CM KCR: మత క్యాన్సర్‌ మనకొద్దు

విదేశాల్లో కోట్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్లని అక్కడి ప్రభుత్వాలు తిప్పి పంపిస్తే వాళ్లకు ఉపాధి ఎవరు కల్పించాలి? మన శాశ్వత ప్రయోజనాలు దెబ్బతినేలా సంకుచిత ధోరణులకు ఆస్కారం ఇవ్వొద్దు.

Updated : 27 Apr 2022 05:13 IST

 అలాంటిది సోకితే ప్రమాదం

అదంతా చిల్లర రాజకీయం

 కొట్లాటలు, కర్ఫ్యూలుంటే పెట్టుబడులొస్తాయా?

 అల్వాల్‌ టిమ్స్‌ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు

 హైదరాబాద్‌లో మూడు చోట్ల ఆసుపత్రులకు భూమి పూజ

 పేదల కోసం రూ.2,679 కోట్లతో నిర్మిస్తున్నామని సీఎం వెల్లడి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, అల్వాల్‌, సనత్‌నగర్‌, నాగోల్‌, న్యూస్‌టుడే

విదేశాల్లో కోట్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్లని అక్కడి ప్రభుత్వాలు తిప్పి పంపిస్తే వాళ్లకు ఉపాధి ఎవరు కల్పించాలి? మన శాశ్వత ప్రయోజనాలు దెబ్బతినేలా సంకుచిత ధోరణులకు ఆస్కారం ఇవ్వొద్దు.


ఇతర పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సభలు నిర్వహిస్తున్నాయి. మేం మాత్రం ప్రజారోగ్యానికి సంబంధించిన అంశంపై సభ పెట్టాం. ఇదే వాళ్లకు, మాకు ఉన్న తేడా.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


రాష్ట్రంలో కొందరు మతం, కులం పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మన దేశం అన్ని కులాలు, మతాల్ని సమానంగా ఆదరిస్తుందని, సామరస్య వాతావరణాన్ని చెడగొట్టుకుంటే ఎటూ కాకుండా పోతామని వ్యాఖ్యానించారు. ఫలానా వాళ్ల దుకాణంలో పూలు.. ఇతర వస్తువులు కొనొద్దని మాట్లాడుతున్నారని, ఇలాంటి క్యాన్సర్‌ జబ్బు మనకు పట్టుకుంటే చాలా ప్రమాదకరమని అన్నారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌, గడ్డి అన్నారం, ఎర్రగడ్డలలో మూడు చోట్ల రూ.2,679 కోట్ల అంచనా వ్యయంతో టిమ్స్‌(తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) నిర్మాణానికి కేసీఆర్‌ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం అల్వాల్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘‘తెలంగాణకు దేశవిదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెడుతున్నారు. హైదరాబాద్‌కు వెళ్తే ప్రశాంతంగా ఉంటుందని.. అందరూ కలిసి ఉంటారన్న భావనతోనే పెట్టుబడులతో వస్తారు. 144 సెక్షన్లు, కర్ఫ్యూలు, తెల్లారితే ఘర్షణ పడతారనుకుంటే ఎవరైనా వస్తారా? సామరస్యం శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వెల్లువలా వచ్చి ఉపాధి దొరుకుతుంది. మతం, కులం పేరిట కొట్లాటలు, కర్ఫ్యూలు ఉంటే పెట్టుబడులు రావు. ఈ వాతావరణం ఉంటే మన కాళ్లను మనం నరుక్కున్నట్టే. ఇలాంటి క్యాన్సర్‌ను మనం తెచ్చుకోవద్దు

రాష్ట్రాన్ని కాపాడుకుంటాం

తెలంగాణ దేశానికే తలమానికంగా ఉండేందుకు ఎవరితోనైనా పోరాడతాం. ధైర్యంగా ముందుకెళ్తాం. దుష్టశక్తుల బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టుకుంటాం. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ.. తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను దాటింది. ఇప్పుడు మన దగ్గర కరెంటు పోతే వార్త.. దేశంలో మాత్రం కరెంటు ఉంటే వార్త. విద్యుత్తు కోసం గుజరాత్‌లో రైతులు రోడ్ల మీదకొచ్చి పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం అన్ని రంగాలకు 24 గంటలూ విద్యుత్తు ఇస్తున్నాం. గతంలో ఎండాకాలం వస్తే ఏ మూలకెళ్లినా ఎమ్మెల్యేలకు బిందెల ప్రదర్శనలు ఎదురయ్యేవి. మిషన్‌ భగీరథతో బిందెల ప్రదర్శనలు బంద్‌ అయ్యాయి. అలాగే కాళేశ్వరం, పాలమూరు, సీతారామ వంటి పథకాలతో సాగునీటి రంగంలో ముందుకెళ్తున్నాం. ఇక నుంచి ప్రభుత్వ వైద్యం, విద్య మీద మరింత దృష్టి పెడతాం. గురుకులాలు ఇంకా పెరగాలి. ఎక్కడికక్కడే పేదలకు విద్య, వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

కరోనాకు మించిన తాతలు ఉన్నాయని చెప్పారు

నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ప్రైవేటు ఆసుపత్రులు ఎన్నో వచ్చినా పేదలకు ఉన్నత వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ ఆసుపత్రులు తప్ప వేరే లేవు. ఇటీవల కొందరు శాస్త్రవేత్తలతో సమావేశమైనప్పుడు వైరస్‌ల దాడి కరోనాతో ముగుస్తుందా అని అడిగా. దాన్ని మించిన తాతలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రజా అవసరాలకు వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరుస్తున్నాం. హైదరాబాద్‌ అంతర్జాతీయ నగరంగా మారుతోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో 1.64 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారి అవసరాలకు సరిపడా పశ్చిమాన ఛాతి ఆసుపత్రిలో, తూర్పున గడ్డి అన్నారం, ఉత్తరాన అల్వాల్‌లో టిమ్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే దక్షిణాన గచ్చిబౌలిలో ఇది ఉంది. వీటితోపాటు నిమ్స్‌లో అదనంగా రెండు వేల పడకలు మంజూరు చేశాం’’ అని సీఎం పేర్కొన్నారు.


కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత వైద్యం

‘‘ఎయిమ్స్‌ తరహాలో టిమ్స్‌ అత్యాధునిక వైద్య సేవలు అందిస్తాయి. కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు సహా 16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత వైద్యం అందుతుంది. ఒక్కో ఆసుపత్రి వెయ్యి పడకలతో ప్రారంభమవుతుంది. 300 చొప్పున ఐసీయూ బెడ్‌లు ఉంటాయి. అల్వాల్‌ టిమ్స్‌లో స్థలం ఎక్కువగా ఉన్నందున 100 లేదా 200 పడకలతో ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేయాలి. ఎంత అభివృద్ధి చెందినా వైరస్‌లను నాశనం చేసే వ్యవస్థలేదు. దాన్ని నియంత్రించేది వైద్య విధానం ఒక్కటే. పటిష్ఠ వైద్య వ్యవస్థ ఉన్న చోట తక్కువ నష్టంతో బయటపడతారు.  అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది’’ అని సీఎం తెలిపారు.


అదనంగా 7,500 పడకలు అందుబాటులోకి వస్తాయ్‌: మంత్రి హరీశ్‌రావు

కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్‌తోపాటు వరంగల్‌ వంటి నూతన ఆసుపత్రులతో అదనంగా 7,500 పడకలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘‘జిల్లాకొకటి చొప్పున 33 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నాం. వాటితోపాటు నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటవుతాయి. ఇప్పటికే గద్వాల, బాన్సువాడలలో పనులు మొదలయ్యాయి. డయాలసిస్‌ కేంద్రాలను 3 నుంచి 102కు పెంచాం. సమైక్య రాష్ట్రంలో వైద్య అవసరాలకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఎంఎన్‌జే ఆసుపత్రులే ఉండేవి. ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. రానున్న 50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరం నలువైపులా టిమ్స్‌ ఏర్పాటు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. పేదవారి ఆకలి తెలిసిన నాయకత్వం రాష్ట్రానికి ఉండటం వల్ల అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. సీఎం వెంట మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేశవరావు తదితరులున్నారు.


పేదల వైద్యానికి నలుదిక్కులా అండ

  ఒక్కో దాంట్లో ఒక్కో ప్రత్యేకత

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో మంగళవారం కొత్తగా మూడు టిమ్స్‌ (తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)కు శ్రీకారం చుట్టడంతో భవిష్యత్తులో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్‌ సేవలు అందుతుండగా.. కొత్తగా  మూడు ఆసుపత్రుల్ని ఒక్కో దాన్ని వైద్యపరంగా ఒక్కో ప్రత్యేకతతో ఏర్పాటు చేస్తున్నారు. అల్వాల్‌ ఆసుపత్రి న్యూరో సైన్స్‌, గడ్డి అన్నారం వైద్యశాల గ్యాస్ట్రో సైన్స్‌, ఎర్రగడ్డలో కార్డియాక్‌ సైన్స్‌ ప్రత్యేకతతో ఏర్పాటవుతున్నాయి. ఇతర అన్ని రకాల వైద్యసేవలు అందిస్తూనే ఆయా విభాగాల్లో వాటికి గుర్తింపు ఉంటుంది. ప్రతిచోటా 16 చొప్పున ఆపరేషన్‌ థియేటర్లు నిర్మించనున్నారు. డయాలసిస్‌, క్యాథ్‌ల్యాబ్‌, రేడియేషన్‌, కీమో థెరపీ, సీటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ సహా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మూడు చోట్ల వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్‌, పారా మెడికల్‌ కళాశాలలు అందుబాటులోకి వస్తాయి. ట్రామాసేవలు, వివిధ వ్యాధి నిర్ధారణ విభాగాలు ఇక్కడ ఏర్పాటవుతాయి. వైద్యులకు క్వార్టర్లు నిర్మించనున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts