సంక్షిప్త వార్తలు(9)

రాష్ట్రంలోని మరో మూడు పురపాలికలు స్వచ్ఛ పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా అలంపూర్‌, పీర్జాదీగూడ, కోరుట్ల పురపాలికలు

Updated : 28 Sep 2022 06:27 IST

తెలంగాణకు 3 స్వచ్ఛ పురస్కారాలు

ఐఎస్‌ఎల్‌ అవార్డులను గెలుచుకున్న పీర్జాదీగూడ, కోరుట్ల, అలంపూర్‌ పురపాలికలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మరో మూడు పురపాలికలు స్వచ్ఛ పురస్కారాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా అలంపూర్‌, పీర్జాదీగూడ, కోరుట్ల పురపాలికలు ఇండియన్‌ స్వచ్ఛత లీగ్‌(ఐఎస్‌ఎల్‌) అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పురపాలకశాఖ డైరెక్టర్‌ సత్యనారాయణకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమాచారం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల కింద 1850 పట్టణాలు ఈ పోటీలో పాల్గొనగా తెలంగాణ నుంచి మూడు ఎంపికైనట్లు పురపాలకశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 15 వేల లోపు జనాభా విభాగంలో అలంపూర్‌, 25 వేల నుంచి 50 వేల జనాభా విభాగంలో పీర్జాదీగూడ, 50 వేల నుంచి లక్ష లోపు జనాభా విభాగంలో కోరుట్ల పట్టణానికి పురస్కారాలు దక్కాయి. ఈ నెల 30న దిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయనున్నారు. ఐఎస్‌ఎల్‌ అవార్డులను పొందిన పీర్జాదీగూడ, కోరుట్ల, అలంపూర్‌ పురపాలికల ప్రజాప్రతినిధులు, అధికారులను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా అభినందించారు.


డమ్మీ ఖాతాలు గుర్తించి అర్హుల పేర్లు ధరణిలో చేర్చాలి

కలెక్టర్లకు సీసీఎల్‌ఏ కార్యాలయం ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: డమ్మీ ఖాతాలను గుర్తించి అందులో నమోదైన భూముల లెక్కలు తీయాలని జిల్లాల కలెక్టర్లను సీసీఎల్‌ఏ(చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) కార్యాలయం ఆదేశించింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ ఓఎస్డీ రజత్‌కుమార్‌సైని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్‌ రికార్డుల అప్‌డేషన్‌ కార్యక్రమం(ఎల్‌ఆర్‌యూపీ)లో డమ్మీ ఖాతాలను నమోదు చేశారు. శ్రీశ్రీ, పత్వారి, కపాలి, ప్రభుత్వ భూముల పేరుతో ఈ ఖాతాలున్నాయి. పట్టాదారులు మరణించిన, పట్టాదారులు లేని భూములు, ఖాతా లేని ప్రభుత్వ భూములు డమ్మీ ఖాతాల జాబితాలో ఉన్నాయి. భూదస్త్రాల్లో నమోదైన డమ్మీ ఖాతాలను తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


వరంగల్‌ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,050 కోట్ల రుణం

ఈనాడు, వరంగల్‌: వరంగల్‌ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి ప్రభుత్వం రూ.1,050 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఇటీవల ఒప్పందం కుదిరింది. వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని కూల్చేసి ఆ స్థలంలో ఆసుపత్రి నిర్మిస్తున్నారు. గతేడాది జులైలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌లో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఏ, ఏ+ గ్రేడ్‌ దక్కించుకున్న వాటి సంఖ్య 13కి చేరింది. ఇప్పటికే 10 కళాశాలలు ఈ గ్రేడ్‌ సాధించగా.. కొద్ది రోజుల క్రితం బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల 3.5 పాయింట్లతో ‘ఏ+’ పొందింది. ఈ గ్రేడ్‌ పొందిన మొదటి ప్రభుత్వ కళాశాల ఇదే. కామారెడ్డి, సత్తుపల్లి కళాశాలలు మంగళవారం న్యాక్‌ ఏ గ్రేడ్‌ సాధించినట్లు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. అలాగే యూజీసీ స్వయంప్రతిపత్తి (అటానమస్‌) పొందిన కళాశాలలు గత ఏడాది వరకు 11 ఉండగా.. వాటి సంఖ్య 19కి చేరనున్నట్లు చెప్పారు.


తెలంగాణలో నీటి వినియోగంపై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు

ఈనాడు హైదరాబాద్‌: పోలవరం ద్వారా గోదావరి నుంచి కృష్ణా నదిలోకి మళ్లించే నీటిపై కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌-2 ఎదుట విచారణలో ఉండగా... ఆ నీటిని తెలంగాణ ఏకపక్షంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించిందని, చిన్న నీటివనరుల కింద ఉన్న నీటి కంటే ఎక్కువగా వినియోగించుకొంటున్నా మిగులు ఉన్నట్లుగా చూపించిందని కేంద్ర జల్‌శక్తి, అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖలకు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేసింది. 75 శాతం నీటి లభ్యత కింద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలు కేటాయిస్తూ ఇచ్చిన జీఓ-246ను రద్దు చేసేలా ఆదేశించాలని జల్‌శక్తి కార్యదర్శికి, పర్యావరణ అనుమతిని పరిగణనలోకి తీసుకోవద్దని లేఖలు రాసింది.


కొత్తగా 98 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 98 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,37,597కు పెరిగింది. తాజాగా మరో 110 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,32,796 మంది ఆరోగ్యవంతులయ్యారు.


‘మిషన్‌ భగీరథ’కు రూ. 1,876 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథకు రూ.1876 కోట్ల వినియోగ ఛార్జీలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరఘైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020, 2021 సంవత్సరాలకు పూర్తిగా, 2022 సంవత్సరానికి జులై వరకు తాగునీటి వినియోగ ఛార్జీలను తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ (టీడీడబ్ల్యూఎస్సీఎల్‌)కు చెల్లించేందుకు వీలుగా పరిపాలన పరమైన ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులకు సంబంధించి ఆర్థికశాఖ సోమవారం బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు జారీ చేయగా పంచాయతీరాజ్‌శాఖ తాజాగా జారీ చేసింది.


ఆసుపత్రుల నిర్మాణానికి 9 టెండర్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌లలో మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి తొమ్మిది టెండర్లు దాఖలయ్యాయి. ఈ ఆసుపత్రుల నిర్మాణానికి రహదారులు, భవనాల శాఖ గత నెలలో టెండర్లను ఆహ్వానించింది. ఆన్‌లైన్‌ ద్వారా దాఖలు చేసేందుకు తొలుత ఈ నెల 19ని చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తటంతో టెండర్ల దాఖలు గడువును మరో వారం రోజులపాటు పొడిగించారు. ఆ గడువు మంగళవారంతో ముగియటంతో టెండర్లను తెరిచారు. ఒక్కో ఆసుపత్రి నిర్మాణానికి మూడు చొప్పున టెండర్లు దాఖలైనట్లు తేలింది. టెండర్లు దాఖలు చేసిన సంస్థల్లో మేఘా, ఎల్‌ అండ్‌ టీ, డీఈసీ ఉన్నాయి.


యాసంగి బియ్యం గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌:  యాసంగి(2021-22) సీజనుకు సంబంధించి ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం గడువును కేంద్రం మరో నెల రోజులు పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 30వ తేదీతో సమయం ముగియనుంది. ఈ సీజనులో 50.39 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చింది. ఆ ధాన్యం నుంచి సుమారు 35 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. ఇందులో 10.81 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. మిగిలిన వాటిని సాధారణ బియ్యంగా మార్చాల్సి ఉంటుంది. ఎఫ్‌సీఐకి ఇప్పటి వరకు సుమారు లక్ష మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇచ్చారు. బియ్యం ఇచ్చేందుకు గడువు పొడిగించాల్సిందిగా పౌరసరఫరాల శాఖ గడిచిన వారంలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు లేఖ రాయగా  తాజా ఉత్తర్వులొచ్చాయి.   కస్టం మిల్లింగ్‌ వేగం పెంచి వానాకాల సీజను బియ్యాన్ని సకాలంలో ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రైస్‌ మిల్లర్లు హామీ ఇచ్చారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను మంగళవారం కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.  వచ్చే వానాకాలానికి సంబంధించిన ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లర్లకే ఇవ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్‌ ప్రతినిధులు గంపా నాగేందర్‌, సంతోష్‌కుమార్‌, శ్రీరాములు, శివ, రాజేందర్‌గౌడ్‌, శశిధర్‌ తదితరులు ఉన్నారు.


ఆదివాసీ గిరిజనులు X అటవీ అధికారులు..

సత్తుపల్లి, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో ఆదివాసీ గిరిజనులు, అటవీ అధికారుల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తింది. సత్తుపల్లి శివారు కాకర్లపల్లి బీట్‌ పరిధిలోని 25 ఎకరాల రిజర్వ్‌ ఫారెస్ట్‌ పోడు భూముల్లో మంగళవారం ఆదివాసీ మహిళలు జీడి మొక్కలు నాటేందుకు ప్రయత్నించగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. గిరిజనుల చేతుల్లోని వ్యవసాయ పరికరాలను లాక్కునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. 30 ఏళ్ల క్రితం పోడు కొట్టుకుని పంటలు సాగు చేస్తూ జీవిస్తున్నామని, అటవీ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆదివాసీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చావనైనా చస్తాం గానీ.. పోడును వదులుకోబోమని స్పష్టం చేశారు.ఆ భూమి అటవీహక్కుల చట్టం కింద ఉన్న పోడు కాదని, కొత్తగా కొట్టిన పోడని అటవీ అధికారులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని