KCR: నీతి ఆయోగ్‌ వృథా

ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన నీతిఆయోగ్‌లో నీతి లేదని, అది నేతిబీర చందంగా మారిందని,  దాని వల్ల ఎవరికీ ఎలాంటి మేలు జరగడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. నీతిఆయోగ్‌ను

Updated : 07 Aug 2022 06:42 IST

కేంద్రం నిర్వీర్యం చేసింది.. దాని వల్ల ఎవరికీ మేలు జరగడం లేదు
అందుకే సమావేశాన్ని బహిష్కరిస్తున్నా
డయాలసిస్‌ రోగులకు నెలకు రూ.2016 సాయం
అనాథ పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం: సీఎం కేసీఆర్‌
ఈనాడు, హైదరాబాద్‌


నీతి ఆయోగ్‌ వాళ్లే తెలంగాణలో తిరిగి చూసి మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు కలిపి రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఇది జరిగి ఆరేళ్లు గడిచిపాయే. రూ.24 వేల కోట్లు కాదుకదా 24 పైసలూ ఇవ్వలే. ఆ సిఫార్సులే బుట్టదాఖలయితే దానికున్న విలువేంటి?

- సీఎం కేసీఆర్‌


ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన నీతిఆయోగ్‌లో నీతి లేదని, అది నేతిబీర చందంగా మారిందని,  దాని వల్ల ఎవరికీ ఎలాంటి మేలు జరగడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. నీతిఆయోగ్‌ను నిరర్థకంగా మార్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా... ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం చాలా బాధాకరమే అయినప్పటికీ.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నానన్నారు. తన నిర్ణయాన్ని ప్రధాని మోదీకి లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తన నిరసనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్‌ సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. పథకాలు పూర్తయినా నిధులు ఇవ్వలేదన్నారు.

నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాటి కేటాయింపు విషయంలో గందరగోళం ఉందని, ఉద్దేశపూర్వకంగా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చిందని,  దీని ద్వారా రూ.15 వేల కోట్ల రుణాల్లో కోత విధించి, అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు అడ్డంకులు కల్పిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని తన వైఖరి మార్చుకోవాలన్నారు. పాలు, బియ్యం ఇతర నిత్యావసరాలు, చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలన్నారు.

నీతిఆయోగ్‌ సాధించిందేమీ లేదు

‘‘కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్డీయే  ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తెచ్చింది. దీనిలో సీఎంలను సభ్యులుగా చేర్చి... టీమ్‌ ఇండియాగా పిలుస్తామని ప్రధాని చెప్పారు. దీని ద్వారా దేశానికి మంచిరోజులు వస్తాయని ఆశించాను. కానీ అది ఇప్పుడు నిష్క్రియాపరత్వంగా మారింది. నీతి ఆయోగ్‌లో మేధోమథనం జరగడం లేదు.ఈ ఎనిమిదేళ్లలో ఏం సాధించారు? ప్రధాని మోదీ ఇచ్చిన ఏ హామీ నెరవేరడం లేదు. చాలా లోతైన అధ్యయనం జరగాలి. దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. చాలా ప్రధానమైన బాధ్యతల్లో ఉన్న నీతిఆయోగ్‌ గొప్ప ఆలోచన చేయాలన్నాం. ఉప సంఘాలు వేసి.. ముఖ్యమంత్రుల బృందాలు వేయాలని చెప్పాం.. ఆ ప్రయత్నం జరగలేదు. దేశం ప్రస్తుతం అన్నింటా వెనకబడింది. దేశ భవిష్యత్తు రోజురోజుకూ ప్రమాదంలో పడుతోంది. దేశచరిత్రలో ఎప్పుడూలేనివిధంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేశారు. దాదాపు 800 రైతులు చనిపోయారు.  రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెండు రెట్లయ్యాయి. సాగుకు నీరు, విద్యుత్తు దొరకట్లేదు.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు  పెరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోతోంది. భారత భూభాగం 83 కోట్ల ఎకరాలు. ఇందులో 40 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమైనవి. ప్రతి ఎకరాకు నీరిచ్చే వనరులు దేశంలో ఉన్నాయి. అయినా అన్నీ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. శ్రీలంక, పాకిస్థాన్‌ లాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.  

రాష్ట్రానికి ఏమిచ్చింది?

కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్ర విధానాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14 లక్షల కోట్ల నిధులు ఎగ్గొట్టారు. ప్రగతిలో దూసుకెళ్తున్న రాష్ట్రాల కాళ్లల్లో కట్టెలు పెట్టవద్దని నీతిఆయోగ్‌ సమావేశాల్లో చెప్పాను. మేం ఏం చెబితే అది చేయాలనే పరిస్థితికి కేంద్రం వచ్చింది. అలా చేయకపోతే.. మీ కథ చూస్తామని హెచ్చరిస్తున్నారు. పన్నులకు సుంకాలుగా పేరు మార్చి రాష్ట్రాల నిధులను కేంద్రం కొల్లగొడుతోంది. శుష్కప్రియాలు... శూన్య హస్తాలు అన్నట్లు కేంద్ర విధానం ఉంది. పంచాయతీరాజ్‌లో రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయి.  ఎన్నో పథకాలకు నీతిఆయోగ్‌, కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప... నిధులు రాలేదు. నీతిఆయోగ్‌ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వనప్పుడు ఇంక ఆ సంస్థ ఎందుకు? గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ రూ. 1.90 లక్షల కోట్లు ఖర్చు చేసింది... ఇందులో కేంద్రం నుంచి వచ్చింది రూ.5 వేల కోట్లు మాత్రమే. కేంద్రానికి మేం పంపించిన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు.. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అన్నారు. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా?

అవే మిమ్మల్ని కబళిస్తాయి

పన్నుల వసూలులో రాజ్యాంగపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సులు వసూలు చేస్తున్నారు. మీరు జేబు సంస్థలుగా వాడుకుంటున్న రాజ్యాంగ సంస్థలే రేపు మిమ్మల్ని కూడా కబళిస్తాయి. దేశమంతా ఏక్‌నాథ్‌ శిందేలు వస్తారని బెదిరిస్తున్నారు. ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా? ప్రశ్నించిన రైతులను కార్లతో తొక్కించారు. పాలు, పెరుగు మీద పన్ను.. చివరికి శ్మశానంలో కూడా పన్ను వేస్తున్నారు. గుజరాత్‌లో చేసే గార్భా అనే సంప్రదాయ నృత్యం మీద కూడా పన్ను వేశారు.   ఆర్థికవేత్తలు రఘురామరాజన్‌, కౌశిక్‌బసు.. ఇంకా ఎంతో మంది పెద్దలు ప్రతి రోజూ హెచ్చరిస్తున్నారు. కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. ఒక్కరినీ పిలిచి మాట్లాడింది లేదు. రైల్వేలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు అన్నీ ప్రైవేటైజేషన్‌ చేసేస్తున్నారు. చివరకు వ్యవసాయ మార్కెట్లను కూడా ప్రైవేటుపరం చేయడం దౌర్భాగ్యం.భారత బ్యాంకుల నుంచి లక్షల కోట్లు విత్‌డ్రా చేసుకొని విదేశాలకు పారిపోతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇలా ఒకపక్క కార్పొరేట్లకు దోచిపెడుతూ.. పేద ప్రజలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్పడం ఎంత వరకు సబబు? కార్పొరేట్‌ దొంగలకు ఇలా లోన్లు ఇవ్వడం ఉచితాలు కాదా’’?అని కేసీఆర్‌ ప్రశ్నించారు.


ఎన్‌పీయేలు పెద్ద కుంభకోణం

న్డీయే ప్రభుత్వ హయాంలో నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్స్‌ (ఎన్‌పీయే)ల విలువ ఏకంగా పది రెట్లు పెరిగింది. ఇది పెద్ద కుంభకోణం. కొన్ని సంస్థలు, అధికారులు కుమ్మక్కయ్యి ఎన్‌పీయేలకు దోచిపెడుతున్నారు. ‘‘2004-05లో ఎన్‌పీయేలు రూ.58 వేల కోట్లు ఉండేవి.. ఇది 2014 నాటికి రూ. 2.63 లక్షల కోట్లకు చేరింది. ఇప్పుడు రూ. 20 లక్షల 7 వేల కోట్లు. ఎన్డీయే ప్రభుత్వంలో ఇదొక దందా అయిపోయింది. ప్రభుత్వ పెద్దలు, ఎన్పీయే వాళ్లు చేతులు కలిపి పెద్ద స్కాం చేస్తున్నారు. వాళ్లు ఎన్పీయే డిక్లేర్‌ చెయ్యగానే.. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు రూ.12 లక్షల కోట్లు ఇచ్చింది. బ్యాంకుల్లో రుణ ఎగవేతలు కూడా లక్షల కోట్లకు చేరాయి. ఇది ప్రగతికి సంకేతమా?


బుల్డోజర్లు, ఎన్‌కౌంటర్లతో అంతర్జాతీయంగా విమర్శలు

బుల్డోజర్ల వినియోగం, ఎన్‌కౌంటర్లలో చంపడం, మతం పేరుతో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు నేతలు తీసుకుంటున్న చర్యలు దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ..అంతర్జాతీయంగా విమర్శలకు తావిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన తప్పుబట్టారు. ఆదివారం జరిగే నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశానికి తాను హాజరుకావడం లేదని తెలుపుతూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అఖిలభారత సర్వీసుల నిబంధనలను మార్చడం రాష్ట్రాలకు నష్టదాయకంగా మారుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించలేని కేంద్రం అసమర్థంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సమాఖ్య సహకార స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనిచేస్తోందనడానికి అనేక ప్రత్యక్ష ఉదాహరణలున్నాయని తెలిపారు.


ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మందికి పింఛన్లు

గస్టు 15 నుంచి  57 ఏళ్ల వయస్సు గల 10 లక్షల మందికి పింఛన్లు ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. కొత్త వాటితో ఆ సంఖ్య 46 లక్షలకు చేరుతుంది. ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు సిఫార్సు మేరకు రాష్ట్రంలోని 12 వేల మంది డయాలసిస్‌ రోగులకు  ‘ఆసరా’ కార్డులు ఇచ్చి, నెలకు రూ.2016 పింఛను ఇస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా సత్‌ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశాం. అనాథ పిల్లల బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది. వారి కోసం ప్రత్యేకంగా కేజీ నుంచి పీజీ వరకు స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. వారిని చదివించి, ఉద్యోగాల్లో కూడా కొంత రిజర్వేషన్‌ కల్పిస్తాం. గ్రాంట్లు కూడా పెంచాలని నిర్ణయించాం.


నీతి ఆయోగ్‌ ఎజెండా రూపకల్పనలో ఎవరికీ భాగస్వామ్యం లేదు. ఎవరు తయారు చేస్తారో.. ఎక్కడ తయారు చేస్తారో ఎవరికీ తెలియదు. ఈ సారి కీలకమైన సమస్యలున్నాయి. దేశంలో ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతోంది? రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? అందరం కలిసి ఏం చేద్దామనే ముచ్చటే లేదు. ఇది చిల్లర రాజకీయం కాదు.. ఇది దేశ ప్రజలకు తెలియాలని ఆవేదనతో చెబుతున్నా’


నీతి ఆయోగ్‌  సమావేశాలతో ఎవరికీ ఉపయోగం లేదు. సమావేశాల్లో మాట్లాడేందుకు సీఎం స్థాయి వ్యక్తికి కూడా సమయం కేటాయించి అయిపోగానే బెల్‌ కొడుతుంటారు. నాలుగు నిమిషాలు మాట్లాడి, నాలుగు గంటలు కూర్చుంటాం. వాళ్లు చెప్పేది మాత్రం వింటూ.. పెట్టే పల్లికాయలు తింటూ.. కూర్చోవాలి. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అందరూ నవ్వుతుంటారు. ఒక బృందం వేస్తే గాచారం బాగాలేక నేను కూడా దాంట్లో మెంబర్‌గా ఉన్న. పైసలు ఖర్చుపెట్టుకొని అప్పటి సీఎస్‌ రాజీవ్‌శర్మతో కలిసి భోపాల్‌కు వెళ్లి  సమావేశంలో పాల్గొన్నాం. చాలా గంటల సమయం వెచ్చించి.. మంచి సలహాలు ఇచ్చాం. వాటిని విని వదిలేశారు’’  


ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. పాలు, బియ్యం, చేనేత, శ్మశానాలపై జీఎస్టీ ఎత్తేయండి. గాలి తప్ప అన్నింటిపై జీఎస్టీ విధించారు, మోదీ నాకు మంచి మిత్రుడు. ఆయనకు.. నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ దేశ ప్రగతి కోసం సంఘర్షణ తప్పదు. నా ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తాను’’


వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 54 వేల కోట్ల రుణసాయం అందాలి. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించి వాటిలో రూ.25 వేల కోట్ల కోత విధించింది. దీనిపై నేను, మా సీఎస్‌, ప్రత్యేక సీఎస్‌లతో కలిసి దిల్లీ వెళ్లి అయిదురోజుల పాటు చర్చించాం. కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పాం. దీంతో రూ.పదివేల కోట్లకు అనుమతించింది. మరో రూ. 15 వేల కోట్ల రుణానికి అడ్డంకులున్నాయి’’

- సీఎం కేసీఆర్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని