పంట ఒక్కటే ఆదాయం పెంచదు

‘‘సన్న, చిన్నకారు రైతులకున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువ. వారు పంటతో పాటు పాడి, కోళ్ల పెంపకం, ఇతర వ్యాపకాలు చేపడితేనే ఆదాయం పెరుగుతుంది.

Updated : 27 Nov 2022 05:18 IST

పాడి, కోళ్ల పెంపకం, ఇతర వ్యాపకాలతోనే రైతులకు మేలు
తెలుగు రాష్ట్రాల్లో విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలి
‘ఈనాడు’తో నీతిఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ రమేశ్‌చంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘సన్న, చిన్నకారు రైతులకున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువ. వారు పంటతో పాటు పాడి, కోళ్ల పెంపకం, ఇతర వ్యాపకాలు చేపడితేనే ఆదాయం పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో విత్తన పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెంచవచ్చు’’ అని నీతిఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ రమేశ్‌చంద్‌ చెప్పారు. శనివారం హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో వ్యవసాయంలో ఆదాయం పెరగకపోవడానికి కారణాలు, పెంచే మార్గాలు తదితరాలను వివరించారు.


* రైతుల ఆదాయాన్ని 2022 డిసెంబరు నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పింది. ఆ లక్ష్యం నెరవేరిందని భావిస్తున్నారా?

దేశమంతా రైతులందరి ఆదాయం రెట్టింపు కాలేదేమో. కానీ మధ్యప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో మెరుగైంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అని కేంద్రం చెప్పిన కార్యక్రమాన్ని అభివృద్ధి పథకం మాదిరిగా చూడకూడదు. దానిని ఒక లక్ష్యంగా పెట్టుకుని .. సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం చెప్పింది. ఉదాహరణకు మార్కెట్‌ సంస్కరణలు, ఆన్‌లైన్‌లో పంటల విక్రయాలకు జాతీయ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ ఏర్పాటు, పంటల ఉత్పాదకత పెంచేందుకు కొత్త వంగడాల విడుదల...ఇలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ రైతుల ఆదాయాన్ని పెంచేవే.


* సన్న, చిన్నకారు రైతుల ఆదాయం ఏ రాష్ట్రంలోనూ పెరగడం లేదు ఎందుకు?

సన్న, చిన్నకారు రైతుల ఆదాయం అసలు పెరగడం లేదంటే అంగీకరించను. అనుకున్న స్థాయిలో పెరగడం లేదంటే అంగీకరిస్తాను. వారి ఆదాయం ఎంత పెరగాలి? అంత పెరగడానికి ఉన్న అవకాశాలు ఎన్ని? అనేది కూడా చూడాలి. మనదేశంలో సన్నకారు రైతులకున్న భూమి విస్తీర్ణం చాలా తక్కువ. దానిలో ఏ పంట సాగుచేసినా ఆదాయం ఎంతొస్తుంది? ఎంత పెరుగుతుందనేది శాస్త్రీయ కోణంలో చూడాలి. పంటల సాగుతో పాటు పాడి, కూరగాయల పెంపకం...ఇలా ఇతర వ్యాపకాలు పెట్టుకుని మిశ్రమ సేద్యం చేస్తే రైతుల ఆదాయం పెరుగుతుంది.


* తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి తీరు ఎలా ఉంది?

దేశంలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతున్న మొదటి అయిదు రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. అగ్రస్థానానికి రావడానికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కృషి జరగాలి. పంటల మార్పిడి విధానం పాటించేలా రైతులను ప్రోత్సహించాలి. ఈ రాష్ట్రాల్లో విత్తన పంటల సాగు, విత్తనోత్పత్తి ఎక్కువగా ఉంది. దేశంలో నాణ్యమైన విత్తనాలకు డిమాండు అధికంగా ఉన్నందున విత్తనోత్పత్తిని రైతులకు ఆదాయ వనరుగా మార్చాలి.


* తెలంగాణలో రైతుబంధు పథకం కింద రైతులకు నేరుగా ఆర్థికసాయం చేసే విధానం ఎలా ఉంది?

సన్న, చిన్నకారు రైతులకు సాయం చేయాలి. నాకు తెలంగాణలో ఒక ఐఏఎస్‌ అధికారి స్నేహితుడు ఉన్నారు. అతనికి కూడా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నారని చెప్పారు. అలాంటి ధనవంతులకు, పంటలు సాగుచేయని వారికి ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏటా ఎందుకు డబ్బు ఇవ్వాలి? పంటలు సాగుచేసే రైతులకు మాత్రమే కొన్ని నిబంధనలు పెట్టి సొమ్ము ఇస్తే బాగుంటుంది. 


* వ్యవసాయ పరిశోధన సంస్థలు, రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటానికి ఏం చేయాలి?

పరిశోధన ఫలాలు రైతులకు చేరాలంటే గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ బలంగా ఉండాలి. కొత్త పరిజ్ఞానాన్ని రైతులకు చెప్పే వ్యవస్థలుండాలి. కానీ చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ విస్తరణ బడ్జెట్‌ కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నందున ఈ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో అంకుర సంస్థలు, డిజిటల్‌ పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్నాయి. వాటిని రైతులకు చేర్చాలి.


* మన సంప్రదాయ నూనెగింజల పంటలు వదిలేసి ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడం సరైన విధానమేనా?

మనదేశంలో కొన్ని దశాబ్దాలుగా నూనెగింజల ఉత్పాదకత పెరగడం లేదు. 20 ఎకరాల్లో వేరుసెనగ సాగుచేస్తే ఆ పంట నుంచి వచ్చే వంటనూనె పరిమాణంలో పామాయిల్‌ను ఎకరా విస్తీర్ణంలో ఆయిల్‌పాం పంట నుంచి ఉత్పత్తి చేయవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లోనే ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచాలని కేంద్రానికి నేను గతంలో సూచించాను. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో ఇది పెరుగుతోంది. సంప్రదాయ నూనెలే కావాలనడం కూడా సరికాదు. ప్రజలు వినియోగిస్తున్న వంటనూనెల పరిమాణంలో 30 శాతానికి పైగా పామాయిలే. దానిని విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. అందుకు రూ.వేల కోట్లు వెచ్చించే బదులు ఆయిల్‌పాం పంటను ఇక్కడే పండిస్తే ఆ సొమ్ము మనరైతులకే అందుతుంది.


* మద్దతు ధర నిర్ణయించడానికి ఒక పంట ఖర్చును దేశమంతా సగటున ఎలా లెక్కిస్తారు ? దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు కదా?

నిపుణులైన వారు సభ్యులుగా ఉన్న వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ మద్దతు ధర నిర్ణయిస్తుంది.  ఇందుకోసం దేశమంతా సాగువ్యయం లెక్కలను శాస్త్రీయంగా సేకరించి, క్రోడీకరించి ఒక అంచనాకు వస్తుంది. ఒకదేశంలో ఒక పంటకు వేర్వేరు మద్దతు ధరలు ప్రకటించడం సాధ్యం కాదు. జాతీయ సగటు మాత్రమే తీసుకుని ఒక పంటకు ఒక మద్దతు ధర మాత్రమే నిర్ణయించగలం. రాష్ట్రాల్లో వాతావరణం, భూముల ఆధారంగా ఖర్చు తక్కువగా ఉండే విభిన్న పంటలు పండిస్తే మద్దతు ధర సరిపోతుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు