84 పురపాలికలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌లు

రాష్ట్రంలో 84 నగర, పురపాలక సంస్థలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌లను రూపొందిస్తున్నట్లు పురపాలకశాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 01 Dec 2022 04:47 IST

పురపాలకశాఖ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 84 నగర, పురపాలక సంస్థలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌లను రూపొందిస్తున్నట్లు పురపాలకశాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వీటి ముసాయిదాలను డిసెంబరు నెలాఖరులోపు ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నట్లు ప్రకటించింది. ‘కాలం చెల్లిన మాస్టర్‌ప్లాన్‌లే’ శీర్షికతో మంగళవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై పురపాలక శాఖ స్పందించింది. తెలంగాణలో పట్టణాల మాస్టర్‌ప్లాన్‌లను అధునాతన జియోగ్రాఫికల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. భూ వినియోగ వివరాలను సులభంగా తెలుసుకునేలా ఉండటంతో పాటు సులువుగా అనుమతులు పొందడానికి ఈ విధానం దోహదపడుతుందంది. హై రిజల్యూషన్‌ శాటిలైట్‌ చిత్రాల సాయంతో బేస్‌మ్యాప్‌లను రూపొందిస్తున్నట్లు పేర్కొంది. నేషనల్‌ రిమోట్‌సెన్సింగ్‌ ఏజెన్సీ చిత్రాలకు, సర్వే నంబర్ల వివరాల మ్యాపులను అనుసంధానం చేసి పట్టణ ప్రణాళిక నిపుణులతో మాస్టర్‌ప్లాన్‌లు రూపొందిస్తున్నట్లు వివరించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌, డీటీసీపీ ద్వారా 54, అమృత్‌ పథకం కింద 10, తెలంగాణ మున్సిపల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ కింద మరో 20 మాస్టర్‌ప్లాన్‌లకు రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొంది. మహబూబాబాద్‌, జోగిపేట, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవరకొండ పట్టణాల మాస్టర్‌ప్లాన్‌లను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని