Published : 25 Jun 2022 05:32 IST

గందరగోళంగా జేఈఈ మెయిన్‌

సర్వర్‌ సమస్యతో నాలుగు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభం
‘అబిడ్స్‌ ఆరోరా’ కేంద్రంలో మధ్యాహ్నం పరీక్ష వాయిదా
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. కన్నీటిపర్యంతం

ఈనాడు, హైదరాబాద్‌, మలక్‌పేట, సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్‌ నిర్వహణ గందరగోళంగా మారింది. గురువారం బీఆర్క్‌ పేపర్‌-2 పరీక్ష మేడ్చల్‌లోని ఓ కేంద్రంలో సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా మొదలవగా, శుక్రవారం హైదరాబాద్‌లో రెండుచోట్ల, కరీంనగర్‌లో రెండుచోట్ల  గంటల తరబడి ఆలస్యమయ్యాయి. సాంకేతిక సమస్యలతో అందులోని ఓ కేంద్రంలో మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేశారు.

సర్వర్‌ సమస్యతో పరీక్ష వాయిదా

జేఈఈ మెయిన్‌ పేపర్‌-1కు హైదరాబాద్‌లో దాదాపు 15 వరకు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అబిడ్స్‌ అరోరా ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలో ఉదయం 9 గంటలకు జరగాల్సిన పరీక్ష సర్వర్‌ సమస్యతో ఆలస్యంగా 10.30 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం పరీక్ష సమయంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎంతకీ పరిష్కారం కాలేదు. దీంతో ఆ పరీక్షను వాయిదా వేయాలని ఎన్‌టీఏ నిర్ణయించిందంటూ కేంద్రం వద్ద నిర్వాహకులు నోటీసు అంటించారు. తమకు ఆలస్యంగా పరీక్ష మొదలైనా 3 గంటల సమయం ఇవ్వకుండానే కంప్యూటర్‌ ఆగిపోయిందని ఈ కేంద్రంలో ఉదయం పరీక్ష రాసిన ఈసీఐఎల్‌కు చెందిన ఓ విద్యార్థి ‘ఈనాడు’కు తెలిపాడు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన విద్యార్థులు లోపల ఆందోళనకు దిగినట్టు సమాచారం.

మూడు గంటల ఆలస్యంగా అనుమతి

మూసారాంబాగ్‌లోని అరోరా కళాశాలలో ఉదయం పరీక్షను సర్వర్‌ సమస్యతో కొందరికి మధ్యాహ్నం నిర్వహించారు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు గేటు ముందు నిరసనలకు దిగారు. ‘‘ఉదయం 7.30-8 గంటల మధ్య విద్యార్థులను కేంద్రం లోపలికి వదిలారు. సర్వర్‌ సమస్యలంటూ ఆరణలోనే 3 గంటలపాటు నిలిపివేశారు. సుమారు 12.35 గంటల సమయంలో అనుమతించారు’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. భోజనం కూడా చేయకుండా లోపలికి వెళ్లిన పిల్లలు పరీక్ష ఎలా రాయగలరని వాపోయారు. జరిగిన పరిణామాలతో విద్యార్థులూ కన్నీటిపర్యంతమయ్యారు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లోని రెండు కేంద్రాల్లోనూ పరీక్ష ఆలస్యంగా మొదలైంది. ‘ఆన్‌లైన్‌ పరీక్షలు కావడంతో వాటి నిర్వహణను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) అధికారులు గత కొన్నేళ్లుగా టీసీఎస్‌ సంస్థకు అప్పగిస్తున్నారు. ఆ సంస్థకు ఈసారి పూర్తి నిర్వహణ బాధ్యతలు ఇవ్వలేదని, ఎన్‌టీఏనే నిర్వహణను పర్యవేక్షిస్తోందని సమాచారం. ఆ సంస్థకు అనుభవం లేకపోవడంతో సాంకేతిక అంశాలను అన్ని కోణాల్లో పరిశీలించలేదని, అందుకే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయని’ నిపుణులు విశ్లేషించారు.

గణితం ప్రశ్నలకు అధిక సమయం

తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం పరీక్షల్లో గణితం ప్రశ్నలను ఎక్కువ సమయం తీసుకునేలా రూపొందించారని నిపుణులు విశ్లేషించారు. భౌతికశాస్త్రం ప్రశ్నలు మధ్యస్తంగా, రసాయనశాస్త్రానికి సులభంగా ఉన్నాయని తెలిపారు. రసాయనశాస్త్రంలో కొన్ని జ్ఞాపకశక్తి ఆధారిత ప్రశ్నలు ఇచ్చారని జేఈఈ నిపుణుడు, శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని