Telangana News: నన్ను చదివించండి సారూ!

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఓ ఆలయ సందర్శనకు వెళ్లారు. హఠాత్తుగా ఓ బాలుడు వచ్చి ఆయన చేయి పట్టుకుని రోదించసాగాడు. అనూహ్య పరిణామంతో ఆయనకు వెంటనే ఏమీ అర్థం కాలేదు. బాలుడిని సముదాయించి..

Updated : 27 Jun 2022 07:36 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వేడుకున్న బాలుడు

వెంటనే ప్రైవేటు పాఠశాలలో చేర్పించిన అమాత్యుడు

నవాబ్‌పేట, న్యూస్‌టుడే: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఓ ఆలయ సందర్శనకు వెళ్లారు. హఠాత్తుగా ఓ బాలుడు వచ్చి ఆయన చేయి పట్టుకుని రోదించసాగాడు. అనూహ్య పరిణామంతో ఆయనకు వెంటనే ఏమీ అర్థం కాలేదు. బాలుడిని సముదాయించి.. ఏంటని ఆరాతీయగా.. ‘నన్ను చదివించండి సారూ’ అంటూ అతడు వేడుకున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌ మైసమ్మ దేవాలయం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. హన్వాడ మండలానికి చెందిన మల్లెల వెంకటేశ్‌ నిరుపేద. సొంతూళ్లో ఆస్తిపాస్తులు లేకపోవటంతో.. అత్తగారి ఊరైన కాకర్లపహాడ్‌కు వచ్చి భార్య బుజ్జమ్మ, ఇద్దరు పిల్లలతో చిన్న రేకుల గదిలో నివసిస్తున్నారు. మైసమ్మ ఆలయం సమీపంలోని చెట్టు కింద చిన్న డబ్బాలో శీతల పానీయాలు, నీటిసీసాలు పెట్టుకుని విక్రయిస్తుంటారు. వారంలో భక్తుల రద్దీ ఉండే మూడు రోజుల్లో మినహా వీరి వ్యాపారానికి గిరాకీ ఉండదు. అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్నారు. వారి పెద్ద కుమారుడు విజయ్‌కుమార్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి వరకు చదివాడు. ఇకపై చదివే స్థోమత లేక.. తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు. ఆదివారం మైసమ్మ ఆలయ దర్శనానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దగ్గరకు విజయ్‌కుమార్‌ పరుగు తీశాడు. ఆయన చేయి పట్టుకుని.. తనను చదివించమని కన్నీళ్లతో వేడుకున్నాడు. మంత్రి అతడిని ఓదార్చారు. తల్లిదండ్రులను పిలిచి వివరాలు తెలుసుకున్నారు. చదువుకోవాలన్న బాలుడి తపన చూసి ఆయన చలించారు. వెంటనే అతడిని తన వాహనంలో మహబూబ్‌నగర్‌ తీసుకెళ్లి, ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. హాస్టల్‌ వసతి కల్పించి యూనిఫాం, పుస్తకాలు తదితరాలన్నీ ఇప్పించారు. బాలుడి చదువు పూర్తయి స్థిరపడేదాకా తాను అండగా ఉంటానని శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు