Hyderabad: 24 కిలోమీటర్లు.. 8 ఫ్లైఓవర్లు

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపూర్‌ వరకు రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. 24 కిలోమీటర్ల మేరకు రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు రంగం సిద్ధమైంది.

Updated : 26 Mar 2022 05:09 IST

ఎల్బీనగర్‌-దండుమల్కాపూర్‌ రహదారి విస్తరణకు మార్గం సుగమం
ఇరువైపులా మూడేసి వరుసల చొప్పున సర్వీస్‌ రోడ్లు
ఏప్రిల్‌ మొదటి వారంలోగా గుత్తేదారుల ఖరారు!
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలోని ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపూర్‌ వరకు రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. 24 కిలోమీటర్ల మేరకు రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. సర్వీస్‌ రోడ్లనూ ఇరువైపులా మూడు వరుసల చొప్పున నిర్మించనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోగా గుత్తేదారును ఖరారు చేసేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలకు విస్తరించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపూర్‌ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రహదారి విస్తరణకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. విస్తరణ ప్రణాళికను సిద్ధం చేసిన అధికారులు టెండర్లు ఆహ్వానించారు. 10 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, సాంకేతిక టెండర్లలో ఎనిమిది అర్హత పొందాయి. ఆ జాబితాను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు రాష్ట్ర అధికారులు పంపించారు. ఆర్థిక బిడ్లు తెరిచిన అనంతరం గుత్తేదారును ఖరారు చేయనున్నారు. ఈ రహదారి విస్తరణ పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ కష్టాలు తొలగిపోనున్నాయి.

ఫైఓవర్లు ఎక్కడెక్కడంటే...

ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపూర్‌ వరకు రహదారి విస్తరణలో భాగంగా ఎనిమిది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఫ్లైఓవర్‌పై ఆరు వరుసల్లో రోడ్డు నిర్మించనున్నారు. వనస్థలిపురం సమీపంలోని పనామా గోడౌన్‌, హయత్‌నగర్‌ సమీపంలోని పసుమాముల, పెద్ద అంబర్‌పేటలోని రెండు ప్రాంతాల్లో, అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద రెండు (ఒకటి ఘట్‌కేసర్‌ వైపు, మరొకటి అనాజ్‌పూర్‌ వైపు), ఇంకా ఈనాంగూడ, బాటసింగారం ప్రాంతంలో ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ గతంలోనే పూర్తి చేయటంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు పెద్దగా జాప్యం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి రెండేళ్ల వ్యవధిలో విస్తరణ పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ఉంది. ఫ్లైఓవర్లపై వంద కిలోమీటర్ల వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విస్తరణ పనులు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని