Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం అస్తమయం

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (92) కన్నుమూశారు. న్యుమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి ఆమె...

Updated : 20 Mar 2022 05:54 IST

అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఆసుపత్రిలో
నేడు ఎంబీ భవన్‌కు పార్ధివ దేహం
చివరి కోరిక మేరకు వైద్య కళాశాలకు భౌతికకాయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (92) కన్నుమూశారు. న్యుమోనియాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రిలో మార్చి 1 నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాస్త కోలుకోవడంతో సాధారణ గదిలోకి మార్చారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో వైద్యులు మరోసారి ఐసీయూకు తరలించారు. అవయవాలు విఫలం కావడంతో శనివారం రాత్రి 7.37 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. స్వరాజ్యం సూర్యాపేట పాత తాలూకా కరివిరాల కొత్తగూడెంలో 500 ఎకరాల భూస్వామి భీమ్‌రెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు మూడో సంతానంగా 1930లో జన్మించారు. 1945-46 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును స్వరాజ్యం గడగడలాడించారు. దాదాపు ఎనిమిది దశాబ్దాలపాటు ప్రజా ఉద్యమాల్లో, రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆమె రెండుసార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. సీపీఎం తరఫున 1978, 83లలో ఎన్నికయ్యారు.

1985 నాటి ఎన్నికల్లో ఆమె ఓటమి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ మహిళాసభ అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ సాయుధపోరాటంలో దళ కమాండర్‌గా పనిచేసిన మల్లు వెంకట నర్సింహారెడ్డిని స్వరాజ్యం 1954లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతమ్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, కుమార్తె కరుణ ఉన్నారు. కొంతకాలంగా స్వరాజ్యం నల్గొండలో చిన్న కుమారుడు నాగార్జునరెడ్డి వద్ద ఉంటున్నారు. స్వరాజ్యం పార్ధివ దేహాన్ని ఆదివారం ఉదయం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఎంబీ భవన్‌కు తరలించనున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉదయం 10 గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయానికి తరలిస్తారు. ఆమె చివరి కోరిక మేరకు భౌతిక కాయాన్ని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించనున్నారు.


విప్లవనారిని కోల్పోయాం

ల్లు స్వరాజ్యం మరణంతో స్ఫూర్తిదాయక విప్లవనారిని కోల్పోయాం. తన ఉపన్యాసాలతో ఎందరో మహిళలను ఆమె ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఆమె మృతికి పార్టీ తరఫున తీవ్ర సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నాం.

- సీతారాం ఏచూరి, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి


పలువురి నివాళి

* సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు శనివారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి స్వరాజ్యంను పరామర్శించారు. అంతలోనే సాయంత్రం ఆమె మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి రామకృష్ణ సంతాపాలు తెలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు మధు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావులు ఆస్పత్రికి వెళ్లి ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు.

* తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చి స్వరాజ్యం భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు.


ఆమె పోరాటం నిరుపమానం

‘తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలుగు మహిళాశక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం కన్నుమూశారని తెలిసి విచారించాను. పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం నిరుపమానమైనది. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా ఆమె అందించిన సేవలు మరువలేనివి.

- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


మహిళాయోధురాలు స్వరాజ్యం

‘స్వరాజ్యం లాంటి మహిళా నేతను కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. జీవితాంతం పీడిత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన స్వరాజ్యం జీవితం రేపటితరాలకు స్ఫూర్తిదాయకం.

- సీఎం కేసీఆర్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని