అయినోళ్లే ఆమెకు శత్రువులు

అతివలకు అయినవాళ్లే శత్రువులవుతున్నారు. రాష్ట్రంలో వారిపై జరుగుతున్న నేరగణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

Published : 25 Jan 2023 03:36 IST

మహిళలపై నేరాల్లో గృహహింస కేసులే అధికం
మొత్తం కేసుల్లో సగానికి పైగా ఈ కోవలోనివే..

ఈనాడు, హైదరాబాద్‌ : అతివలకు అయినవాళ్లే శత్రువులవుతున్నారు. రాష్ట్రంలో వారిపై జరుగుతున్న నేరగణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల్లో సగం గృహహింసవే కావడం గమనార్హం. అయితే గతంలో మాదిరిగా కాకుండా తమపై జరిగే నేరాల గురించి ఫిర్యాదులు చేసేందుకు బాధితురాళ్లు ముందుకొస్తుండటంతో ఈ తరహా కేసుల సంఖ్య పెరుగుతోందని పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలోని షీ బృందాలు కలిగిస్తున్న అవగాహన కూడా బాధితురాళ్లు ముందుకొచ్చేలా చేస్తోంది. నేరుగా ఠాణాకే వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఈమెయిల్‌, క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించడమూ కేసుల నమోదు పెరుగుదలకు కారణం.

బహుభార్యత్వం కేసుల్లో 40 శాతం

మహిళలపై నేరాలు గతేడాది కంటే 3.8శాతం పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 2021లో 17,253 నేరాలు జరిగితే.. గతేడాది 17,908 నమోదయ్యాయి. గృహహింస కేసుల్లోనూ పెరుగుదల నమోదైంది. అంతకుముందుకంటే గతేడాది 8 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా సగంకుపైగా కేసులు ఇవే. అయితే బహుభార్యత్వం ఉదంతాలు విపరీతరంగా పెరగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. 2021తో పోల్చితే 2022లో ఈ తరహా కేసుల్లో ఏకంగా 40శాతం పెరుగదల నమోదైంది. ఈ కారణంగానే గృహహింస కేసులు తారస్థాయికి చేరుతున్నాయని పోలీస్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

జీవితాంతం కటకటాలకే పరిమితం

మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు పడుతున్న ఉదంతాలూ పెరుగుతున్నాయి. కేసు నమోదైనప్పటి నుంచి మొదలు దర్యాప్తు, ఆధారాల సేకరణ, అభియోగపత్రం దాఖలు, న్యాయస్థానాల్లో సాక్షులను ప్రవేశపెట్టడం వరకు పోలీసులు క్రియాశీలంగా వ్యవహరిస్తుండటం ఇందుకు కారణం. మొత్తం 59 కేసుల్లో 70 మందికి జీవితఖైదు ఖరారైంది. వీటిలో వరకట్న హత్యలు/మరణాలకు సంబంధించి 25 కేసుల్లో 28 మందికి.. రెండు హత్యాచార కేసుల్లో ముగ్గురికి.. 4 రేప్‌ కేసుల్లో అయిదుగురికి.. 25 హత్యకేసుల్లో 31 మందికి.. డబ్బుల కోసం మహిళల్ని చంపిన 3 కేసుల్లో ముగ్గురికి జీవితఖైదు పడిన ఉదంతాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని