అవుటర్‌ చుట్టూ మెట్రో

హైదరాబాద్‌ చుట్టూ, అవుటర్‌ రింగ్‌రోడ్డు వెంబడి మెట్రో  రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Published : 10 Dec 2022 05:56 IST

కేంద్రం సహకారం ఉన్నా, లేకున్నా.. విస్తరిస్తాం

వసతుల కల్పనకు ఆర్‌ అండ్‌ డీ అవసరం

ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రో శంకుస్థాపన సభలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే-బండ్లగూడ జాగీరు, నార్సింగి: హైదరాబాద్‌ చుట్టూ, అవుటర్‌ రింగ్‌రోడ్డు వెంబడి మెట్రో  రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాలకు విస్తరించడంతోపాటు బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ మెట్రో లైన్‌ కలపాల్సి ఉందన్నారు. కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా భవిష్యత్తులో ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తామని స్పష్టం చేశారు. మెట్రో రైలు రెండో దశకు సీఎం శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు మైండ్‌స్పేస్‌ వద్ద శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘విమానాశ్రయంలో ట్రాఫిక్‌ పెరిగిపోయింది. గత పాలకుల నిర్లక్ష్యంతో విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ లేదు. రూ.6,250 కోట్లతో 31 కి.మీ. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకి వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, జీఎంఆర్‌ నిధులతో శంకుస్థాపన చేసుకుని శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది. ఇందులో 27.5 కి.మీ. ఆకాశమార్గం, 2.5 కి.మీ. భూగర్భంలో, ఒక కిలోమీటరు భూ మార్గంలో మెట్రో మార్గం వస్తుంది. ఈ పనులు సత్వరం ప్రారంభమవుతాయి. ఇది 100- 120 కి.మీ. వేగంతో ప్రయాణించే మెట్రో. హైదరాబాద్‌లో ఏ మూలన ఉన్న సులువుగా విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది’ అని సీఎం వివరించారు.

దిల్లీ కంటే పెద్దది

‘చరిత్రలో, వర్తమానంలో సుప్రసిద్ధ నగరం హైదరాబాద్‌. ఒక సందర్భంలో దేశ రాజధాని దిల్లీ కంటే వైశాల్యం, జనాభాలో చాలా పెద్దది. చెన్నై, దేశంలోని అనేక ఇతర నగరాల కంటే ముందుగానే 1912లోనే విద్యుత్తు వచ్చిన నగరమిది. ఇది నిజమైన కాస్మోపాలిటన్‌ సిటీ. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకుని అద్భుతమైన విశ్వనగరంగా మారింది. ఏ నగరంలోనూ లేని అద్భుతమైన సమశీతోష్ణ వాతావరణం ఇక్కడ ఉంటుంది. భూకంపాలు రాకుండా సురక్షితంగా ఉండే నగరమిది.’

పట్టుబట్టి పవర్‌ ఐలాండ్‌గా మార్చాను  

‘సమైక్య రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంతో హైదరాబాద్‌లోసమగ్రత లేకుండా చాలా విషయాల్లో ఇబ్బందులు పడ్డాం. కృష్ణా, గోదావరి మంచినీటి పథకాలు ప్రారంభించినా.. అనుమతులు లేక నత్తనడక నడిచాయి. అవన్నీ పూర్తి చేసి నీటి సమస్య లేకుండా చేసుకున్నాం. క్షణం కూడా కరెంట్‌ పోకుండా ఏర్పాటు చేసుకున్నాం. నేనే పట్టుబట్టి హైదరాబాద్‌ను పవర్‌ఐలాండ్‌గా మార్చాను. న్యూయార్క్‌, లండన్‌, ప్యారిస్‌లో కరెంట్‌ పోవచ్చు గానీ హైదరాబాద్‌లో పోదు. ఎస్‌ఆర్‌డీపీ, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించుకున్నాం. 40 నుంచి 60 అంతస్తుల ఆకాశహర్మ్యాలకు అనుమతులిస్తున్నాం. ఇలాంటి చర్యలతో ఐటీ, పారిశ్రామిక, నిర్మాణరంగాలు అద్భుతంగా పురోగమిస్తున్నాయి.’ ‘బతకడానికి వచ్చేవారు.. బతుకు బాగుందని వచ్చే వారితో ఏటా హైదరాబాద్‌ జనాభా లక్షల్లో పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాల్సి ఉంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఆర్‌ అండ్‌ డీని ఏర్పాటు చేసుకుని పురోగమించాలి. పురపాలక మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చాలా విజయాలు, మరిన్ని మౌలిక వసతులు సాధించాల్సి ఉంది ’ అని కేసీఆర్‌ అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ ఆదర్శమని, సీఎం కేసీఆర్‌ దార్శనికతతో పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. శంషాబాద్‌, కొత్వాల్‌గూడ, మణికొండ ప్రాంతాల్లో పేద రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కోరగా, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.


చెక్కుల అందజేత

అంతకుముందు ఉదయం 11.24 గంటలకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక బస్సులో రహేజా మైండ్‌ స్పేస్‌కు చేరుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య పండితులు ఆయనను పూర్ణకుంభ స్వాగతంతో శంకుస్థాపన స్థలికి తీసుకెళ్లారు. అక్కడ కేసీఆర్‌ చండీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. 11.30 గంటలకు మెట్రో రెండోదశ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 11.34 నిమిషాలకు పోలీసు అకాడమీ మైదానంలో సభకు సీఎం పయనమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోలో 10 శాతం భాగస్వాములుగా ఉన్న హెచ్‌ఎండీఏ తరఫున రూ.625 కోట్ల చెక్కును కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌, జీఎంఆర్‌ తరఫున రూ.625 కోట్ల చెక్కును ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు చల్ల ప్రసన్న, కిశోర్‌కుమార్‌ సీఎంకు సభలో అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, అరికపూడి గాంధీ, వివేకానందగౌడ్‌, సుధీర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌, సాయన్న, ఎమ్మెల్సీ వాణీదేవి, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సీఎం సభలో ప్లకార్డుల కలకలం

సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్టీ-2017 ఉర్దూ మీడియం కాంట్రాక్టు అభ్యర్థులు.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో ఉలిక్కిపడిన పోలీసులు వారి వద్దకు పరుగు తీశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం వేదికపై నుంచి కిందకు వెళ్లి తగు ఆదేశాలిచ్చారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని బయటకు తరలించారు.

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో మార్గమిలా..

నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోను నిర్మిస్తున్నారు. ఇది మైండ్‌ స్పేస్‌ నుంచి బయోడైవర్సిటీ, కాజాగూడ, నానక్‌రాంగూడ కూడలి, ఓఆర్‌ఆర్‌ లోపల వైపు నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, విమానాశ్రయ కార్గో, విమానాశ్రయంలోకి నేరుగా చేరుకుంటుంది. ఈ మార్గంలో 9 స్టేషన్లు రానున్నాయి. సీఎం రాక సందర్భంగా.. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి మైండ్‌స్పేస్‌ వైపు వెళ్లే వాహనాలను సైబర్‌టవర్స్‌ వద్ద మళ్లించి, సీవోడీ జంక్షన్‌ నుంచి ఇనార్బిట్‌ మాల్‌వైపు వదిలారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని