ఆన్‌లైన్‌లో రుణయాప్‌లు లేకుండా చేయాలి

పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటూ.. వందల కుటుంబాలను కకావికలం చేస్తూ.. వేల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న రుణయాప్‌ల దాష్టీకాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిమిత అవకాశాలే ఉన్నాయని, ఆర్బీఐయే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

Published : 07 Oct 2022 03:28 IST

అప్పుడే వాటి దాష్టీకాలకు అడ్డుకట్ట

ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ నివేదన

ఈనాడు, హైదరాబాద్‌: పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటూ.. వందల కుటుంబాలను కకావికలం చేస్తూ.. వేల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న రుణయాప్‌ల దాష్టీకాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిమిత అవకాశాలే ఉన్నాయని, ఆర్బీఐయే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈమేరకు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక పంపించింది. ‘‘ఆర్‌బీఐ వద్ద నమోదు చేసుకున్న రుణయాప్‌లు పరిమితంగా ఉండగా.. గుర్తింపు లేనివే అత్యధికంగా ఉన్నాయి. ఇవి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా భారీగా వడ్డీలను గుంజుతున్నాయి. రుణాన్ని తిరిగిచెల్లించినా చేయలేదని పేర్కొంటూ.. మరింత చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. ఇక చెల్లింపులు చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటే దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతూ అవమానిస్తున్నారు. దీన్ని తట్టుకోలేక బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లోన్‌యాప్‌ల దాష్టీకానికి రాష్ట్రంలో రెండేళ్లలో 10 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు. రుణయాప్‌లపై ఫిర్యాదులు గత ఏడాది వందలోపే ఉండగా.. ఈ ఏడాది ఇప్పటికే వెయ్యి దాటాయి. 80 నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు(ఎన్‌బీఎఫ్‌సీ) అనుబంధంగా ఉన్న 200కుపైగా లోన్‌యాప్‌లను పోలీసు, ఆర్థిక శాఖలు గుర్తించాయి. వీటిలో ఆర్‌బీఐ గుర్తింపు ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు మూడో వంతు మాత్రమే. ఏ సంస్థకూ అనుబంధంగా లేని యాప్‌లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసినా లేదా నిబంధనలు పాటించని యాప్‌లను ప్లేస్టోర్‌లో నుంచి తొలగించినా వేరే పేర్లతో మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాప్‌లు ఆన్‌లైన్‌లో ఏ రూపంలోనూ అందుబాటులో లేకుండా చూడాలి. గుర్తింపు పొందిన ఎన్‌బీఎఫ్‌సీలు, వాటికి అనుబంధంగా ఉన్న రుణయాప్‌ల వివరాలను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ఈ సంస్థలు ఎక్కడ ఉన్నాయి? వాటికి కార్యాలయం ఉందో, లేదో కూడా గుర్తించే పరిస్థితి లేదు. కేసులు నమోదైనపుడు విచారణకు వెళ్లే పోలీసులకు అక్కడ ఆ సంస్థల ఆనవాళ్లే ఉండటం లేదు’’ అని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని