూడా ఇవ్వని ప్రభుత్వం

కేవీ రాజేంద్రనాథరెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై అనూహ్యంగా, ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో డీజీపీగా 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుత నిఘావిభాగం అధిపతి కేవీ రాజేంద్రనాథ రెడ్డిని నియమించింది. ఇటీవలే అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన ఆయనకు పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌వోపీఎఫ్‌)గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

చలో విజయవాడ దెబ్బ

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రయోజనాలను నిరసిస్తూ ఈ నెల 3న ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలమంది తరలివచ్చారు. వారంతా బీఆర్టీఎస్‌ రోడ్డులో భారీగా నిరసన ప్రదర్శన చేయటంతో ప్రభుత్వానికి పెద్ద షాక్‌ తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని వేలమంది రావడం ఇటీవల ఇదే తొలిసారి. అంతమంది వస్తారనే విషయాన్ని డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ అంచనా వేయలేకపోయారని, విజయవాడకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుని నిలువరించలేకపోయారని.. ఆ వైఫల్యాల వల్లే చలో విజయవాడ విజయవంతమైందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే ఆయన్ను డీజీపీ పోస్టు నుంచి  తప్పించినట్లు సమాచారం.

కీలక బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథరెడ్డి

కొత్త డీజీపీగా నియమితులైన కేవీ రాజేంద్రనాథరెడ్డిది కడపజిల్లా. ఆయన 1992 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఏఎస్పీగా 1994లో తొలి పోస్టింగ్‌ చేపట్టారు. ఆ తర్వాత వరంగల్‌ జిల్లా జనగామ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అదనపు ఎస్పీగా పనిచేశారు. విశాఖపట్నంరూరల్‌, నెల్లూరు జిల్లాల ఎస్పీగా, సీఐడీ, గుంతకల్లు, విజయవాడ రైల్వే యూనిట్ల ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో సిటీ సెక్యూరిటీ, తూర్పు జోన్‌ డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. 2020ఆగస్టు 12 నుంచి ఏపీ నిఘా విభాగం అధిపతిగా ఉన్నారు. ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో డీజీపీగా కొనసాగనున్నారు. 2026 ఏప్రిల్‌వరకూ ఆయనకు సర్వీసు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని