ఎసైన్డ్‌ భూములతో జమునా హేచరీస్‌కు సంబంధం లేదు

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో ప్రభుత్వం బుధవారం గ్రామస్థులకు పంపిణీచేసిన భూములకు, జమునా హేచరీస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ఎండీ ఈటల జమున స్పష్టంచేశారు. జమునా హేచరీస్‌లో

Published : 01 Jul 2022 06:10 IST

 రాజకీయంగా ఎదుర్కోలేకనే అభియోగాలు
 ఈటల జమున వెల్లడి

మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో ప్రభుత్వం బుధవారం గ్రామస్థులకు పంపిణీచేసిన భూములకు, జమునా హేచరీస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ఎండీ ఈటల జమున స్పష్టంచేశారు. జమునా హేచరీస్‌లో ఉన్న ఎసైన్డ్‌ భూములను గుర్తించి..రైతులకు పంపిణీ చేశామని చెప్పడం సత్యదూరమన్నారు. గురువారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పూడూరులోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘80 ఎకరాలకుపైగా భూములు మా పేరిట ఉన్నట్లు అధికారులు అవాస్తవాలు చెబుతున్నారు. వాస్తవంగా 24 సర్వే నంబర్లలో 58 ఎకరాలు మాత్రమే ఉంది. సదరు భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సేల్‌డీడ్‌లు ఉన్నాయి. ఆ భూములను మేము కొనుగోలుచేసే సమయంలో ఇబ్బందులు తలెత్తలేదు. ప్రస్తుతం వాటిని నిషేధిత జాబితాలో చూపుతున్నారు. సర్వే నంబరు 130/ఎలో మూడెకరాలు కొల్లి సీతారామయ్య వద్ద కొనుగోలు చేశామ’ని ఆమె స్పష్టంచేశారు. హేచరీస్‌ భూములు పంచుతున్నట్లు అధికారులు, తెరాస నేతలు చెప్పడం తమ ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నమేనని మండిపడ్డారు. రాజకీయంగా ఈటల రాజేందర్‌ను ఢీకొట్టలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తాము పేర్కొన్న సర్వే నంబర్లకు సంబంధించిన విస్తీర్ణం కంటే ఒక్క గుంట ఎక్కువున్నా తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. ముఖ్యమంత్రి కాకమునుపు సీఎం కేసీఆర్‌ దగ్గర ఏముందో చెప్పాలని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాతే సీఎం ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ఆస్తులన్నీ అమ్ముకునైనా కేసీఆర్‌పై పోరాటం సాగించాలని తన భర్తకు సూచించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని