వరి రైతుకు కష్టం కలగకూడదని నష్టాన్నీ భరిస్తున్నాం!

‘దిగుబడి ఎక్కువ వస్తుంది కదా అని వరిసాగును నియంత్రిస్తే భవిష్యత్తులో తిండిగింజలకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అవసరానికి మించి దిగుబడి ఉన్నా... నిబంధనల మేరకు నాణ్యత లేకున్నా మా ప్రభుత్వమే

Published : 02 Jul 2022 04:15 IST

మిగులు ధాన్యాన్ని మా ప్రభుత్వమే వేలం వేస్తోంది
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి అమర్జీత్‌ భగత్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘దిగుబడి ఎక్కువ వస్తుంది కదా అని వరిసాగును నియంత్రిస్తే భవిష్యత్తులో తిండిగింజలకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అవసరానికి మించి దిగుబడి ఉన్నా... నిబంధనల మేరకు నాణ్యత లేకున్నా మా ప్రభుత్వమే తీసుకుని వేలం వేస్తోంది. అందులో నష్టం వచ్చినా భరిస్తోంది’ అని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి అమర్జీత్‌ భగత్‌ తెలిపారు. తెలంగాణలో కూడా ఇబ్బడిముబ్బడిగా ఉన్న వరి ధాన్యాన్ని బహిరంగ వేలంలో విక్రయించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలో ‘ఈనాడు’ ఆయనతో మాట్లాడింది. ‘డిమాండ్‌కు మించి ధాన్యం ఉన్న సందర్భాల్లో వేలం వేస్తుంటాం. గత ఏడాది పది లక్షల మెట్రిక్‌ టన్నులను వేలంలో విక్రయించాం. తాజాగా 70 వేల మెట్రిక్‌ టన్నులు విక్రయించాం. సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.1,350, ‘ఎ’ గ్రేడ్‌ రకానికి రూ.1,400 కనీస ధరగా నిర్ణయించాం. రూ.పది నుంచి రూ.వంద వరకు అదనపు ధరకు అమ్ముడవుతుంటాయి.రైతుల నుంచి మాత్రం కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే కొనుగోలు చేశాం. ప్రభుత్వంపై భారం ఎంత అన్నది చెప్పటం కష్టం. నష్టమా.. భారమా? అన్న కోణంలో చూడడం లేదు. రైతులు ఇబ్బంది పడకూడదన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.నాణ్యతా ప్రమాణాలు లేని బియ్యాన్నీ దాణా కోసం వేలంలో అమ్ముతున్నాం’ అని అమర్జీత్‌ భగత్‌ తెలిపారు.గత ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని, 21.70 లక్షల మంది రైతుల నుంచి 98 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. అంత వినియోగం లేకపోవడంతో మిగులు ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయిస్తున్నామన్నారు..కేంద్రం తీసుకోవడం లేదు కదా అని వరి సాగును ప్రోత్సహించకపోతే రైతులు అన్యాయానికి గురవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని