మధ్యవర్తిత్వానికి ఐఏఎంసీ ప్రోత్సాహం

ఆర్బిట్రేషన్‌, మధ్యవర్తిత్వం సంస్కృతిని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) ప్రోత్సాహం అందిస్తోందని ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. వివాదాల

Published : 24 May 2022 05:07 IST

జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్బిట్రేషన్‌, మధ్యవర్తిత్వం సంస్కృతిని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) ప్రోత్సాహం అందిస్తోందని ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. వివాదాల పరిష్కారంలో ఆర్బిట్రేటర్‌గా నియమితులైనవారు నిష్పక్షపాతంగా న్యాయమూర్తిలా వ్యవహరించాలని సూచించారు. ఆర్బిట్రేషన్‌ అన్నది కోర్టు బయట జరిగే ప్రక్రియ కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ జిల్లాలోని ఐఏఎంసీ కేంద్రంలో సోమవారం సాయంత్రం ‘భారతదేశంలో ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ భవిష్యత్తు’ అనే అంశంపై ఐఏఎంసీ, సంవాద్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఆర్బిట్రేటర్‌ జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్బిట్రేటర్‌గా నియమితులైనప్పటి నుంచి అవార్డు జారీ చేసేదాకా న్యాయవాదుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సంస్కృతిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సింది న్యాయవాదేనని పేర్కొన్నారు. వివాదం ప్రారంభ దశలోనే సత్వర పరిష్కారం నిమిత్తం పార్టీలను మధ్యవర్తిత్వానికి ప్రతిపాదించాలన్నారు. ఆర్బిట్రేషన్‌ చట్టం అమలులో కొన్ని సవాళ్లున్నాయని, అర్హత ఉన్నవారిని నియమించడంలో జాప్యం వంటివి ఉన్నాయని చెప్పారు. ఐఏఎంసీ రిజిస్ట్రార్‌ తారిఖ్‌ఖాన్‌, సంవాద్‌ సంస్థకు చెందిన ఏక్తాబల్‌, పూర్ణిమా కాంబ్లే, కింగ్‌ స్టబ్‌ అండ్‌ కసివా లా ఫర్మ్‌ అధినేత రాజీవ్‌ రాంభట్ల తదితరులు మాట్లాడారు. సంస్థాగత ఆర్బిట్రేషన్‌, మధ్యవర్తిత్వం పాత్ర, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలపై కొవిడ్‌ ప్రభావాన్ని వీరు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని