రాజధానిలో కాలుష్య రహిత కూడళ్లు

అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో రాజధానిలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకూ కృషిచేస్తున్నారు. ఇందుకోసం దేశంలోనే తొలి కాలుష్య రహిత కూడలి (గ్రీన్‌ ట్రాఫిక్‌

Updated : 28 May 2022 06:46 IST

 కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు పోలీసుల కార్యాచరణ

గూగుల్‌తో ఒప్పందం.. సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో రాజధానిలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకూ కృషిచేస్తున్నారు. ఇందుకోసం దేశంలోనే తొలి కాలుష్య రహిత కూడలి (గ్రీన్‌ ట్రాఫిక్‌ జంక్షన్‌)ని రూపొందించనున్నారు. తర్వాత క్రమంగా మొత్తం 150 ట్రాఫిక్‌ జంక్షన్లను పర్యావరణమిత్ర కూడళ్లుగా మార్చనున్నారు. ఇందుకోసం గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కూడళ్ల వద్ద సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విషవాయువులను తగ్గించనున్నారు. ఒకటి రెండు నెలల్లోనే తొలి పర్యావరణ కూడలి ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు.అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు.
ఏం చేస్తారు?

* ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ కూడలిలో రాకపోకలు సాగించే వాహనాల లెక్కలను గంటలవారీగా గూగుల్‌ ప్రతినిధులు విశ్లేషిస్తారు. ఏవైపు నుంచి వాహనాలు ఏ మేరకు వస్తున్నాయన్న సమాచారాన్ని సేకరిస్తారు.

* టైమర్లలో సమయాన్ని సెకన్లవారీగా కచ్చితత్వంతో చూపించేలా (ఉదా. 42, 31, 22) సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తారు.వేగంగా కూడలి క్లియర్‌ అయ్యేలా సిగ్నలింగ్‌ వ్యవస్థను మారుస్తారు. టైమర్‌ ఆధారంగా వాహనాల ఇంజిన్లను ఆపేందుకు వీలుంటుంది.

కృత్రిమ మేధ.. గూగుల్‌ డేటా 

ఇజ్రాయెల్‌లోని హైఫాలో గూగుల్‌ గతేడాది అక్టోబరులో నాలుగుచోట్ల గ్రీన్‌ ట్రాఫిక్‌ జంక్షన్లను ఏర్పాటు చేసింది. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను ఉపయోగించింది. సిగ్నలింగ్‌లో మార్పులు చేశారు. వారం రోజుల్లోనే ఆ నాలుగు కూడళ్లలో 2 శాతం ట్రాఫిక్‌ నిలచిపోవడాలు తగ్గాయని గుర్తించారు. రియోడిజెనిరోలోనూ ఈ తరహాలో ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దేశంలో తొలిసారిగా గ్రీన్‌ ట్రాఫిక్‌ జంక్షన్‌ ప్రారంభించేందుకు గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. పర్యావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలు తగ్గడంతోపాటు ట్రాఫిక్‌ నిలచిపోవడాలు గణనీయంగా తగ్గనున్నాయని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని