Sri Lanka Crisis: మహీంద పలాయనం

ద్వీపదేశం శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ మహీంద రాజపక్సకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. ఆందోళనకారులు దాడికి యత్నించడంతో ఆయన తన నివాసాన్ని వదిలి పారిపోయారు!

Updated : 11 May 2022 05:28 IST
ట్రింకోమలీ నౌకాదళ స్థావరంలో తలదాచుకున్న మాజీ ప్రధాని
శ్రీలంకలో చల్లారని ఉద్రిక్తతలు
రాజపక్స విధేయులు దేశం వీడకుండా నిరసనకారుల జాగ్రత్తలు
కొలంబో విమానాశ్రయానికి వెళ్లే దారిలో తనిఖీల నిర్వహణ
ఘర్షణల్లో 8కి పెరిగిన మృతుల సంఖ్య
కొలంబో

ద్వీపదేశం శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ మహీంద రాజపక్సకు నిరసనల సెగ తగులుతూనే ఉంది. ఆందోళనకారులు దాడికి యత్నించడంతో ఆయన తన నివాసాన్ని వదిలి పారిపోయారు! దేశ ఈశాన్య తీరంలోని ట్రింకోమలీ నౌకాదళ స్థావరంలో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు. కొలంబోలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై సోమవారం జరిగిన దాడులకు ఆయనే కారణమని ప్రతిపక్ష పార్టీల నాయకులు సహా అనేక మంది ఆరోపిస్తున్నారు. ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజపక్స కుటుంబానికి విధేయులుగా ఉన్న నేతలెవరూ దేశం విడిచి వెళ్లకుండా ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొలంబోలోని బండారనాయికె అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో వారు చెక్‌పాయింట్‌ను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు- సోమవారం నాటి హింసలో మృత్యువాతపడ్డవారి సంఖ్య 8కి పెరిగింది. ఈ ఘర్షణల్లో మొత్తం 249 మంది గాయపడ్డారని, వారిలో 232 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారవర్గాలు వెల్లడించాయి.

కొలంబోలో ప్రధానమంత్రి అధికార నివాసం ‘టెంపుల్‌ ట్రీస్‌’ వద్ద సోమవారం రాత్రంతా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. మహీందపై దాడి చేయడమే లక్ష్యంగా వేలమంది లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు పలుమార్లు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ మహీంద, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం తెల్లవారుజామున అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. మహీంద, ఆయన భార్య, మరికొందరు కుటుంబసభ్యులు ట్రింకోమలీ నౌకాదళ స్థావరానికి చేరుకొని ఆశ్రయం పొందుతున్నారు. వారి రాక గురించి తెలియడంతో అక్కడ కూడా ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. కొలంబోలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు కొనసాగిస్తున్నవారిపై దాడి చేసేలా మహీంద తన మద్దతుదారులను రెచ్చగొట్టారని కొంతమంది న్యాయవాదులు ఆరోపించారు. తాజా మాజీ ప్రధానితో పాటు ఆయన సహచరులనూ అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహీందను అరెస్టు చేయాలని మాజీ ప్రధానమంత్రి మైత్రీపాల సిరిసేన, ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగి జన బలవేగయ నేత రంజిత్‌ మద్దుమ బండార తదితరులు డిమాండ్‌ చేశారు. శాంతియుత నిరసనలపై దాడులను వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.  ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకొని మహీంద మద్దతుదారులు జరిపిన దాడులపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీపీ) చందన విక్రమరత్నె తెలిపారు.

ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశాలు

ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకారులను అదుపు చేయడమే లక్ష్యంగా శ్రీలంక రక్షణ శాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడం, విధ్వంసానికి పాల్పడటం, ఇతరులకు హాని చేయడం వంటి చర్యలకు దిగేవారిపై కాల్పులు జరిపేందుకు వీలుగా సైన్యం, వాయుసేన, నౌకాదళం సిబ్బందికి అవసరమైన అధికారాలిచ్చింది.

పార్లమెంటును సమావేశపర్చాలన్న స్పీకర్‌

దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై చర్చించేందుకు సత్వరం పార్లమెంటును సమావేశపర్చాల్సిందిగా లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను స్పీకర్‌ మహీంద యాప అబెయవర్దెనె కోరారు. వాస్తవానికి పార్లమెంటు ఈ నెల 17న భేటీ కావాల్సి ఉంది. ప్రస్తుతం దేశానికి ప్రధానిగానీ, ప్రభుత్వంగానీ లేకపోవడంతో ఆ సమావేశాన్ని ముందుకు జరపాలని స్పీకర్‌ విన్నవించారు. మరోవైపు- నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు గొటబాయ అన్ని పార్టీల నేతలతో త్వరలోనే భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని