Vice President Election: ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌

దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాపై ఆయన 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్‌ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌

Updated : 07 Aug 2022 05:45 IST

చెల్లుబాటైన ఓట్లలో 74.36% ఆయన ఖాతాలోకి
ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో గెలుపు
11న ప్రమాణ స్వీకారం
ఈనాడు - దిల్లీ

దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాపై ఆయన 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్‌ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌కుమార్‌ సింగ్‌ శనివారం రాత్రి ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన ధన్‌ఖడ్‌కు న్యాయవాదిగా, చట్టసభల సభ్యునిగా, గవర్నర్‌గా సుదీర్ఘ అనుభవం ఉంది. ఈనెల 11న బాధ్యతలు చేపట్టనున్న ఆయన.. 12వ తేదీన ఒక్కరోజు సభను నడిపించే అవకాశం ఉంది. తర్వాత కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల నుంచి పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 725 మంది ఎంపీలు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఉభయసభల్లో అర్హులైన ఓటర్లు ప్రస్తుతం 780 మంది ఉన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 34 మంది పార్టీ నిర్ణయాన్ని అనుసరించి ఓటింగుకు గైర్హాజరయ్యారు. ఆ పార్టీలో ఉంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న శిశిర్‌ కుమార్‌ అధికారి, దివ్యేందు అధికారి మాత్రం ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిని మినహాయిస్తే నికరంగా 21 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. మొత్తం 55 మంది ఎంపీలు ఓటు వేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వివిధ పార్టీల ఎంపీలు ఓట్లు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేశారు. కొవిడ్‌బారిన పడ్డ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వి పీపీఈ కిట్‌లో వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల భాజపా ఎంపీలు సన్నీ దేఓల్‌, సంజయ్‌ ధోత్రే ఓటు వేయలేదు. పోలైన 725 ఓట్లలో 15 చెల్లలేదు. మిగిలిన 710 ఓట్లలో విజేతకు 356 ఓట్లు కావాల్సి ఉండగా ధన్‌ఖడ్‌కు 528, మార్గరెట్‌ ఆళ్వాకు 182 వచ్చాయి. పోలైన ఓట్లలో 72.82%, చెల్లుబాటైన ఓట్లలో 74.36% ధన్‌ఖడ్‌కు దక్కాయి. 2017లో అధికార కూటమి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు (516) కంటే ఈసారి ధన్‌ఖడ్‌కు అధిక ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాకు గత ఎన్నికల్లో పోటీచేసిన గోపాలకృష్ణగాంధీ (244) కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

వెంకయ్యనాయుడి స్థానంలోకి..

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు స్థానంలోకి వస్తున్న కొత్త ఉపరాష్ట్రపతిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ పదవిలోకి వచ్చేవారు రాజ్యసభ ఛైర్మన్‌గా పెద్దల సభను నిర్వహించడం కత్తిమీద సాము. వారి పనితీరుకు అదే కొలమానంగా నిలుస్తుంది. వెంకయ్యనాయుడు ఆ బాధ్యతలను అత్యంత ఓర్పు, నేర్పులతో నిర్వహించి.. అధికార, ప్రతిపక్షాలను ఆకట్టుకున్నారు. ధన్‌ఖడ్‌ వ్యవహారశైలి ఎలా ఉంటుంది? ప్రతిపక్షాలపట్ల ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

సాధారణ రైతు నుంచి అంచెలంచెలుగా

ఓబీసీ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌ సాధారణ రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. రాజస్థాన్‌ ఝుంఝునూ జిల్లాకు చెందిన ఈయన గ్రామస్థాయి పాఠశాలలో, తర్వాత సైనిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. రాజస్థాన్‌ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో డిగ్రీచేశారు. తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించి తమ కుటుంబంలో తొలితరం న్యాయవాదిగా నిలిచారు. అత్యంత తక్కువ సమయంలోనే రాజస్థాన్‌ హైకోర్టులో బలమైన న్యాయవాదిగా నిలదొక్కుకున్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా వాసికెక్కారు. 1989లో తొలిసారి ఝున్‌ఝునూ నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 1990-1991 మధ్య స్వల్పకాలం పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 93-98 మధ్య రాజస్థాన్‌ (కిషన్‌గఢ్‌) శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2019లో అనూహ్యంగా కేంద్రం ఆయన్ని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా నియమించింది.

రెండు సభల అధిపతులూ రాజస్థాన్‌వారే

ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడంతో పార్లమెంటు ఉభయ సభలకు నేతృత్వం వహించే అధిపతులు రాజస్థాన్‌వారే అయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా రాజస్థాన్‌లోని కోటాకు చెందినవారు. భైరాన్‌సింగ్‌ షెకావత్‌ తర్వాత రాజస్థాన్‌కు చెందిన రెండో వ్యక్తి ఉపరాష్ట్రపతి అవుతున్నారు. అందుకే ధన్‌ఖడ్‌ స్వస్థలం సహా ఆ రాష్ట్రమంతటా సంబరాలు మొదలయ్యాయి.


ప్రముఖుల శుభాకాంక్షలు

న్‌ఖడ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ని అభినందిస్తూ.. ధన్‌ఖడ్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం, అపార అవగాహన మన దేశానికి ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ధన్‌కడ్‌ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ ఓ రైతుబిడ్డ ఈ స్థాయికి ఎదగడం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ, మార్గరెట్‌ ఆళ్వా, వివిధ పార్టీల అగ్రనేతలు శరద్‌ పవార్‌, ఎం.కె.స్టాలిన్‌ తదితరులు విజేతను అభినందించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటం కొనసాగుతుందని ఆళ్వా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని