ఇక విస్తరణే

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపూర్‌ వరకు విస్తరణ పనులకు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ  గుత్తేదారును ఖరారు చేసింది. సుమారు 22 నుంచి 24 కిలోమీటర్ల మేర రహదారిని

Updated : 29 Jun 2022 05:53 IST

 ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపూర్‌ వరకు ఆరు వరుసల నిర్మాణానికి టెండరు ఖరారు

ఆగస్టు నుంచి రహదారి పనులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిలో ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపూర్‌ వరకు విస్తరణ పనులకు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ  గుత్తేదారును ఖరారు చేసింది. సుమారు 22 నుంచి 24 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలకు విస్తరించనున్నారు. మార్గమధ్యలో ట్రాఫిక్‌ అధికంగా ఉండే జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. ఏడు ప్రాంతాల్లో ఇవి రానున్నాయి. హైదరాబాద్‌-విజయవాడ మార్గాన్నీ త్వరలో ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఎల్బీనగర్‌-దండుమల్కాపూర్‌ వరకు కొన్ని ప్రాంతాల్లో రహదారి ఇరుకుగా ఉంటుంది. ఆ రహదారిని విస్తరించాలన్న డిమాండు గడిచిన కొన్నేళ్లుగా ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మార్గం విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపింది. విస్తరణ పనులకు గడిచిన డిసెంబరులో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సుముఖత వ్యక్తం చేయటంతో అధికారులు సవివర నివేదికలను పంపి ఆమోదాన్ని పొందారు. గుత్తేదారును ఎంపిక చేసేందుకు టెండర్లు ఆహ్వానించగా పది మంది దాఖలు చేశారు. తక్కువ మొత్తాన్ని ప్రతిపాదించిన సంస్థను ఎల్‌-1గా ఖరారు చేశారు.

రెండేళ్లలో విస్తరణ పూర్తి

ఎల్బీనగర్‌ నుంచి దండుమల్కాపూర్‌ మధ్యలో అక్కడక్కడా రహదారి 6 వరుసలకు విస్తరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతాచోట్లా గతంలోనే భూసేకరణ చేసి ఉండటంతో  సమస్యలేవీ లేవని ఉన్నతాధికారి ఒకరు సోమవారం ‘ఈనాడు’తో చెప్పారు. విస్తరణ పనులకు రూ.415 కోట్లు వ్యయం అవుతుంది. విస్తరణ పనులతోపాటు ఏడు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, వీధి లైట్ల ఏర్పాటు, రహదారి వెంట పచ్చదనాన్ని పెంచే బాధ్యత కూడా గుత్తేదారుకే ప్రభుత్వం అప్పగించింది. రహదారికి ఇరువైపులా సుమారు ఆరు వేల మొక్కలు నాటాలని కూడా స్పష్టం చేసింది.  ప్రభుత్వానికి గుత్తేదారు సంస్థకు మధ్య ఒప్పంద ప్రక్రియ పూర్తి అయ్యేందుకు కనీసం నెల రోజులు పడుతుందని అంచనా. ఈ క్రమంలో ఆగస్టు నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో విస్తరణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని