మన దగ్గరే మస్త్‌ వైద్య సీట్లు

తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రావడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తంగా వాటి సంఖ్య 6,540కి చేరిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Updated : 04 Oct 2022 05:17 IST

విదేశాలకు వెళ్లనవసరం లేదు

ఈ ఏడాది 1,200 ఎంబీబీఎస్‌ సీట్ల రాక

అందుబాటులో మొత్తం 6,540 సీట్లు 

ఇది దసరా పండగ శుభవార్త: హరీశ్‌రావు

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రావడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తంగా వాటి సంఖ్య 6,540కి చేరిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోనే పుష్కలంగా వైద్య సీట్లు  ఉండడంతో.. వాటి కోసం రాష్ట్ర విద్యార్థులు ఇక పొరుగు రాష్ట్రాలకు.. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇది వైద్య విద్యార్థులకు, తల్లిదండ్రులకు దసరా పండగ శుభవార్త అని  పేర్కొన్నారు. 70 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణకు మూడు వైద్య కళాశాలలు వస్తే.. గత ఏడేళ్లలోనే కొత్తవి 17 తెచ్చుకున్నామన్నారు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాలను, నర్సింగ్‌ కాలేజీని నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారనీ, రూ.4,080 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. కొత్త కళాశాలల రాకతో 650 పడకల ఆసుపత్రి, 30 రకాల స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు పేదలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు.

‘‘రాష్ట్రం ఏర్పడినపుడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 850 ఎంబీబీఎస్‌ సీట్లుండగా.. ఇప్పుడు 2,901కి పెంచుకున్నాం. అంటే 2,052 సీట్లు అదనం. 3.3 రెట్లు పెరిగాయి. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం. బి కేటగిరీలోనూ 85 శాతం సీట్లు స్థానికులకు వర్తింపజేశాం. తద్వారా 1,067 సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. 2014లో 613 పీజీ వైద్య సీట్లుంటే.. నేడు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంలోనే 1,249కు పెరిగాయి. దేశంలో ఇంత భారీగా పీజీ సీట్లు పెంచుకున్న రాష్ట్రాల్లో తెలంగాణనే అగ్రగామి. 192 పీజీ సీట్లు ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా వచ్చాయి. ప్రభుత్వ- ప్రైవేటు రంగంలో కలిపి 2,449 పీజీ సీట్లున్నాయి. ఎనిమిదేళ్ల కిందట కేవలం 4 నర్సింగ్‌ కళాశాలలే ఉండేవి. ఇప్పుడవి 19కి పెరిగాయి.

భాజపా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తోంది. దేశం మొత్తమ్మీద 157 వైద్య కళాశాలలను మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. ప్రతిపాదనలు రాలేదని చెప్తే.. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలు బయటపెట్టాం. ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వకుండా మేమే ఇచ్చామంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడడం దిగజారుడుతనం. ఆర్‌ఎంపీ, పీఎంపీలపై నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. నిబంధలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించాం’’ అని వైద్య మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని