Roads Repair: రోడ్లపై గుంతలను ఇక ‘చాప’చుట్టేయొచ్చు!

అమెరికా రోడ్‌ప్యాచ్‌.. రహదారుల మరమ్మతుల్లో ఇదో నూతన ఆవిష్కారం.

Updated : 30 Nov 2022 10:34 IST

రహదారుల మరమ్మతుల్లో విప్లవం అమెరికా రోడ్‌ప్యాచ్‌..

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా రోడ్‌ప్యాచ్‌.. రహదారుల మరమ్మతుల్లో ఇదో నూతన ఆవిష్కారం. అమెరికాతో పాటు ఐరోపా దేశాల్లో ఉపయోగిస్తున్న ఈ సాంకేతికతను మన దేశంలోనూ వినియోగించేందుకు సాధ్యాసాధ్యాలపై హైదరాబాద్‌లోని ‘నేషనల్‌్ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)’ పరిశీలిస్తోంది. రోడ్ల మరమ్మతుల్లో ఇదో విప్లవంగా ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో మరింత ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పాతకాలపు ఇళ్లపై వేసిన పెంకుల మధ్య ఖాళీల నుంచి వర్షపునీరు కారకుండా తారుతో తయారుచేసిన ఓ విధమైన పట్టాను కప్పేవారు. అదేతీరులో ఈ విధానంలో ఓ షీటును రోడ్డు దెబ్బతిన్న ప్రాంతంపై కప్పితేచాలు.. ఆ రహదారి సాధారణస్థితికి చేరుకుంటుందని నిపుణులు తెలిపారు.

ఎలా పనిచేస్తుంది?

* చాప చుట్టినట్లుగా ఉండే ఈ ప్రత్యేకషీటును ఎంత కావాలంటే అంత పరిమాణంలో కత్తిరించుకోవచ్చు. దీనిపై తారు ఆవిరి కాకుండా ఉండేందుకు ఒక పేపర్‌ ఉంటుంది. దాన్నితీసి మరమ్మతులు చేసేచోట షీట్‌ను అతికిస్తారు. అనంతరం దిమ్మిసతో కొడితే సరిపోతుంది. తారు, సిమెంటు రోడ్ల మరమ్మతులకు ఉపయోగపడే రీతుల్లో సెయింట్‌ గోబైన్‌ సంస్థ దీన్ని రూపొందించింది.

* శాండ్‌విచ్‌ మాదిరిగా ఇది పొరలు పొరలుగా ఉంటుంది. ఆ పొరల్లో తారు, సింథటిక్‌, ఫైబర్‌ మిళితమై ఉంటాయి. ఈ మూడింటితో ఉన్న ఆ పదార్థం నీటి తాకిడిని కూడా తట్టుకుంటుంది. అదే సిమెంటు రోడ్డుపై పడిన గుంతలను పూడ్చేందుకు రూపొందించిన పొరల్లో సిమెంటు, సింథటిక్‌, ఫైబర్‌ మిళితమై ఉంటాయి. సుమారు 69 చ.అడుగుల షీటును ఒక్కోరోల్‌గా ఆ కంపెనీ తయారు చేసింది.

* సాధారణంగా గుంతలు పడినచోట సంప్రదాయ పద్ధతుల్లో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. తర్వాత కంకర, తారు కలిపిన మిశ్రమాన్ని ఆ ప్రాంతంలో నింపి, చదును చేయాలి. అవసరం మేరకు రోలర్‌ను నడపాల్సి ఉంటుంది. ఇంతచేసినా కొద్దికాలానికి ఆ ప్రాంతం మళ్లీ గుంతలమయంగా మారుతుంటుంది. అమెరికా రోడ్‌ప్యాచ్‌ను ఒకదఫా వినియోగిస్తే కనీసం 4-5 ఏళ్లపాటు మన్నికగా ఉంటుందని అంచనా.

ఎక్కడెక్కడ ఉపకరిస్తుంది?

రహదారిపై గుంతలను పూడ్చేందుకు, మ్యాన్‌హోల్స్‌ వంటివి ఉన్న ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ సమయంలోను, వంతెనలపై అస్తవ్యస్తంగా ఉన్న అతుకులను పూడ్చేందుకు ఈ షీటును ఉపయోగించవచ్చు. విద్యుత్‌, కేబుల్‌, నీటిపైపుల కోసం రోడ్లను తవ్విన తరవాత పూడ్చేటప్పుడు రహదారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.

* ఇద్దరు మనుషులు షీటును తీసుకువచ్చి ఎంతకావాలో అంత ముక్కను కత్తిరించి ఆ ప్రాంతంలో అతికిస్తే చాలు. 3-4 నిముషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీనికి ట్రాఫిక్‌ను మళ్లించాల్సిన అవసరం లేదు. భారీ యంత్రాలను ఉపయోగించాల్సిన పని అంతకన్నాలేదు. నేలమీద చాప పరిచినట్లు ఆ షీటు పరిస్తే చాలు.


మరమ్మతుల్లో ఇది విప్లవమే..

అమెరికన్‌ రోడ్‌ప్యాచ్‌.. రోడ్డు మరమ్మతుల్లో ఇదో విప్లవమే. అమెరికా, ఐరోపా దేశాల కన్నా మనదేశ రహదారులకు ఎంతో ఉపయుక్తం. మన రోడ్లపై ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వర్షపునీరు ఎక్కువ సమయం నిలిచి రోడ్లు త్వరితగతిన దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షీటు ఎక్కడ కావాలంటే అక్కడ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. వినియోగించుకోవచ్చు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఖర్చు తక్కువగానే ఉంటుందనే అధ్యయనాలు చెబుతున్నాయి. మన వాతావరణ పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా వినియోగించి దాని మన్నిక, వ్యయం తదితరాలను అంచనా వేయాలి.

కె.బిక్షపతి, డైరెక్టర్‌ జనరల్‌, న్యాక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని