రూ.3,150 కోట్లు ఇస్తేనే ‘ఉపకారం’!

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన ఫీజుల బకాయిలు రూ.3,150 కోట్లకు చేరుకున్నాయి. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు కలిపి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తమిది. ఈ ఆర్థిక

Published : 05 Jul 2022 05:49 IST

ప్రస్తుతం రూ.363 కోట్ల విడుదలకు ఆదేశం
బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం విద్యార్థుల ఎదురుచూపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన ఫీజుల బకాయిలు రూ.3,150 కోట్లకు చేరుకున్నాయి. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు కలిపి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తమిది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మూడు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయీ విడుదల కాలేదు. విద్యార్థుల కోర్సు పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా బోధన ఫీజులు విడుదల కాకపోవడంతో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన వారికి యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ఉన్నతవిద్య, ఉద్యోగాలకు వెళ్తున్నవారు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం రాష్ట్రంలో ఏటా సగటున 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో ప్రత్యేక అభివృద్ధి నిధులున్నప్పటికీ బకాయిలు తప్పడం లేదు. బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలనూ నిధుల కొరత వేధిస్తోంది. సంక్షేమ శాఖలు బిల్లులు సిద్ధం చేస్తున్నా.. ట్రెజరీలో ఆంక్షలతో నిలిచిపోతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే ఆయా బిల్లులు వెనక్కి వస్తున్నాయి. మళ్లీ తిరిగి వాటిని పంపించాల్సి వస్తోంది. దీంతో విద్యాసంవత్సరం పూర్తయి ఏడాది, రెండేళ్లు గడుస్తున్నా విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. రాష్ట్రంలో గడిచిన విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ప్రస్తుత విద్యాసంవత్సరంలో చెల్లిస్తూ వస్తోంది. ఉపకార వేతనాలు, బోధన ఫీజుల బకాయిలపై సోమవారం సమీక్ష నిర్వహించిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు.. బిల్లులు అందలేదన్న కారణంతో ట్రెజరీ అధికారులు వెనక్కి పంపిన ఉపకారవేతనాల నిధులు రూ.363 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. దీంతోపాటు 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి బోధన ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెల్లించేలా బడ్జెట్‌ నిధులు విడుదల చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు తెలిపారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ నిధులు విడుదలైతేనే బోధన ఫీజుల బకాయిలు చెల్లించేందుకు వీలవుతుందని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని