Telangana News: సీఎంకు సందేశం ఇచ్చేందుకే..

తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న తనను ఆపే శక్తి ఎవరికీ లేదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని.. తనకు వ్యతిరేకంగా, నిరసనగా మాట్లాడే వారిని పట్టించుకోనన్నారు.

Published : 11 Jun 2022 05:47 IST

నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు
రాజ్‌భవన్‌నే గౌరవించడం లేదు.. సామాన్యుల పరిస్థితేంటి?
సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం నివేదికే ఇవ్వలేదు
మహిళా దర్బార్‌లో తమిళిసై
తెలుగులో మాట్లాడిన గవర్నర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న తనను ఆపే శక్తి ఎవరికీ లేదని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటానని.. తనకు వ్యతిరేకంగా, నిరసనగా మాట్లాడే వారిని పట్టించుకోనన్నారు. ప్రభుత్వం తనకు సరైన గౌరవ మర్యాదలు (ప్రొటోకాల్‌) ఇవ్వడం లేదని, అయినా తన కార్యక్రమాలు ఆపడంలేదని తెలిపారు. శుక్రవారం ఆమె రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తెలుగులో మాట్లాడారు. ‘‘ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర సర్కారు ప్రవర్తన మారాలి. రాజ్‌భవన్‌నే గౌరవించకుంటే.. సామాన్యుల పరిస్థితేంటి? రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచార ఘటనపై ఇప్పటికీ ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదు...సర్కారుకు బాధ్యత లేదా? రాజ్‌భవన్‌ నుంచి సీఎం కేసీఆర్‌కు సందేశం (మెసేజ్‌) ఇచ్చేందుకు ఈ దర్బార్‌ ద్వారా ప్రయత్నిస్తున్నా. ఆయనను కలిసి ఏడాది దాటింది. నన్ను కలవకున్నా నా సందేశం చేరితే చాలు. వీసీలపై గవర్నర్‌ అధికారాలు తొలగించాలా వద్దా అనేది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రజా దర్బార్‌ నిరంతర కార్యక్రమం. మహిళా దర్బార్‌ వెనుక రాజకీయం లేదు. నా పరిధులు దాటడం లేదు. నా బలమైన స్వరంతో అతివల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తా. భవిష్యత్తులోనూ మహిళా దర్బార్‌ కొనసాగిస్తా. 

రాజకీయ కార్యక్రమం కాదు

బాలికలు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తే నా గుండె రగిలిపోతోంది. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా. మహిళల బాధలను తీర్చాల్సింది ప్రభుత్వమే అని.. రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ.. రాజ్‌భవన్‌ కూడా ప్రభుత్వ కార్యాలయమే. నేను మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని భావిస్తున్నా. ప్రజలను గవర్నర్‌ కలుస్తారా అని చాలా మందికి అనుమానాలున్నాయి. కరోనా సమయంలోనూ భద్రత సిబ్బంది వద్దన్నా నేను ధైర్యంగా వెళ్లి రోగులను పరామర్శించా. నా వంతు సాయం చేశా. సమాజంలో మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. ఇంట్లో, పనిచేసే చోట, పాఠశాలల్లో, కాలేజీల్లో, రోడ్లపైన ఇలా ప్రతిచోటా ఆడపిల్లలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది ఇంట్లో  చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక కుమిలిపోతున్నారు. కొన్నిసార్లు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదంతా ఆపడానికి.. నేనున్నానని చెప్పడానికే ఈ మహిళా దర్బార్‌ కార్యక్రమం ఏర్పాటు చేశా. 24 గంటల క్రితమే నిర్ణయం తీసుకున్నా. మంచి స్పందన వచ్చింది.

నిర్భయంగా కలవొచ్చు

ఎవరైనా నన్ను నిర్భయంగా కలిసి వారి సమస్యలు చెప్పొచ్చు. రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కుల మేరకే నడుచుకుంటున్నా. రాజ్‌భవన్‌లో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం లేదు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తున్నా. నా వద్దకు వచ్చిన ప్రతి ఫిర్యాదును పర్యవేక్షిస్తా. వీటిపై ప్రభుత్వ శాఖలు, అధికారులు వెంటనే స్పందించాలి’’ అని తెలిపారు.


అయిదు వందలకు పైగా వినతులు

మహిళా దర్బార్‌లో భాగంగా 500కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీరిలో కొంతమంది నేరుగా గవర్నర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని తమిళిసై హామీ ఇచ్చారు. వ్యక్తిగత సమస్యలు, భూ, ఆస్తి తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. మహిళాదర్బార్‌ ఏర్పాటుపై పలువురు వనితలు గవర్నర్‌ను అభినందించారు. మహిళా వీఆర్‌ఏలు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని