Telangana News: ఆ ఏడు టోల్‌ప్లాజాలను తొలగిస్తారా...!

సంవత్సరాలుగా వాహనదారుల జేబులకు ఆ టోల్‌ప్లాజాలు చిల్లులు పెడుతున్నాయి. వాహనదారుల నుంచి రూ. కోట్లు వసూలు చేశాయి. ఎట్టకేలకు కేంద్రం కళ్లు తెరవటంతో తెలంగాణలోని ఏడు ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలకు కాలం

Updated : 27 Mar 2022 08:43 IST

60 కిలోమీటర్లలోపు ఒకటి కంటే ఎక్కువ ఉంటే తొలగిస్తామన్న కేంద్రమంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: సంవత్సరాలుగా వాహనదారుల జేబులకు ఆ టోల్‌ప్లాజాలు చిల్లులు పెడుతున్నాయి. వాహనదారుల నుంచి రూ. కోట్లు వసూలు చేశాయి. ఎట్టకేలకు కేంద్రం కళ్లు తెరవటంతో తెలంగాణలోని ఏడు ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలకు కాలం చెల్లనున్నట్లు సమాచారం. వాహనదారులకు ఒకింత ఉపశమనం లభించనుంది. ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్‌ప్లాజా మాత్రమే ఉండాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. 60 కిలోమీటర్లలో ఒకటికి మించి ఎన్ని ఉన్నా వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి వెళ్లే ఏడు జాతీయ రహదారులపై 28 టోల్‌ప్లాజాలున్నాయి. ఆయా మార్గాల్లో 60 కిలోమీటర్లలోపే ఏడు ప్లాజాలు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌-యాదాద్రి రహదారిపై గుడూరు(జాతీయ రహదారి నంబరు 163), హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డులోని మెదక్‌ వద్ద గుమ్మడిదల(ఎన్‌హెచ్‌-765డి), హైదరాబాద్‌-డిండి మార్గంలో కడ్తాల్‌(ఎన్‌హెచ్‌-765), నకిరేకల్‌-తానంచెర్ల రహదారిలో కొత్తగూడెం(ఎన్‌హెచ్‌-365), జడ్చర్ల-కల్వకుర్తి మార్గంలో మాన్ననూరు(ఎన్‌హెచ్‌-167),  తొండపల్లి-జడ్చర్ల రహదారిపై రాయికల్‌(ఎన్‌హెచ్‌-44), ఇదే జాతీయ రహదారిపై మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్‌ జిల్లా పిప్పర్‌వాడ వద్ద ఉన్న టోల్‌ప్లాజా సైతం ఆ జాబితాలో ఉన్నాయి. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్‌ప్లాజాలను గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.  

 


ఏపీలో 15 టోల్‌గేట్ల తొలగింపునకు అవకాశం!

ఈనాడు - అమరావతి: కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటన మేరకు ఏపీలో జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో దాదాపు 15 వరకు మూతపడే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు.  ఆ మేరకు వాహనదారులకు ఊరట కలుగుతుందా? లేక తొలగించిన టోల్‌ప్లాజాల రుసుములను కూడా ఉన్నవాటిలోనే కలుపుతారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని