‘స్వచ్ఛ’ తెలంగాణ

స్వచ్ఛభారత్‌ మిషన్‌లో రాష్ట్రానికి పురస్కారాల పంట పండింది. ఈ ఏడాది వివిధ విభాగాల్లో ఏకంగా 13 అవార్డులు దక్కించుకోవడం ద్వారా ఘనత చాటుకుంది.  జాతీయ స్థాయిలో ఆరు

Published : 23 Sep 2022 03:41 IST

రాష్ట్రానికి 13 పురస్కారాలు

6 విభాగాల్లో మొదటి ర్యాంకు

‘సర్వేక్షణ్‌ పెద్ద రాష్ట్రాల కేటగిరీ’లో అగ్రస్థానం

ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛభారత్‌ మిషన్‌లో రాష్ట్రానికి పురస్కారాల పంట పండింది. ఈ ఏడాది వివిధ విభాగాల్లో ఏకంగా 13 అవార్డులు దక్కించుకోవడం ద్వారా ఘనత చాటుకుంది.  జాతీయ స్థాయిలో ఆరు విభాగాల్లో మొదటి ర్యాంకు, నాలుగు విభాగాల్లో రెండో ర్యాంకు, మూడు విభాగాల్లో మూడో ర్యాంకును తెలంగాణ కైవసం చేసుకుంది. అక్టోబరు 2న స్వచ్ఛభారత్‌ దివస్‌ సందర్భంగా దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కేంద్ర జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి వికాస్‌ శీల్‌ లేఖ రాశారు. స్వచ్ఛ కార్యక్రమాల్లో తెలంగాణ మంచి పనితీరు కనబరిచిందని పేర్కొన్నారు.

* సర్వేక్షణ్‌ గ్రామీణ (ఎస్‌ఎస్‌జీ - గ్రామీణ) అవార్డుల కేటగిరీలో పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డు లభించింది. ఎస్‌ఎస్‌జీ టాప్‌ జిల్లా కేటగిరీలో జగిత్యాల రెండో స్థానం, నిజామాబాద్‌ మూడో స్థానంలో నిలిచాయి.

* దక్షిణాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ టాప్‌ జిల్లా జోన్ల కేటగిరీలో నిజామాబాద్‌ రెండో స్థానం, భద్రాద్రి కొత్తగూడెం మూడో స్థానంలో నిలిచాయి.

* ‘సుజలాం 1.0 క్యాంపయిన్‌’లో తెలంగాణ మూడో స్థానంలో నిలవగా.. ‘సుజలాం 2.0 క్యాంపయిన్‌’లో రెండోస్థానం సాధించింది.

* గ్రామ పంచాయతీల జాతీయ ఫిల్మ్‌ పోటీల్లో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామానికి రెండో ర్యాంకు వచ్చింది.

* దక్షిణ జోన్‌ విభాగంలో బయోవ్యర్థాల నిర్వహణ, గోబర్‌దాన్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, గ్రేవాటర్‌ నిర్వహణ, మలవ్యర్థాల నిర్వహణ ఓడీఎఫ్‌ వాల్‌ పెయింటింగ్‌లో రాష్ట్రం మొదటి ర్యాంకులు సాధించింది.

మంత్రి హర్షం..
రాష్ట్రానికి 13 స్వచ్ఛ అవార్డులు రావడం పట్ల పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల కారణంగానే జాతీయ అవార్డులు వస్తున్నాయని చెప్పారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలని కోరారు.

జాతీయ అవార్డులకు ప్రశ్నావళి సిద్ధం..
జాతీయ పంచాయతీ అవార్డులు-2023లో రాష్ట్రం వీలైనన్ని ఎక్కువ పొందేలా పంచాయతీరాజ్‌ శాఖ కృషి చేస్తోంది. తొమ్మిది విభాగాల్లో పంచాయతీలవారీగా వివరాలను జాతీయ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించింది. 2021-22కు సంబంధించి ఆయా విభాగాల్లో సాధించిన ప్రగతిని అందులో నమోదు చేయాలని సూచించింది. అవార్డులకు ప్రతిపాదనలు పంపించేందుకు వీలుగా జిల్లా పరిషత్‌ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు ఈ నెల 28 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని