అందరికీ సమన్యాయమే లక్ష్యం

భారత రాజ్యాంగం ప్రజలకు హక్కులతో పాటు ఎన్నో బాధ్యతలను అప్పగించిందని, వాటిని నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.నంద సూచించారు.

Published : 27 Nov 2022 03:55 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.నంద

ఈనాడు, హైదరాబాద్‌: భారత రాజ్యాంగం ప్రజలకు హక్కులతో పాటు ఎన్నో బాధ్యతలను అప్పగించిందని, వాటిని నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.నంద సూచించారు. దక్షిణ భారత న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ ఎస్‌.నంద అంబేడ్కర్‌ పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వతంత్ర భారతంలో సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైన న్యాయం ఏ ఒక్కరికి అందకపోయినా రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరనట్లేనని ఆయన అన్నారు. ‘ప్రాథమిక హక్కులు, బాధ్యతలపై అందరికీ అవగాహన ఉండాలి. మన సమున్నత రాజ్యాంగ వ్యవస్థ న్యాయవ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యాన్ని, స్వతంత్రతను కట్టబెట్టింది’ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వి.రఘునాథ్‌, ప్రధాన కార్యదర్శి జెల్లి నరేందర్‌ మాట్లాడుతూ..అన్ని వ్యవస్థలు నిజాయతీ, నిబద్ధతతో పనిచేస్తేనే రాజ్యాంగానికి నిజమైన సార్థకత అన్నారు. భిన్న సంస్కృతులు, ఆలోచనలు, ఆచారాలున్న దేశాన్ని రాజ్యాంగం ఏకతాటిపై నడిపిస్తోందని హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వరి పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు జి.విద్యాసాగర్‌, సి.మల్లేశ్వరరావు, వీఆర్‌ రెడ్డి, మీర్‌ మసూద్‌ ఖాన్‌, వహీద్‌ అలీ ఖాన్‌, పాలకుర్తి కిరణ్‌, ఎస్‌.నాగేందర్‌ తదితరులు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని